-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Municipalities extravagant in towns
-
ఉల్లాసంగా..ఉత్సాహంగా!
ABN , First Publish Date - 2020-03-13T11:04:05+05:30 IST
మున్సిపాలిటీల్లో నామినేషన్ల ఘట్టం చురుగ్గా సాగుతోంది. రాజకీయ నాయకులు, కార్యకర్తలు , అభ్యర్థులతో ఉత్సాహంగా

పట్టణాల్లో మున్సిపోల్స్ కోలాహలం
రెండోరోజు పెరిగిన నామినేషన్లు
ఐదు మున్సిపాలిటీల్లో 406
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
మున్సిపాలిటీల్లో నామినేషన్ల ఘట్టం చురుగ్గా సాగుతోంది. రాజకీయ నాయకులు, కార్యకర్తలు , అభ్యర్థులతో ఉత్సాహంగా అడుగులేస్తున్నారు. నామినేషన్ల ఘట్టానికి హాజరై ఎన్నికల వేడిని పెంచుతున్నారు. విజయనగరం మున్సిపాలిటీలో గురువారం పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. ముఖ్యంగా ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ అభ్యర్థులు అట్టహాసంగా నామినేషన్లు వేశారు. ర్యాలీగా వచ్చి మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్లు వేశారు. నగరమంతా కోలాహలం కనిపించింది. డప్పుల హోరు మిన్నంటింది. విజయనగరం నగర పాలక సంస్థలోని 50 వార్డులకు గురువారం 151 నామినేషన్లు వచ్చాయి. ఈనెల 11న 47 నామినేషన్లు పడ్డాయి. మొత్తం 198 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరిరోజు శుక్రవారం మరిన్ని రానున్నాయి. 198 నామినేషన్లలో వైసీపీ 95, టీడీపీ 42, జనసేన నుంచి ఐదు, బీఎస్‌పీ 2, స్వతంత్రులు 7 నామినేషన్లు వేశారు.
పార్వతీపురం మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా... బుధవారం 13, గురువారం 46 మొత్తం 59 వచ్చాయి. ఇందులో వైసీపీ 50, టీడీపీ 27, సీపీఎం 1, సీపీఐ 1, స్వతంత్రులు 9 నామినేషన్లు దాఖలయ్యాయి. పార్వతీపురంలో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు ఉదయం 11 గంటల నుంచే తమను బలపరిచే నాయకులతో పాటు ప్రజలను తోడ్కొని మున్సిపల్ కార్యాలయానికి డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా చేరుకోవడం ప్రారంభించారు.
బొబ్బిలి మున్సిపాలిటీలో గురువారం 35, బుధవారం 7 మొత్తంగా 42 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ మున్సిపాలిటీలో 31 వార్డులుండగా దాఖలైన నామినేషన్లలో వైసీపీ 17, టీడీపీ 13, కాంగ్రెస్ 1, జనసేన 3, స్వతంత్రులు ఒకరు ఉన్నారు.
సాలూరు మున్సిపాలిటీలో 29వార్డులుండగా శుక్రవారం 48నామినేషన్లు, ముందు రోజు 22 మొత్తంగా 70 నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ నుంచి 27, వైసీపీ నుంచి 37, సీపీఐ నుంచి 1, స్వతంత్రులు 4 నామినేషన్లు వచ్చాయి.
నెల్లిమర్ల నగరపంచాయతీలో 20 వార్డులున్నాయి. రెండు రోజుల్లో 37 నామినేషన్లు వచ్చాయి. ఇందులో టీడీపీ 16, వైసీపీ 18, స్వతంత్రులు 1.
ఇలా విజయనగరం నగరపాలక సంస్థ, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు మున్సిపాలిటీలు, నెల్లిమర్ల నగర పంచాయతీలో నామినేషన్ల తీరు సాగింది. శుక్రవారంతో నామినేషన్ల ఘట్టం ముగియ నుంది. విజయనగరం నగర పాలక సంస్థకు మొదటిసారిగా కార్పొరేషన్‌కు ఎన్నికలు జరుగుతుండడంతో అభ్యర్థులు, శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది.