వలం‘టియర్స్’
ABN , First Publish Date - 2020-04-28T11:01:21+05:30 IST
గ్రామ, వార్డు వలంటీర్లంటే అధికార పార్టీ..

ఉద్యోగ భద్రత లేని జీవితాలు
నాయకులు చెప్పినట్టు నడుచుకోవాల్సిందే
నిబంధనల ఊసెత్తితే అంతే...
కార్యకర్తలకూ లొంగి ఉండాల్సిందే...
నేతల ఆదేశాలతో అనేక మందికి ఉద్వాసన
(విజయనగరం-ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్టు ఓవైపు ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు ప్రతి వలంటీరు మెడపైనా ‘అధికార’ కత్తి వేలాడుతోంది. ఇప్పటికే లెక్కకు మిక్కిలి పనులతో సతమతమవుతున్న వలంటీర్లకు అధికార పార్టీ కార్యకర్తల రూపంలో భయం వెంటాడుతోంది. నాయకులు.. ప్రజాప్రతినిధులే కాదు.. ఆఖరికి కార్యకర్తకు కోపం వచ్చినా వలంటీర్ పోస్టు కోల్పోవలసిందే. ఇదంతా ‘మౌఖికంగానే’ పూర్తవుతుండడం గమనార్హం. ఇలా తరచూ జిల్లాలో ఎక్కడో ఓ చోట వలంటీర్లు ఉద్వాసనకు గురవుతున్నారు. ఉపాధి కోల్పోయి కుటుంబాలతో రోడ్డున పడుతున్నారు.
గ్రామ, వార్డు వలంటీర్లంటే అధికార పార్టీ నాయకుల చేతిలో కీలుబొమ్మలు అనే స్థాయిలో వ్యవహారాలు నడుస్తున్నాయి. నేతల నుంచి కార్యర్తల వరకూ అందరూ వీరిపై పెత్తనం చెలాయించే వారే. వారు చెప్పినట్టు వలంటీర్లు నడుచుకోవాల్సిందే. పొరపాటున ప్రభుత్వ నిబంధనల మేరకు పనిచేస్తామంటే పోస్టుపై ఆశలు వదులుకోవాల్సిందే. జిల్లాలో ఎక్కడికక్కడ ఉద్వాసనకు గురవుతున్న వలంటీర్ల ఉదంతాలే దీనికి ప్రధాన ఉదాహరణ. అధికార పార్టీ కార్యకర్తలు, అభిమానులే అత్యధిక శాతం వలంటీర్లుగా నియమితులైన విషయం ఎవరూ కాదనలేని సత్యం. దరఖాస్తులు.. ఇంటర్వ్యూలు అంతా పైపైనే. పార్టీ ఒత్తిడి లేని చోట్ల మాత్రమే కొద్దిమంది వలంటీర్లు పారదర్శకంగా ఎంపికవుతున్నట్లు సమాచారం. అటువంటి వారు ఏదోలా ఉద్యోగం పొందామనుకునే లోపే స్థానిక నాయకుల హుకుం మొదలవుతోంది. చెప్పినట్లు వినకపోతే తొలగించాలని అధికార పార్టీ నేతలు అధికారులకు ఆదేశించడం.. వారు ఎటువంటి సమాచారం లేకుండా వలంటీర్లను పక్కన పెడుతుండడం రివాజుగా మారిపోయింది.
ప్రస్తుతం జిల్లాలో 11,148 వలంటీర్ల పోస్టులు ఉన్నాయి. వీటిలో ఖాళీగా ఉన్న 332 పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈనెల 24తో ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. సోమవారం నుంచి ఈనెల 29వరకు మండలాల వారీగా మౌఖిక పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత తుదిజాబితా ప్రకటించి విధుల్లోకి తీసుకుంటారు. ప్రభుత్వం ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నా... వలంటీర్లకు ఉద్యోగ భద్రత ఉండడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వారికి విధి నిర్వహణలో స్వేచ్ఛ ఉండటం లేదు.
క్షేత్ర స్థాయిలో బండచాకరీ చేయిస్తున్నారు. ఇంత కష్టపడుతున్నా గ్రామ స్థాయిలోని నాయకులకు ఏమాత్రం అనుకూలంగా వ్యవహరించకపోయినా ఉద్యోగం పోయినట్టే. చిన్నస్థాయి నాయకుడు కూడా వీరిని బెదిరిస్తున్నాడు. జియ్యమ్మవలస మండలంలో ఇటువంటి సంఘటనే ఇటీవల చోటుచేసుకుంది.. గ్రామ స్థాయి నాయకుడు వలంటీర్‌ను బెదిరించి తనను కలవాలని... లేదంటే నీ ఉద్యోగానికి ఎసరేనంటూ హెచ్చరించాడు. అనంతరం ఉద్యోగం నుంచి తొలగించేలా చేశాడు.
- జియ్యమ్మవలస మండలం గెడ్డతిరువాడ గ్రామానికి చెందిన గోపిశెట్టి ఝాన్సీని తాజాగా తొలగించారు. ప్రభుత్వం అందించిన రూ.1000 లాక్‌డౌన్ పరిహార నగదును వైసీపీ అభ్యర్థులు, నాయకుల సమక్షంలో అందించలేదన్నది అభియోగంగా ఆమె చెబుతోంది. వైసీపీ నాయకులు చెప్పినట్లు వినని కారణంగానే తనను తొలగించారని ఝాన్సీ వాపోతున్నారు.
- ఇదే గ్రామానికి చెందిన బొంగు కార్తీక్ తాను ప్రభుత్వం అప్పగించిన విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నానని చెబుతున్నాడు. తనను ఎందుకు తొలగించారో తెలియదని వాపోతూ చెప్పాడు. నాయకులకు నచ్చకపోతే తీసేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
- గరుగుబిల్లి మండలం గొట్టివలస గ్రామ వలంటీర్ పరిస్థితి మరింత చిత్రమైనది. ఆమె భర్త ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేయటమే నేరంగా భావించినట్లున్నారు. భర్త టీడీపీ తరఫున నామినేషన్ వేశాడు. దీంతో అధికార పార్టీ నేతలకు కోపం వచ్చింది. అంతే అభ్యర్థి భార్యను ఎలా వలంటీర్‌గా కొనసాగిస్తారంటూ రాష్ట్ర స్థాయిలో కీలక పదవిలో ఉన్న నేత హుకుం జారీ చేశారు. అనంతరం వలంటీర్ ఉద్యోగం ఊడిపోయింది.
- ఇదే గ్రామంలో జి.హిమకుమారి అనే మరో వలంటీర్‌ను తొలగించారు. ఆమె తండ్రి వైసీపీ నాయకుడే. కానీ ఆయన వేరే పార్టీ వారితో తిరుగుతున్నాడన్నది అభియోగంగా తెలుస్తోంది. ఈ కారణంతోనే ఆమెను తొలగించినట్లు చెప్పుకుంటున్నారు.
- ఇదే మండలం రావుపల్లిలోనూ ఇద్దరు వలంటీర్లను ఇదే కారణంతో విధుల నుంచి తొలగించారు.
- నెల్లిమర్ల నియోజకవర్గ కేంద్రంలో చేపట్టిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ చిత్రపటం పెట్టి దానికి వలంటీర్లు వంగివంగి దండాలు పెట్టేలా వైసీపీ నాయకులు నిర్దేశించారు. వారు చెప్పినట్లు వినకపోతే కక్ష పెట్టుకుని తరువాత ఏదో కారణం చూపి తొలగిస్తారన్న భయం వలంటీర్లలో గూడు కట్టుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంఘటనలు. నాయకులకు నచ్చకపోతే ఉద్యోగంలో మనలేని పరిస్థితి వారిది. పైగా వలంటీర్ల నియామకాన్ని మండల స్థాయిలో ఎంపీడీఓతో కూడిన కమిటీ చేపడుతోంది. మౌఖిక పరీక్ష నిర్వహించి నియమిస్తున్నారు. కమిటీ నిర్ణయం మాత్రం నామమాత్రమే అవుతోంది.