మృతదేహం తరలింపుపై ఆందోళన

ABN , First Publish Date - 2020-07-15T09:32:42+05:30 IST

ఆండ్ర గ్రామంలో చిప్పాన పైడితల్లి మృతదేహం తరలింపుపై మంగళవారం ఆందోళన చోటుచేసుకుంది.

మృతదేహం తరలింపుపై ఆందోళన

 మెంటాడ, జూలై 14: ఆండ్ర గ్రామంలో చిప్పాన పైడితల్లి మృతదేహం తరలింపుపై మంగళవారం ఆందోళన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పైడితల్లి అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే మృతదేహాన్ని మీర్చివలస కొండప్రాంతం నుంచి ఆండ్ర గ్రామానికి పోలీసుల సమక్షంలో మంగళ వారం తీసుకువచ్చారు. సుమారు ఉదయం 10 గంటలకు మృతదేహం ఆండ్ర గ్రామానికి చేరుకుంది. అక్కడి నుంచి గజపతినగరం కమ్యూనిటీ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో మృతుడి భార్య సన్యాసమ్మ, కుటుంబ సభ్యులు మృతదేహం తరలించకుండా అడ్డుకున్నారు. పైడితల్లిది హత్యేనని, నిందితులు పోలీసుల సమక్షంలో ఉన్నప్పటికీ బయట పెట్టలేదన్నారు. తాము ఇచ్చిన ఫిర్యాదు కూడా పోలీసులు తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. నిందితులను కాపాడేందుకు కొంత మంది రాజకీయ నేతలు కొమ్ము కాస్తున్నారని చెప్పారు.


తన భర్త ఏవిధంగా చని పోయాడో స్పష్టం చేయనిదే మృతదేహాన్ని తరలించనీయమని వారంతా భీష్మించుకుని కూర్చున్నారు. సాయంత్రం వరకు మృతదేహం గ్రామ పొలిమేరల్లో ఉంచేశారు. గజపతినగరం సీఐ డి.రమేష్‌ ఆండ్ర గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు.  అనంతరం విలేక ర్లతో మాట్లాడుతూ, పైడితల్లి కుటుంబానికి న్యాయం చేసేందుకు కృషి చేస్తానన్నా రు. పైడితల్లి మృతిపై సమగ్ర విచారణ చేపడతామని తెలిపారు. దీంతో మృత దేహం తరలించేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజపతినగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Updated Date - 2020-07-15T09:32:42+05:30 IST