కదం తొక్కిన విద్యార్థిలోకం

ABN , First Publish Date - 2020-10-14T20:03:13+05:30 IST

ఎంఆర్‌ కళాశాలను ప్రైవేటీకరించాలని మాన్సాస్‌ ట్రస్టు చైర్‌పర్సన్‌ సంచయిత తీసుకున్న..

కదం తొక్కిన విద్యార్థిలోకం

మంత్రి బొత్స ఇల్లు ముట్టడికి యత్నం

ఎంఆర్‌ కళాశాలను కాపాడుకుంటామని స్పష్టీకరణ

అడ్డుకున్న పోలీసు యంత్రాంగం

ఎస్‌ఎఫ్‌ఐ నేతలు, విద్యార్థులను ఈడ్చుకెళ్లిన వైనం

పరీక్షలను బహిష్కరించాలని నిర్ణయం


దాసన్నపేట (విజయనగరం): ఎంఆర్‌ కళాశాలను ప్రైవేటీకరించాలని మాన్సాస్‌ ట్రస్టు చైర్‌పర్సన్‌ సంచయిత తీసుకున్న నిర్ణయంపై జిల్లా వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. చైర్‌ పర్సన్‌ నిర్ణయం తెలిసినప్పటి నుంచీ విద్యార్థులు, మేధావులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులు చేపట్టిన ఆందోళన... మంత్రి బొత్స సత్య నారాయణ ఇంటి ముట్టడికి వారు చేసిన ప్రయత్నం ఉద్రిక్తతకు దారితీసింది. మంత్రి బొత్స ఇల్లు ఉన్న రోడ్డులోకి రానీయకుండా ముందే పోలీసులు ఆందోళనకారులను నిలువరించారు. ఆగ్రహించిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఎలాగైనా మంత్రి ఇంటికి చేరుకోవాలని ప్రయత్నించారు. ఆ సమయంలో పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. ఎస్‌ఎఫ్‌ఐ నేతలను పోలీసులు అమానవీయంగా ఈడ్చు కెళ్లారు.


ఉత్తరాంధ్రలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన.. పేద, బడుగు, బలహీన వర్గాలకు చేదోడుగా నిలిచిన మహరాజా (ఎంఆర్‌) కళాశాలను ప్రభుత్వమే నడపాలంటూ కొద్దిరోజులుగా ఎస్‌ఎఫ్‌ఐతో పాటు అనేక సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ప్రైవేటీకరించేందుకు మాన్సాస్‌ యాజమాన్యం తీసుకున్న నిరంకుశ ధోరణిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ నెలలో జరిగే డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలను బహిష్కరించి కళాశాలను కాపాడుకుందామని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం ఆందోళనకు దిగారు. తొలుత కళాశాల ముందు ధర్నా నిర్వహించారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.సురేష్‌, జిల్లా కార్యదర్శి రామ్మోహన్‌లు మాట్లాడుతూ కళాశాల పట్ల మాన్సాస్‌ వైఖరిని నిరసిస్తూ వారం రోజులుగా దీక్షలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు ఈ ఏడాది ప్రవేశాలు ఆపివేయడం దారుణమన్నారు.


అనంతరం కోట జంక్షన్‌.. మూడులాంతర్లు మీదుగా మంత్రి బొత్స సత్య నారాయణ ఇంటిని ముట్టడించేందుకు బయలుదేరారు. మంత్రి ఇంటి సమీపానికి చేరుకుంటుండగా పోలీసులు వారిని ఆ రోడ్డులోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు ప్రతిఘటించారు. చాలా సేపు ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించేందుకు ప్రయత్నించారు. షర్టులు, ప్యాంట్‌లను పట్టుకుని అమానవీయంగా ఈడ్చుకెళ్లారు. ఎంత ప్రాధేయపడినా వీడకుండా వాహనంలోకి తోసేశారు. పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.సురేష్‌ విలేకరులతో మాట్లాడుతూ మాన్సాస్‌ యాజమాన్యానికి ప్రభుత్వం వత్తాసు పలుకుతోందన్నారు. నాలుగు వేల మంది విద్యార్థులకు అన్యాయం జరిగితే, రాష్ట్ర ప్రభుత్వం కలుగజేసుకుంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారని గుర్తుచేశారు.


ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కలుగజేసుకుని కళాశాలను స్వాధీనం చేసుకుని నడపాలని కోరారు. లేకపోతే ఈ నెల 16 నుంచి జరిగే డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలను విద్యార్థులు బహిష్కరించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధులు వెంకటేష్‌, పావని, బుజ్జమ్మ, రాము, ఉమ, హర్ష, శ్రీకాంత్‌, రామకృష్ణ విజయ, పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-14T20:03:13+05:30 IST