రైతులు లేని బజార్లు

ABN , First Publish Date - 2020-02-08T11:03:28+05:30 IST

ఈ మార్కెట్‌ రామభద్రపురంలోనిది. నిత్యం వందలాది మంది రైతులు వ్యవసాయ ఉత్పత్తులను ఇక్కడికి తెచ్చి విక్రయిస్తుంటారు. ఉత్తరాంధ్ర

రైతులు లేని బజార్లు

మార్కెటింగ్‌ శాఖ అనాలోచిత నిర్ణయాలు

ఊరికి దూరంగా రైతుబజార్ల ఏర్పాటు

ఆసక్తిచూపని కొనుగోలుదారులు

కార్డులున్నా రాని రైతులు

అవసరమున్నచోట ఏర్పాటులో జాప్యం


(విజయనగరం టౌన్‌)

ఈ మార్కెట్‌  రామభద్రపురంలోనిది. నిత్యం వందలాది మంది రైతులు వ్యవసాయ ఉత్పత్తులను ఇక్కడికి తెచ్చి విక్రయిస్తుంటారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తుంటారు.  ఆశీల వసూలు రూపంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతున్నా మార్కెట్‌లో కనీస వసతులు కరువవుతున్నాయి. ఇక్కడ రైతుబజారు ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉన్నా కార్యరూపం దాల్చడం లేదు.


6వీజెడ్‌ఎం టౌన్‌2-కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్న ఈ దృశ్యం చీపురుపల్లి రైతుబజారులోనిది. పట్టణానికి దూరంగా రైతుబజారు ఏర్పాటు చేయడంతో అటు రైతులు, ఇటు కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తికనబరచడం లేదు. పది మంది రైతులకు కార్డులు మంజూరుచేస్తే...ముగ్గురు, నలుగురు రైతులే వ్యవసాయ ఉత్పత్తులను తెచ్చి విక్రయిస్తున్నారు. పట్టణంలో బహిరంగ మార్కెట్‌లో కూరగాయలు దొరుకుతుండడంతో స్థానికులు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసేందుకు ఇష్టపడడం లేదు.


ఇలా అవసరం ఉన్నచోట్ల. కాకుండా... అవసరం లేనిచోట...జనావాసాలకు దూరంగా రైతుబజార్లు ఏర్పాటు చేయడం ఇటు రైతులకు.. అటు కొనుగోలుదారులకు శాపంగా మారింది. ఇప్పటివరకూ ఏర్పాటు చేసిన చాలా బజారుల విషయంలో ఇదే పరిస్థితి. జనం అవసరాలు... అవకాశాలు తెలుసుకోకుండా... ఏదో ఉండాలి కాబట్టి.. ఏర్పాటు చేద్దాం అనే ధోరణిలో అధికారులు వ్యవహరించడం సమస్యకు మూలకారణం. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతులే తాజా కూరగాయాలు విక్రయించేందుకు వీలుగా ఉమ్మడి రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుబజార్లను ప్రారంభించారు. అటు రైతులకు, ఇటు కొనుగోలుదారులకు ఇవి ఎంతగానో ఉపయోగపడ్డాయి. జిల్లాలో పార్వతీపురం, కొటారుబిల్లి, ఎస్‌.కోట, చీపురుపల్లితో పాటు విజయనగరంలో ఆర్‌అండ్‌బీ, పాత మహారాజ ఆసుపత్రి, రింగ్‌రోడ్‌, పాత ఎంప్లాయిమెంట్‌ కార్యాలయం ప్రాంతంలో మొత్తం 8 రైతుబజార్లను ఏర్పాటుచేశారు. వీటి నిర్వహణ మార్కెటింగ్‌ శాఖ చూస్తోంది.  ప్రతిరోజూ లక్షలాది రూపాయల క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. అటు రైతులకు గిట్టుబాటుతో పాటు కొనుగోలుదారులకు తక్కువ ధరకు కూరగాయలు లభిస్తున్నాయి.


వందలాది మంది రైతులకు కార్డులు

పార్వతీపురంలో 12 మంది రైతులు, కొటారుబిల్లిలో 16 మంది, చీపురుపల్లిలో 10 మంది, ఎస్‌.కోటలో 75 మంది, పాత మహారాజా ఆసుపత్రి ప్రాంతంలో 35 మంది, రింగ్‌రోడ్‌ దాసన్నపేట రైతుబజారులో 50 మంది, ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్ద ఉన్న రైతుబజారులో 90 మంది వరకూ రైతులకు కూరగాయల విక్రయాలకు కార్డులు మంజూరుచేశారు. కానీ ఇందులో పార్వతీపురం, చీపురుపల్లి, కొటారుబిల్లిలో రైతుబజార్లలో కార్డులు తీసుకున్న రైతుల్లో చాలామంది రావడమే మానేశారు. చీపురుపల్లిలో అయితే పది మందికిగాను రోజూ వస్తున్నది నలుగురే. పార్వతీపురం, కొటారుబిల్లిలో కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ రైతుబజార్లు ఊరికి దూరంగా ఉండడమే కారణం. దీనికితోడు ఈ రెండు రైతుబజార్లలో రెగ్యులర్‌ ఎస్టేట్‌ అధికారులు లేరు. చీపురుపల్లికి సంబంధించి ఇప్పటివరకూ ఉన్న ఎస్టేట్‌ అధికారిని విజయనగరం బదిలీ చేసినట్టు తెలుస్తోంది. దీని ప్రభావం రైతుబజార్ల నిర్వహణపై పడుతోంది.


కొత్తవి ఏర్పాటు ఎప్పుడో?

జిల్లాలో రామభద్రపురం, గజపతినగరంలో కూరగాయల క్రయవిక్రయాలు జోరుగా సాగుతుంటాయి. చుట్టు పక్కల మండలాల రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను తెచ్చి ఇక్కడ విక్రయిస్తుంటారు. ఉత్తరాంధ్ర నుంచి వచ్చే వ్యాపారులు కూరగాయలు కొనుగోలు చేసి వాహనాల్లో తీసుకెళ్తుంటారు.  ఈ రెండుచోట్ల రైతుబజార్లు ఏర్పాటుచేయాలని స్థానికులు చాలా ఏళ్ల నుంచి కోరుతూ వస్తున్నారు. కానీ మార్కెటింగ్‌ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. గజపతినగరంలో 20 ఎకరాలకు పైగా మార్కెటింగ్‌ శాఖకు స్థలం ఉంది. ఇక్కడ రైతుబజారు ఏర్పాటు ఆమోదయోగ్యంగా ఉంటుంది. గతంలో ఉన్నతాధికారుల పర్యటించినప్పుడు రైతుబజారు  ఏర్పాటుచేస్తామని  హామీ ఇచ్చారు. కానీ సంవత్సరాలు గడుస్తున్నా కార్యరూపం దాల్చడం లేదు. రామభద్రపురం కూడా చుట్టు పక్కల ప్రాంతాలకు ప్రధాన మార్కెట్‌ సెంటర్‌. అక్కడ రైతుబజారు ఏర్పాటు చేస్తే ఎంతోమందికి ఉపయోగపడుతుంది.


స్థల సమస్య

జిల్లాలో కొత్తగా రైతుబజార్ల ఏర్పాటుపై ప్రతిపాదనలున్నాయి. కానీ స్థల సమస్య వెంటాడుతోంది. రైతుబజార్లు ఉన్న చాలాచోట్ల బహిరంగ మార్కెట్‌లో కొనుగోలుకే స్థానికులు ఆసక్తికనబరుస్తున్నారు. కార్డులు ఉన్నా రైతుబజార్లకు రాని రైతులపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తాం. ఈ విషయంపై ఆరాతీస్తాం. 

శ్యామ్‌కుమార్‌, మార్కెటింగ్‌ శాఖ ఏడీ, విజయనగరం

Updated Date - 2020-02-08T11:03:28+05:30 IST