ఎన్నికళలు!

ABN , First Publish Date - 2020-03-08T10:58:26+05:30 IST

స్థానిక ఎన్నికల (ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు)కు సంబంధించి నోటిఫికేషన్‌ వెలువడడంతో ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యారు

ఎన్నికళలు!

అభ్యర్థుల ఎంపికలో పార్టీల నేతలు 

క్యాడర్‌తో సమావేశమవుతున్న ముఖ్య నేతలు 

సర్వం సిద్ధం చేస్తున్న అధికారులు 

ఫ్లెక్సీల తొలగింపు 


(శృంగవరపుకోట)

స్థానిక ఎన్నికల (ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు)కు సంబంధించి నోటిఫికేషన్‌ వెలువడడంతో ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యారు. పదవుల కోసం నేతలు, ఎన్నికల నిర్వహణను విజయవంతం చేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే ఎంపీపీ, జడ్పీటీసీ పదవులకు రిజర్వేషన్‌లు ఖరారయ్యాయి. ఎంపీటీసీ రిజర్వేషన్‌లు ప్రకటించారు. దీంతో అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష టీడీపీ నేతలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యారు. గెలిచే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు సమావేశాలు ఏర్పాటు చేసి, నేతల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఆశావహులు పార్టీ అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిల్లోనైనా విజయాన్ని సొంతం చేసుకోవాలని ఎవరికి వారు వ్యూహాలు పన్నుతున్నారు. దీనిలో భాగంగానే గెలుపు గుర్రాలనే రంగంలోకి దింపేందుకు ఇరు పార్టీలు యోచిస్తున్నాయి. 


ఎస్‌.కోట నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన టీడీపీ తరుపున ఎంపీపీ, జడ్పీటీసీల అభ్యర్థులను ఎంపిక చేసేందుకు శనివారం మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఎల్‌.కోటలో నాయకులతో సమావేశమయ్యారు. ప్రాథమికంగా ఎస్‌.కోట జడ్పీటీసీగా కిల్తంపాలెం మాజీ ఎంపీటీసీ భీశెట్టి అరుణ పేరును ప్రకటించారు. అయితే జరగనున్న నాయకులు, కా ర్యకర్తల సమావేశంలో ఐదు మండలాల అభ్యర్థులను ప్రకటించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ మండలాల వారిగా సమావేశం నిర్వహిస్తుంది. శుక్రవారం వేపాడ మండల నాయకులతో సమావేశమైన ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఆదివారం ఎస్‌.కోట నాయకులతో సమావేశం కానున్నారు. అయితే వైసీపీ ఆశా వాహులకు సంఖ్య ఎక్కువ ఉంది. దీంతో వర్గ పోరు ఖాయమని సర్వత్రా భావిస్తున్నారు. అధికార యంత్రాంగం కూడా సిద్ధమవుతుంది. మూలన ఉన్న బ్యాలెట్‌ బాక్స్‌లకు బూజు దులుపుతున్నారు. అదేవిధంగా రాజకీయ పార్టీలకు చెందిన కటౌట్లు తొలగిస్తున్నారు. 


రంగుల మాటేమిటి?

వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు ఆ పార్టీ రంగులు అద్దుతుంది. హైకోర్టు అభ్యంతరం చెప్పినా, రంగులు మాత్రం వేయడం ఆపలేదు. గ్రామ సచివాలయాలకు, రైతు భరోసా కేంద్రాలకు వైసీపీ రంగులు వేశారు. అధికారులు కూడా ఆ పార్టీ నాయకులు చెప్పినట్టుగా నడుచుకున్నారు. అయితే ఇప్పుడు స్థానిక ఎన్నికలకు నోటీఫికేషన్‌ విడదలైంది. ఎన్నికల నిబంధనల ప్రకారం పార్టీల రంగులు, నేతల ఫొటోలు వంటివి కనిపించకూడదు. మరీ కార్యాలయాల గోడలకు వేసిన రంగులను ఏమి చేస్తారో వేచి చూద్దాం. 

Updated Date - 2020-03-08T10:58:26+05:30 IST