జాతీయ రహదారికి మోక్షం

ABN , First Publish Date - 2020-09-15T11:24:05+05:30 IST

విజయనగరం నుంచి సాలూరు వెళ్లే జాతీయ రహదారి-26 విస్తరణకు మార్గం సుగమమైంది. నిర్మాణ పనులకు కేంద్రప్రభుత్వం నిధులు మంజూరుచేసింది. త్వరలో

జాతీయ రహదారికి మోక్షం

  • గజపతినగరం-సాలూరు రోడ్డు విస్తరణకు గ్రీన్‌సిగ్నల్‌
  • రూ.150 కోట్లు మంజూరు

  •  (విజయనగరం-ఆంధ్రజ్యోతి)

విజయనగరం నుంచి సాలూరు వెళ్లే జాతీయ రహదారి-26 విస్తరణకు మార్గం సుగమమైంది. నిర్మాణ పనులకు కేంద్రప్రభుత్వం నిధులు మంజూరుచేసింది. త్వరలో శంకుస్థాపన దిశగా అడుగులు పడుతున్నాయి. రాజాపులోవ నుంచి విజయనగరం మీదుగా వయా సాలూరు.. రాయపూర్‌ వెళ్లే ఈ మార్గం చాలా చోట్ల శిథిలమైంది. రోడ్డును మెరుగుపర్చడంతో పాటు పదిమీటర్ల వెడల్పున విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేసింది. గజపతినగరం నుంచి సాలూరు వరకు అంటే 34 కిలోమీటర్ల పొడవునా రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఈ రోడ్డు ఏడు మీటర్ల వెడల్పు ఉంది. దీనిని 10మీటర్లకు పెంచనున్నారు.  ఈ రోడ్డులో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడికక్కడ గోతులు ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. విశాఖ నుంచి అనేక లారీలు విజయనగరం-సాలూరు మీదుగా చత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్‌ వెళుతుంటాయి. ఇదే మార్గంలో ఒడిశాలోని కొరాపుట్‌కు అనేక వాహనాలు వెళ్తుంటాయి. ఈ మార్గం ప్రాధాన్యాన్ని గుర్తించిన కేంద్రం నిధులు మంజూరు చేసింది. నిర్మాణం కోసం ఇప్పటికే టెండర్లు పిలిచారు. ఇంకా ఖరారు కావాల్సి ఉంది. 

Updated Date - 2020-09-15T11:24:05+05:30 IST