యథేచ్ఛగా తాగునీటి చౌర్యం!

ABN , First Publish Date - 2020-05-18T10:55:06+05:30 IST

నగరంలో కొంతమంది కొళాయిలకు మోటార్‌ అక్రమ కనెక్షన్లతో తాగునీటి చౌర్యానికి పాల్పడుతున్నారు.

యథేచ్ఛగా తాగునీటి చౌర్యం!

విజయనగరం టౌన్‌: నగరంలో కొంతమంది కొళాయిలకు మోటార్‌ అక్రమ కనెక్షన్లతో తాగునీటి చౌర్యానికి పాల్పడుతున్నారు. మొత్తంగా 50 డివిజన్లలో సుమారు 35 డివిజన్లలో ఇదే పరిస్థితి నెలకొంది. దీనిపై ఫిర్యాదు చేసినా.. సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవంగా నగరపాలక సంస్ధ ఆధ్వర్యంలో నగరంలో ఇంటింటికీ తాగునీటి కొళాయిలు ఏర్పాటు చేశారు. అసలు గంట పాటు వచ్చే కొళాయి నీరు సాధారణంగా ఒక కుటుంబం అవసరాలకు సరిపోతుంది. కానీ  కొంతమంది తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ సౌకర్యాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.  ఫలితంగా   సిద్ధార్థనగర్‌, కణపాక  తదితర చోట్ల   ప్రజలకు నీటి ఇక్కట్లు తప్పడం లేదు. ఇటీవల కాలంలో వరుసగా వర్షాలు కురవడంతో  గడిగెడ్డ, తోటపల్లి, తాటిపూడి జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉంది. రామతీర్థం, నెల్లిమర్ల, ముసిడిపల్లి పంప్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన ఊట బావుల ద్వారా నీళ్ల ట్యాంకులకు పంపింగ్‌ జరుగుతుంది.


ప్రధానంగా ఊట బావులన్నీ చంపావతిలో ఉన్నాయి.  ప్రస్తుతం నదిలో నీరు తగినంత ఉండడంతో  తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేవనే చెప్పోచ్చు. అయితే నగరంలో నీటి చౌర్యం అధికంగా జరగడంతో పట్టణ వాసుల్లో అనేకమందికి పూర్తిస్థాయిలో తాగునీరు అందడం లేదు.  ఏడాదికి కిందట అప్పటి కమిషనర్‌ వేణుగోపాల్‌ డివిజన్లలో పర్యటించి  మోటార్లు తొలగించి కనెక్షన్‌ రద్దుచేశారు.  దీంతో కొంతమేర నగరంలో నీటి చౌర్యం తగ్గింది. ఇటీవల అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో గతంలో కన్నా మోటార్ల అక్రమ కనెక్షన్లు పెరిగి పోయాయి.


  ఇదిలా ఉండగా తాగునీటి కొళాయిలు ఉన్నవారిలో చాలామంది పన్ను కట్టడం లేదని సర్వే ద్వారా తెలుస్తోంది. నగరంలో 62వేల800 గృహాలు ఉండగా ఇప్పటికీ 42వేల ఇళ్లకు కొళాయిలు ఉన్నట్లు సచివాలయ సిబ్బంది, వలంటీర్ల సర్వేలో తేలింది. అయితే ఇందులో కేవలం 30వేలమంది మాత్రమే ఇంటి పన్ను కడు తున్నారు.  మిగతా 12వేల మంది పన్ను చెల్లించకుండా కొళాయి నీటిని వినియోగి స్తున్నట్లు సర్వేలో తేలింది. నగరంలో పబ్లిక్‌, ప్రైవేటు కుళాయి కనెక్షన్లు మొత్తం 28,056 ఉన్నాయి. పైపులైన్‌ 305 కిలోమీరుట్ల మేర వ్యాపించి ఉంది. అక్రమ మోటార్లు ప్రతి పది ఇళ్లలో ఐదు నుంచి ఏడు ఇళ్లకు ఉన్నట్లు  సర్వే సిబ్బంది చెబుతున్నారు. ఈ నేపథ్యంలో  ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు. 


నీటిచౌర్యం వాస్తవమే...

నగరంలో చాలామంది కొళాయిలకు మోటార్లతో నీటిచౌర్యానికి పాల్పడుతున్నది వాస్తవమే. గతంలో పర్యవేక్షణ చేసి మోటార్లను సీజ్‌చేశాం.  కొళాయిలకు  మోటార్లు బిగించడం చట్టరీత్యానేరం. ఇలాంటి చర్యలకు పాల్పడినవారికి చర్యలు తప్పవు. నగరానికి రోజూ 32ఎంఎల్‌డీ నీరు అవసరం కాగా ప్రస్తుతం 20 ఎంఎల్‌డీ నీటిని మాత్రమే ఇవ్వగలుగుతున్నాం. రోజుతప్పించి రోజు నీటిని సరఫరా చేస్తున్నాం.  పన్ను చెల్లిస్తున్నవారికి మాత్రమే కొళాయి కనెక్షన్‌ ఇస్తున్నాం. ఇకపై పర్యవేక్షణ ప్రారంభిస్తాం

-దిలీప్‌, ఎంఈ, నగరపాలక సంస్థ

Updated Date - 2020-05-18T10:55:06+05:30 IST