ఒక్క చుక్కా పో‘నీరు’!

ABN , First Publish Date - 2020-12-04T04:20:57+05:30 IST

భూగర్భ జలాలను సద్వినియోగం చేయడానికి కసరత్తు మొదలైంది. ప్రతి నీటిచుక్కనూ వినియోగించేలా...సస్యశ్యామలం చేసేలా చూడాలని యోచిస్తున్నారు. దీనికోసం ఐదు శాఖల అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు.

ఒక్క చుక్కా పో‘నీరు’!
భూగర్భ జలాలను మాన్యువల్‌గా పరిశీలిస్తున్న సిబ్బంది

 జల వినియోగానికి ప్రణాళిక

ఐదు శాఖల సంయుక్త కార్యాచరణ

ప్రపంచ బ్యాంక్‌ ప్రాజెక్టు కింద అమలు

భూ గర్భ జలాల సద్వినియోగమే లక్ష్యం


భూగర్భ జలాలను సద్వినియోగం చేయడానికి కసరత్తు మొదలైంది. ప్రతి నీటిచుక్కనూ వినియోగించేలా...సస్యశ్యామలం చేసేలా చూడాలని యోచిస్తున్నారు. దీనికోసం  ఐదు శాఖల అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ భూ గర్భ జలాలు సమృద్ధిగా ఉన్నా... వినియోగించడంలో భారీగా తారతమ్యం ఉంటోంది. ఈ లోపాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్‌ ప్రాజెక్టు కింద కొత్త విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఆ మేరకు దిశానిర్దేశం చేసింది. ముఖ్యంగా సాగునీటి కాల్వలు... ఇతర నీటి వనరులు అందుబాటులో లేని రైతులకు భూ గర్భ జలాలను అందుబాటులోకి తీసుకురావాలన్నదే తాజా ప్రణాళిక. 

(విజయనగరం- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో నదులున్న చోట్ల జలాశయాల ద్వారా రైతులకు సాగునీరు అందుతోంది. కాల్వలు అందుబాటులో లేని రైతులు వర్షాధారంగా పంటలు పండిస్తున్నారు. వర్షాలు పడని పక్షంలో సాగుకు దూరమవుతున్నారు. కొన్నిచోట్ల భూములను ఖాళీగా వదిలేస్తున్నారు. కొన్నిసార్లు సాగుకు సాహసించి.. ఆ తర్వాత వర్షాలు అనుకూలించక అప్పుల పాలవుతున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. భూ గర్భ జలాల వినియోగం ద్వారా పక్కాగా పంటలు పండించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ సమీకృత సాగునీరు వ్యవసాయ పరివర్తనా పథకం(ఏపీఐఐఎటిపీ) కింద చెరువుల అభివృద్ధిపై దృష్టి పెడుతున్నారు. అన్యాక్రాంతమైన.. ఆక్రమణలో ఉన్న చెరువులను గుర్తిస్తున్నారు. అందుబాటులో ఉన్న జలాలతో ఏ రకమైన పంటలను వేసుకోవచ్చు అనేదానిపై అధ్యయనం చేస్తున్నారు. ఇందు కోసం సంయుక్త కార్యాచరణ ప్రణాళికలో భాగంగా భూగర్భజల శాఖ, నీటి పారుదల శాఖ, వ్యవసాయ, ఉద్యాన, మత్య్స శాఖలు ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి. ప్రపంచ బ్యాంకు ద్వారా చేపడుతున్న ఈ ప్రాజెక్టు పరిధిలో జిల్లా వ్యాప్తంగా 102 చెరువులను గుర్తించారు. ఇందులో మొదటి దశలో 36 చెరువుల పరిధిలో కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. తద్వారా నీటి పారుదల, ఆరుతడి పంటల సాగు, పండ్ల తోటలు, చేపల పెంపకం వంటి రంగాల్లో రైతులకు సహకారాన్ని అందించాలన్నది ఉద్దేశం. 

అన్ని మండలాల్లో ఫీజో మీటర్లు    

భూగర్భ జలాలను ఎప్పటికపుడు గుర్తించేందుకు వీలుగా నేషనల్‌ హైడ్రాలజీ ప్రాజెక్టు ద్వారా అన్ని మండలాల్లో ఫీజో మీటర్లు అందుబాటులోకి తెచ్చాం. వీటి ద్వారా ఎప్పటికప్పుడు భూగర్భ జల మట్టాలు నమోదవుతుంటాయి. మాన్యువల్‌గా ఎంత లోతులో నీటి నిల్వలు ఉన్నదీ పరిశీలించాల్సిన పనిలేకుండా నేరుగా ఉపగ్రహ అనుసంధానం ద్వారా ఆనలైనలో వివరాలు నమోదవుతుంటాయి. నీటి లభ్యత, ఎంత లోతులో నీరు ఉన్నదీ తెలుస్తుంది. ఫీజోమీటర్లను మండలానికి రెండేసి గ్రామాల్లో ఏర్పాటు చేశాం. ఏదైనా ప్రాంతంలో భూగర్భ జలాలు తగ్గినట్లయితే ఆ ప్రాంతంలో వాటర్‌ కన్జర్వేషన పనులు చేపట్టి వర్షం నీరు భూగర్భంలో ఇంకేలా చర్యలు తీసుకుంటాం. 

                                        - కేఎస్‌ శాసి్త్ర, డీడీ, భూగర్భ జల శాఖ, విజయనగరం.                       

Updated Date - 2020-12-04T04:20:57+05:30 IST