మరుగుదొడ్లను వినియోగించేలా చూడండి
ABN , First Publish Date - 2020-03-08T10:44:03+05:30 IST
జిల్లాలో ప్రతి కుటుంబానికి మరుగుదొడ్డి ఉండాలని, దాన్ని తప్పనిసరిగా వినియోగించేలా చూడాలని కేంద్ర

కేంద్ర జలశక్తి అదనపు కార్యదర్శి అరుణ్ బారోకా
కలెక్టరేట్, మార్చి 7: జిల్లాలో ప్రతి కుటుంబానికి మరుగుదొడ్డి ఉండాలని, దాన్ని తప్పనిసరిగా వినియోగించేలా చూడాలని కేంద్ర జలశక్తి అదనపు కార్యదర్శి అరుణ్ బారోకా తెలిపారు. శనివారం జిల్లాకు వచ్చిన ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వచ్ఛ భారత్ మిషన్ మొదటి దశలో భాగంగా టాయిలెట్లుపై దృష్టి పెట్టామన్నారు.
ఇప్పటికే అనేక జిల్లాలు ఓడిఎఫ్‌గా ప్రకటించామని చెప్పారు. విజయనగరం కూడా అందులో ఉన్నందున అభినందనలు తెలిపారు. ఏప్రిల్ నుంచి చేపట్టబోయే జనాభా లెక్కల్లో ప్రతి ఇంటికీ వెళ్లి టాయిలెట్ ఉందా? ఉంటే అది వినియోగంలో ఉందా? అనే రెండు అంశాలను నమోదు చేయాలని సూచించారు. ఇప్పటి వరకూ టాయిలెట్ లేని గృహాలకు మార్చి 31లోగా మంజూరు చేయాలని చెప్పారు. జనాభా లెక్కలకు వెళ్లే అధికారులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తామని స్పష్టం చేశారు. తాగునీరు, పారిశుధ్యానికి నిధులు సమస్య లేదని చెప్పారు. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా నిధులు సమకూరుస్తామని తెలిపారు.
ప్రతి టాయిలెట్‌కు జియో ట్యాగింగ్ చేయాలని సూచించారు. కలెక్టర్ హరి జవహర్‌లాల్ మాట్లాడుతూ ఓడీఎఫ్‌గా జిల్లాను ప్రకటించామని , అయితే ఇంకా అక్కడక్కడ టాయిలెట్స్ నిర్మాణం చేయాల్సి ఉందని తెలిపారు. కొత్తగా నిర్మాణం చేసిన వాటిని కూడా కవర్ చేయాలని సూచించారు. గ్రామ సచివాలయాలు సిబ్బంది ద్వారా టాయిలెట్స్ నిర్మాణాలు, వినియోగంపై దృష్టి పెడతామని , మార్చి 31లోగా మిగిలిన వాటికి మంజూరు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ ఎమ్‌డీ పి.సంపత్‌కుమార్, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఎస్‌ఈ రవి, డ్వామా పీడీ నాగేశ్వరరావు, సీపీవో విజయలక్ష్మి, జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.