అందరిది ఇదేదారి!

ABN , First Publish Date - 2020-05-09T09:27:19+05:30 IST

అటు వలస కూలీలు..ఇటు జిల్లా మీదుగా వెళ్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన వారు...వీరంతా చాలదన్నట్టు ఇప్పుడు విశాఖ నుంచి ఇబ్బడిముబ్బడిగా జిల్లాకు చేరుకుంటున్న వారు...

అందరిది ఇదేదారి!

జిల్లాకు భారీగా చేరుకుంటున్న వలసకూలీలు

నిండిపోతున్న పునరావాస కేంద్రాలు

క్వారంటైన్‌ పూర్తి కాకుండా స్వగ్రామాలకు మత్స్యకారులు?

చేతులెత్తేస్తున్న అధికారులు


 రాష్ట్రంలో విజయనగరం జిల్లా సేఫ్‌ జోన్‌. నాలుగు రోజుల క్రితం మాట ఇది.    ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. రోజురోజుకి కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడమే ఇందుకు కారణం. దీనికితోడు లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి వలస కూలీలు వేలాదిగా జిల్లాకు వస్తున్నారు.


వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. పక్కనే ఉన్న విశాఖలో ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ దుర్ఘటన నేపథ్యంలో సరిహద్దు మండలాల ప్రజలు సైతం జిల్లావైపు వస్తుండడంతో వారిని పునరావాస కేంద్రాల్లో సర్ధుబాటు చేసేందుకు అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. వలస కూలీల సంరక్షణ కష్టమనుకుంటున్న తరుణంలో విశాఖ నుంచి వస్తున్న వారి విషయంలో ఏంచేయాలో పాలుపోక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.  


(విజయనగరం-ఆంధ్రజ్యోతి/భోగాపురం)

అటు వలస కూలీలు..ఇటు జిల్లా మీదుగా వెళ్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన వారు...వీరంతా చాలదన్నట్టు ఇప్పుడు విశాఖ నుంచి ఇబ్బడిముబ్బడిగా జిల్లాకు చేరుకుంటున్న వారు...ఒకేసారి పెద్ద సంఖ్యలో జిల్లాలోకి ప్రవేశిస్తున్నారు. వీరందరినీ ఎలా సంరక్షించాలో తెలియక జిల్లా అధికారులు సతమతమవుతున్నారు. వీరికి తగ్గట్టు పునరావాస, క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయలేకపోతున్నారు. దీంతో అక్కడక్కడా నిబంధనలు పాటించడం లేదన్న విమర్శలు చుట్టుమడుతున్నాయి. అటు పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపు, వలస కూలీలకు అనుమతి నేపథ్యంలో జిల్లాకు నిత్యం వేలాది మంది ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నారు. వీరిని పునరావాస, క్వారంటైన్‌ కేంద్రాలకు తరలిస్తున్న అధికారులు వైరస్‌ నిర్థారణ పరీక్షలు చేయిస్తున్నారు. ట్రూనాట్‌ ద్వారా ప్రాథమిక నిర్థారణ పరీక్షలు చేసి..అనుమానిత కేసులకు సంబంధించి శాంపిళ్లను కాకినాడ ల్యాబ్‌కు తరలిస్తున్నారు.


ఈ ప్రక్రియ నాలుగు రోజుల కిందట వరకూ సజావుగా సాగింది. కానీ వేలాదిగా వస్తున్న వారితో క్వారంటైన్‌, పునరావాస కేంద్రాలు నిండిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రాథమిక నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చిన వారిని... నిర్ణీత గడువుకు ముందే స్వస్థలాలకు పంపించి అధికారులు చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి.


ఐదు రోజులకే 130 మంది ఇంటికి..

ఇటీవల గుజరాత్‌లో చిక్కుకున్న ఉత్తరాంధ్ర మత్స్యకారులను కేంద్ర ప్రభుత్వం స్వస్థలాలకు పంపించింది. ఇందులో పూసపాటిరేగ, భోగాపురం మండలాలకు చెందిన 600 మంది ఉన్నారు. వీరిని పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ, విజయనగరం, నెల్లిమర్ల ప్రాంతాల్లోని పునరావాస కేంద్రాలకు తరలించారు. 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచి నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్‌ అని తేలితే ఇంటికి పంపిస్తామని ప్రకటించారు. కానీ ప్రాథమిక స్థాయిలో నెగిటివ్‌ వచ్చిందని చూపి 130 మంది  మత్స్యకారులను ఐదో రోజునే ఇళ్లకు పంపించారు.


పూసపాటిరేగ మండలంలో ఓ పునరావాస కేంద్రంలో 100 మందిని, భోగాపురం మిరాకిల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో 69 మందిని క్వారంటైన్‌లో ఉంచారు. ఐదు రోజులు గడవక ముందే ఇళ్లకు పంపించారు. ప్రాథమిక స్థాయి నిర్థారణ పరీక్షల్లో నెగిటివ్‌గా వచ్చిందని కారణం చెబుతున్నారు. వాస్తవానికి 14 రోజుల పాటు క్వారంటైన్‌ పూర్తిచేసిన తరువాత మరోసారి నిర్ధారణ పరీక్షలు చేసిన తరువాత నెగిటివ్‌గా వస్తేనే బయటకు పంపించాలన్న నిబంధన ఉంది. కానీ ఇవేమీ పట్టించుకోకుండా విడిచి పెడుతుండడంతో ఆయా గ్రామాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల గుజరాత్‌ నుంచి వచ్చిన వ్యక్తికి వైరస్‌ పాజిటివ్‌గా నిర్థారణ కావడం... మత్స్యకారుల క్వారంటైన్‌ విషయంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.  


వేల సంఖ్యలో..

ప్రస్తుతం పునరావాస కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 41 కేంద్రాలను ఏర్పాటుచేశారు. తొలుత గుజరాత్‌ నుంచి వచ్చిన మత్స్యకారులు 600 మందిని చేర్చారు. లాక్‌డౌన్‌ ఆంక్షల తరువాత నిత్యం వందలాది మంది వలస కూలీలను చేర్చుతున్నారు. గురువారం విశాఖ ఘటన నేపథ్యంలో వీరి సంఖ్య పెరిగింది. శుక్రవారం సాయంత్రానికి పునరావాస కేంద్రాల్లో 3,368 మంది తలదాచుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఒక్క శుక్రవారమే సుమారు 350 మందికి పైగా చేరినట్టు తెలుస్తోంది.


రానున్న రోజుల్లో వీరి సంఖ్య గణనీయంగా పెరగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పునరావాస కేంద్రాలు నిండుతుండడం... మరికొద్దిరోజుల్లో వీరి సంఖ్య పెరగనుందన్న ముందస్తు అంచనాతో క్వారంటైన్‌ గడువు ముగియకముందే విడిచి పెడుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనిపై డీఎంహెచ్‌ఓ రమణకుమారి వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి నెగిటివ్‌ వచ్చిన తరువాత విడిచిపెడుతున్నట్టు చెప్పారు.

Updated Date - 2020-05-09T09:27:19+05:30 IST