కొత్త ఆశలు!

ABN , First Publish Date - 2020-05-17T10:37:00+05:30 IST

లాక్‌డౌన్‌ కాలంలో చతికిల పడిన అనేక రంగాలకు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ఆసరాగా నిలువనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కొత్త ఆశలు!

వ్యవసాయ అనుబంధ రంగాలకు చేయూత

ఆత్మనిర్భర్‌ భారత్‌ పథకంతో ఎంతో మేలు

మత్స్య.. చిన్న పరిశ్రమలకు సాయం


(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

లాక్‌డౌన్‌ కాలంలో చతికిల పడిన అనేక రంగాలకు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ఆసరాగా నిలువనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా చేయూత లభించనుంది. మత్స్యకారులకు క్రెడిట్‌ కార్డులు.. ఫుట్‌పాత్‌ వ్యాపారులకు రుణాలు.. వడ్డీరాయితీలు.. చిన్న పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు సంబంధించి పీఎఫ్‌ చెల్లింపు.. ఉపాధి కల్పన.. నాబార్డు సాయంతో పీఏసీఎస్‌ల ద్వారా రైతులకు రుణాలు తదితర అనేక చర్యలు చేపడుతోంది. కరోనా వ్యాప్తి నివారణకు కేంద్రం లాక్‌డౌన్‌ ప్రకటించాక పరిశ్రమలు ఆగిపోయాయి. ఉత్పత్తి రంగం నిలిచిపోయింది. ఉపాధి కరువైంది. ప్రధాన రంగమైన వ్యవసాయం ఒడిదుడుకులకు లోనైంది. రవాణా లేక ... పంటలకు గిట్టుబాటు లేక రైతులు నిరాశ చెందుతున్నారు.


ఈ పరిస్థితిలో అన్ని రంగాలను ఆదుకునే ఉద్దేశంతో ప్రధాని మోదీ ప్యాకేజీ ప్రకటించారు. దేశవ్యాప్తంగా రూ.20లక్షల కోట్లతో సాయం అందించే నిర్ణయం తీసుకున్నారు.  ఏఏ వర్గాలను ఆదుకుంటోందీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వివరించారు. ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ రంగాలను ఆదుకోనున్నట్లు ప్రకటించారు. చిన్నతరహా పరిశ్రమలకు సాయం ప్రకటించారు. చిరు వ్యాపారులకు నేరుగా రుణాలను అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. 


వ్యవసాయం

కిసాన్‌ క్రెడిట్‌ కార్డులున్న రైతులను గుర్తించనున్నారు. వీరికి ఆర్థిక సాయాన్ని అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను మరింత పెంచేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ప్రధాన మంత్రి కిసాన్‌ పథకం ద్వారా ఏటా రూ.6వేల వంతున మూడు విడతల్లో అందించే కార్యక్రమం అమలవుతోంది. రైతులకు పంటరుణాలు అందిస్తున్నారు. రుణాలను మరింత సరళీకృతంగా అందించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం బ్యాంకర్లను ఆదేశించనుంది. తద్వారా పంట రుణాలు పొందేందుకు మరింత వెసులుబాటు కలగనుంది. 


మత్స్యకారులకు క్రెడిట్‌ కార్డులు

మన జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో మత్స్యపరిశ్రమ ఒకటి. మంచి నీటి చెరువులు, జలాశయాల్లో చేపలు పట్టేవారు కొందరైతే.. సముద్రంలో వేటపై ఆధారపడి ఎక్కువ మంది మత్స్యకారులు బతుకుతున్నారు. వీరిందరికీ కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల తరహాలో క్రెడిట్‌ కార్డులు అందిస్తారు. వీటి ద్వారా బ్యాంకుల నుంచి రుణ సౌకర్యాన్ని పొందేందుకు వీలు కలుగుతుంది. అంతే కాకుండా మత్స్యకారులకు రూ.2 లక్షల బీమా సౌకర్యాన్ని ప్రకటించారు. జిల్లాలో 3వేల మంది మత్స్యకారులున్నారు. వీరందరికీ బీమా వర్తిస్తుంది. 


ఫుట్‌పాత్‌ వ్యాపారులకు ఆసరా

కేంద్ర ప్రభుత్వం ఇదివరకే చిన్న వ్యాపారులకు ముద్రా రుణాల పేరుతో పథకాన్ని ప్రవేశ పెట్టింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రతి పుట్‌పాత్‌ వ్యాపారినీ (టీకొట్లు, కిల్లీబడ్డీలు, పండ్లు తదితర) గుర్తించి రూ.10వేల చొప్పున చేతిరుణంలా అందించనున్నారు. ఈ నిధులతో ఆ వ్యాపారంలో మరింత పెట్టుబడి పెట్టి వ్యాపారాభివృద్ధికి సహకరించాలని కేంద్రం నిర్ణయించింది. కరోనాతో ఎక్కడి వ్యాపారాలు అక్కడే నిలిచిపోయాయి. మళ్లీ కొత్తగా ప్రారంభించుకోవాల్సిన పరిస్థితి ఉంది.


దీనిని దృష్టిలో పెట్టుకుని రూ.10వేల చొప్పున రుణసాయం అందించనుంది. జిల్లాలో విజయనగరం నగరపాలక సంస్థ, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు మున్సిపాలిటీలు. నెల్లిమర్ల నగర పంచాయతీల పరిధిలో దాదాపు 3,520 మంది చిరు వ్యాపారులు ఉన్నట్లు అంచనా. వీరందరికీ లబ్ధి చేకూరనుంది. 


వడ్డీ రాయితీలు

గతంలో ముద్ర-శిశు రుణాలు అందించారు. వీటిని తిరిగి చెల్లించలేని చిరు వ్యాపారులు  ఎంతో మంది ఉన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ రుణాలపై 2 శాతం వడ్డీ రాయితీ కల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా బ్యాంకర్లు ఈ పథకం కింద గతేడాది రూ.54 కోట్లు రుణాలుగా ఇచ్చినట్లు లీడ్‌బ్యాంక్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ ఏడాది కూడా రుణాలు మంజూరు కానున్నాయి. 


పరిశ్రమలకు అండ

 కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక పథకంలో చిన్న మధ్య తరహా పరిశ్రమలకు కూడా ఆసరా దొరకనుంది. జిల్లాలో 3,500 చిన్న పరిశ్రమలకు లబ్ధి చేకూరనుంది. గ్రామీణ ప్రాంతాల్లోనే సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలున్నట్లు పరిశ్రమల శాఖ గుర్తించింది. వీటిలో 42వేల మంది పనిచేస్తున్నట్లు అంచనా వేశారు. వీరిలో రూ.15వేల లోపు జీతం ఉన్నవారు 8వేల మంది ఉన్నారు. వీరికి సంబంధించిన పీఎఫ్‌ కేంద్ర ప్రభుత్వమే కొన్ని నెలలపాటు భరించనుంది. 


ఉపాదికి ఊతం

 జిల్లాలో ఇప్పటికే పెద్ద ఎత్తున జాతీయ ఉపాధి హామీ పథకం పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం 4.23 లక్షల మంది వేతనదారులు పనుల్లోకి వెళుతున్నారు. లాక్‌డౌన్‌తో పెద్దఎత్తున వలస కూలీలు స్వగ్రామాలకు చేరుకున్నారు. వీరంతా ఉపాధి పనులకు క్యూ కడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఉపాధి వేతనదారులకు పని గంటలను పెంచింది. వలస పక్షులు గ్రామాలకు చేరుకుంటున్న కారణంగా బతకటానికి ఇబ్బందులు లేకుండా పనులు కల్పించాలని ఆదేశాలిచ్చింది. 


సహకార సంఘాల ద్వారా

 రైతులు వ్యవసాయ పరపతి సహకార సంఘాల ద్వారా రుణాలు పొందుతున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం నాబార్డు సాయంతో ఈసారి పీఏసీఎస్‌ల ద్వారా రుణాలు అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ చైర్మన్‌ మరిశర్ల తులసి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రతి పీఏసీఎస్‌కు కోటి రూపాయలు వంతున 94 సొసైటీలకు నిధులు మంజూరు చేసేందుకు నిర్ణయించారు. 

Updated Date - 2020-05-17T10:37:00+05:30 IST