-
-
Home » Andhra Pradesh » Vizianagaram » No burning no burial
-
దహనం లేదు.. ఖననం లేదు
ABN , First Publish Date - 2020-03-24T17:59:44+05:30 IST
నేడు ప్రపంచంలోని పలుదేశాలను..

అరవయ్యేళ్ల కిందట ఇదే భయోత్పాతం
బొబ్బిలిని వణికించిన మశూచి, కలరా మహమ్మారి
బొబ్బిలి(విజయనగరం): నేడు ప్రపంచంలోని పలుదేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి మాదిరిగానే సుమారు అరవయ్యేళ్ల క్రితం బొబ్బిలి పట్టణాన్ని కలరా, మశూచీ భయకంపితం చేశాయి. ఈ మహమ్మారి బారిన పడిన వారి మృతదేహాలను కనీసం దహనం కానీ, ఖననం కానీ చేయలేదని ఆనాటి పౌరులు తమ చేదు జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. కరోనా వ్యాధి విజృంభిస్తున్న నేపథ్యంలో తాము యుక్తవయస్సులో ఉన్నప్పుడు సరిగ్గా ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధి బొబ్బిలి ప్రజలను కంటి మీద కునుకులేకుండా చేసిందని వాపోయారు. పాతబొబ్బిలి, మల్లమ్మపేట గ్రామానికి చెందిన ఇద్దరు వృద్ధులు తమ జ్ఞాపకాలను ఆంధ్రజ్యోతితో ఇలా పంచుకున్నారు.
బంగారు ఆభరణాలున్నా తీసేవారు కాదు
నా భర్త ఎరుకునాయుడు పలుదఫాలు మున్సిపల్ కౌన్సిలర్‌గా పనిచేశారు. బొబ్బిలిలో కలరా, మశూచీ తీవ్రస్థాయిలో వ్యాపించినప్పుడు గ్రామపెద్దలతో కలసి నా భర్త సేవలందించారు. కలరా, మశూచితో ఎవరైనా చనిపోతే వారిని యథాతథంగా అలా మంచంపై తీసుకెళ్లి మల్లమ్మపేట అడవుల్లో వదిలి వచ్చే వారు. మృతదేహాలపై బంగారు ఆభరణాలున్నా ఎవరూ తీసేందుకు సాహసించేవారు కాదు. మున్సిపాలిటీకి మెదటి చైర్మన్‌గా ఉన్న ఆరి గంగయ్య అంతకుమునుపు బొబ్బిలి గ్రామపంచాయతీ సర్పంచ్‌గా కూడా పనిచేశారు. ఆయన ఎంతో ధైర్యంగా ఈ మృతదేహాలను అడవిలోనికి తరలించేందుకు చాలా తెగువ చూపేవారు.
నా చిన్న వయసులో బ్రిటీషు వారు సైతం ఈ ప్రాంతానికి రావడానికి భయపడేవారు. మశూచీ, కలరా సోకుతుందని వారు ఇక్కడకు వచ్చేందుకు వెనుకంజ వేసేవారని మా ఊరోళ్లంతా కథకథలుగా చెప్పుకునేవారు. ఆ సమయంలో అడవిలో కట్టెలు ఏరుకునేందుకు వెళ్లడానికి స్థానికులు సాహసించేవారు కాదు. అమ్మవారి కరుణ కోసం గ్రామపెద్దలు పెద్దఎత్తున పూజలు చేయించే వారు. ఇప్పుడులా ఆ కాలంలో మందులు అందుబాటులో ఉండేవి కావు.
- తెంటు రాములమ్మ(80), మల్లమ్మపేట, బొబ్బిలి
మంచాలగెడ్డలో పారేసేవారు
బొబ్బిలి గ్రామపంచాయతీగా ఉన్న కాలంలో అనేకమంది వాంతులు, విరేచనాలు, మశూచితో బాధపడుతూ పిట్టల్లా రాలిపోయి ప్రాణాలు వదిలేవారు. అలాంటి వారిని మంచాలు, వారు వినియోగించిన దుస్తులతో సహా గ్రామానికి దూరంలో గల దిబ్బగుడ్డివలస సమీపంలోని గెడ్డలో పడేసేవారు. అందుకే ఆ గెడ్డకు మంచాల గెడ్డ అని ఇప్పటికీ పిలుస్తుంటారు. అలా చనిపోయిన వారి మృతదేహాలను దహనం, ఖననం చేయకుండానే అక్కడ వదిలేసి వచ్చేవారు. అలా చేస్తే అమ్మవారికి కోపం వస్తుందని ఆనాటి ప్రజల్లో పెద్ద భయం. అమ్మవారిని శాంతింపజేసేందుకు దున్నపోతులు, పందులు, కోళ్లు వంటివాటిని బలి ఇచ్చేవారు.
- కర్రి సరయ్య(80), పాతబొబ్బిలి