ఒడిశా దూకుడు

ABN , First Publish Date - 2020-12-28T05:04:49+05:30 IST

కొఠియా గ్రూప్‌ గ్రామాలపై ఒడిశా పెత్తనం ప్రదర్శించాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గిరిశిఖర గ్రామాల్లోనే కాకుండా ఏపీ పరిధిలోని మైదాన ప్రాంతంలోకి సైతం చొచ్చుకొచ్చి భవన, రోడ్డు నిర్మాణ పనులను శరవేగంగా చేపడుతోంది.

ఒడిశా దూకుడు
దొరలతాడివలసలో ఒడిశా నిర్మిస్తున్న వసతిగృహం

కొఠియా గ్రామాల్లో యథేచ్ఛగా భవన నిర్మాణాలు

దొరలతాడివలసలో పాఠశాల భవనం, వసతిగృహం నిర్మాణం

సాలూరు రూరల్‌, డిసెంబర్‌ 27: కొఠియా గ్రూప్‌ గ్రామాలపై ఒడిశా పెత్తనం ప్రదర్శించాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గిరిశిఖర గ్రామాల్లోనే కాకుండా ఏపీ పరిధిలోని మైదాన ప్రాంతంలోకి సైతం చొచ్చుకొచ్చి భవన, రోడ్డు నిర్మాణ పనులను శరవేగంగా చేపడుతోంది. సారిక పంచాయతీ కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న దొరలతాడివలసలో 67 లక్షల రూపాయలతో విద్యార్థులకు వసతిగృహం నిర్మిస్తోంది. ఈ భవన నిర్మాణానికి ఎదురుగా రేకులతో ఉన్న ఒడిశా పాఠశాలకు అనుబంధంగా అదనపు భవనం నిర్మిస్తున్నారు. నేరేళ్లవలసలో ఏపీ భవనం పక్కనే సామాజిక భవన నిర్మాణం హుటాహుటిన పూర్తిచేశారు. ఈ విధంగా కొఠియా గ్రూప్‌ గ్రామాల కైవశానికి ఒడిశా శరవేగంగా పావులు కదుపుతోంది. వాటిపై అధిపత్యానికి 2018 నుంచి దూకుడు పెంచింది. 

వివాదాస్పద కొఠియా గ్రూప్‌లోని 21 గ్రామాలు తమవే అని చెప్పేందుకు ఒడిశావే పెద్దఎత్తున అభివృద్ధి పనులను చేపట్టింది. తొలుత రూ.200 కోట్లతో అభివృద్ధి పనులకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించగా రూ.150 కోట్లు  మంజూరు చేసింది. ఆ పనులు పూర్తవుతున్నాయి. కొఠియా నుంచి ఇప్పటికే ఏడు గ్రామాలకు బీటీ రోడ్లు పూర్తి చేశారు. పొట్టంగి నుంచి నేరేళ్లవలసకు రోడ్డు నిర్మాణం పూర్తి కావస్తోంది. గంజాయిభద్రలో విద్యాకాంప్లెక్స్‌, కొఠియాలో మావోయి స్టులను ఎదుర్కొనే విధంగా రెండతస్తుల పోలీసు స్టేషన్‌, పది పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను చేపట్టారు. పూర్తి కావొచ్చిన వాటిని కొద్దిరోజుల్లో ప్రారంభించేందుకు ఒడిశా అధికారులు సన్నద్ధం అవుతున్నారు. గంజాయిభద్రలో  చెరువులు తవ్వకం పనులు, జగనన్న విద్యాకానుక కోసం బయెమెట్రిక్‌ తీసుకోవడంపై ఒడిశా ప్రభుత్వం సీరియస్‌గా  ఉంది. చెరువుల తవ్వకంపై పొట్టంగి తహసీల్దార్‌తో దర్యాప్తు సైతం చేయించింది. ఒడిశా మాత్రం కొఠియా గ్రూప్‌ గ్రామాల్లో యథేచ్ఛగా అభివృద్ధి పనులతో దూకుడు పెంచింది. అయినా ఏపీ అధికారుల్లో స్పందన లేదని కొఠియా గ్రూప్‌ గ్రామాల గిరిజనులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒడిశా దూకుడుతో వివాదాస్పద గ్రామాలు ఆ రాష్ట్రం వైపు  మొగ్గు చూపినా ఆశ్చర్యపోనక్కరలేదని పరిశీలకులంటున్నారు. కొఠియా గ్రూప్‌ గ్రామాల వివాదంపై శ్రద్ధ చూపి విలువైన ఖనిజ సంపద ఉన్న ఆ ప్రాంతాలు ఏపీకి దక్కేటట్టు ప్రభుత్వం సత్వరం చొరవ చూపాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. 


Updated Date - 2020-12-28T05:04:49+05:30 IST