వెలుగునీడలు

ABN , First Publish Date - 2020-12-28T04:48:46+05:30 IST

పార్వతీపురం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) 2020లో వెలుగునీడల్లో పయనించింది. ఏజెన్సీలో కరోనా ప్రభావం స్పష్టంగా కనిపించింది. దాదాపు ఎనిమిది నెలల కాలంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులేవీ జరగలేదు. నాలుగు నెలలుగా మాత్రమే ఒక్కో అడుగూ పడుతోంది.

వెలుగునీడలు
ఐటీడీఏ కార్యాలయం

ఐటీడీఏలో పట్టాలెక్కిన అభివృద్ధి

50 వేల ఎకరాల్లో సాగు హక్కు పట్టాలు పంపిణీ

25 వేల ఎకరాల్లో ఉద్యానవన పంటల సాగుకు చర్యలు

చురుగ్గా ఏకలవ్య పాఠశాల భవన నిర్మాణ పనులు

కురుపాం నియోజకవర్గంలో గిరిజన ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటు

సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణానికి నిర్ణయం

సాలూరులో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన


పార్వతీపురం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) 2020లో వెలుగునీడల్లో పయనించింది. ఏజెన్సీలో కరోనా ప్రభావం స్పష్టంగా కనిపించింది. దాదాపు ఎనిమిది నెలల కాలంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులేవీ జరగలేదు. నాలుగు నెలలుగా మాత్రమే ఒక్కో అడుగూ పడుతోంది. సాగు భూములపై పట్టాల పంపిణీ.. ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహం.. ఏకలవ్య పాఠశాల భవన నిర్మాణాలు.. గిరిజన ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటు.. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణాలకు నిర్ణయాలు ఇలా అంచెలంచెలుగా అభివృద్ధి పనులు పట్టాలెక్కుతున్నాయి. 


(పార్వతీపురం)

ఐటీడీఏలో తొలి ఎనిమిది నెలల్లో ప్రగతి పెద్దగా లేకపోయినా తరువాత నాలుగు నెలల్లో అభివృద్ధి చేసేందుకు  అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. లాక్‌డౌన్‌ ముగింపు వరకు పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. జూన్‌, జూలై నెలల్లో రహదారుల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించి పనులు వేగవంతంగా చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. అప్పట్లో గిరిజన ఇంజినీరింగ్‌ కళాశాలకు స్థల ఎంపిక మినహా పెద్దగా అభివృద్ధి జరగలేదని చెప్పాలి. ఆ తర్వాత నాలుగు నెలల్లో మాత్రం పీవో కూర్మనాథ్‌ ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్లారు. ప్రజాపయోగ పనులకు శ్రీకారం చుట్టారు. ఐటీడీఏ పరిధిలో సుమారు 50 వేల ఎకరాల్లో గిరిజన రైతులకు సాగు హక్కు పట్టాల పంపిణీ జరిగింది. రాష్ట్రంలోనే అతిపెద్ద గిరిజన ప్రాంతం గల పాడేరు ఐటీడీఏ తరువాత పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోనే 50 వేల ఎకరాలపై పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఐటీడీఏ పీవో ప్రత్యేక శ్రద్ధతో చేపట్టారు. అలాగే గిరిజనులకు సాగు హక్కు పట్టాల ద్వారా అందించిన భూముల్లో 25 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు వేసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. పల్లెల్లో గ్రామసభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు. త్వరలోనే జీడి తదితర పంటల సాగుకు సంబంధించి ఎరువుల పంపిణీ, గుంతల తవ్వకం చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు.

ఐటీడీఏ పరిధిలోని కురుపాం, అనసభద్ర, జీఎన్‌ పేట (కొటికపెంట) వద్ద నిర్మిస్తున్న ఏకలవ్య పాఠశాలల భవన నిర్మాణాలు గత రెండు నెలలుగా జరుగుతున్నాయి. దశాబ్ద కాలంగా ప్రారంభం కాని ఏకలవ్య పాఠశాలల భవన నిర్మాణ పనులు ఇటీవల మొదలయ్యాయి. గత నెల నుంచి పుంజుకున్నాయి. వేగవంతంగా జరిగేలా పీవో చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పనులు పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించారు.  

కురుపాం నియోజకవర్గానికి గిరిజన ఇంజినీరింగ్‌ కళాశాలతో పాటు డైట్‌ కళాశాల మంజూరైంది.ఈ విధంగా  కురుపాం నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకుంది. 

పార్వతీపురంలో సూపర్‌ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, సాలూరులో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కానున్నాయి. పార్వతీపురంలో స్థల సమీకరణ పూర్తయింది. సాలూరులో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవలే శంకుస్థాపన చేశారు. 

2019లో ముగ్గురు పీవోలను ప్రభుత్వం మార్చింది. డాక్టర్‌ వినోద్‌కుమార్‌, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, డాక్టర్‌ మహేష్‌కుమార్‌లను ఐటీడీఏ పీవోలుగా నియమించింది. కొంతకాలం అప్పటి జాయింట్‌ కలెక్టర్‌ వెంకటరమణరెడ్డి ఇన్‌చార్జి పీవోగా వ్యవహరించారు. ఆగస్టు 17వ తేదీ నుంచి ప్రస్తుత ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌ విధులు నిర్వహిస్తున్నారు. 

ప్రతీ మూడు నెలలకు ఒకసారి నిర్వహించాల్సిన ఐటీడీఏ పాలకవర్గ సమావేశం ఈ ఏడాది జరగలేదు.  స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం పాలకవర్గ సమావేశం జరిగే అవకాశం ఉంది.


Updated Date - 2020-12-28T04:48:46+05:30 IST