కదలని ప్రచార రథం

ABN , First Publish Date - 2020-03-13T11:00:07+05:30 IST

ప్రాదేశిక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారంపై దృష్టి సారించారు. బీఫారాల కోసం ఇంకా నిరీక్షిస్తున్న వారు.. ఎంపీపీ పదవికి

కదలని ప్రచార రథం

ప్రచారానికి దూరంగా నేతలు

అయోమయంలో అభ్యర్థులు

ఒకేసారి అన్ని ఎన్నికలు రావడంతో ఇబ్బ్దందులు


ప్రాదేశిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఒకటి...రెండు చోట్ల తప్ప దాదాపుగా ఎక్కడ... ఎవరు బరిలో నిలిచేదీ తెలిపోయింది. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రచారంలోకి దిగడం ఆనవాయితీ. ఇక్కడే... అసలు సమస్య తలెత్తుతోంది. సాధారణంగా అభ్యర్థులతో పాటు కీలక నేతలు ప్రచారంలోకి దిగుతుంటారు.


కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వరుస ఎన్నికలు..  సీట్ల సర్దుబాట్లు.. అసంతృప్తులకు బుజ్జగింపులు..తదితర అంశాల నేపథ్యంలో ముఖ్య నాయకులు ప్రచారంపై దృష్టి పెట్టలేకపోతున్నారు. కొందరైతే ప్రచారానికి రాలేకపోతున్నామని చెప్పేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రచార ఎత్తుగడలు ఎలా వేయాలో తెలియక అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. 


(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

ప్రాదేశిక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారంపై దృష్టి సారించారు. బీఫారాల కోసం ఇంకా నిరీక్షిస్తున్న వారు.. ఎంపీపీ పదవికి ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్న స్థానాలను మినహాయిస్తే మిగతా చోట్ల ప్రచారానికి దిగిపోయారు. ఎంతగా దూసుకెళ్దామన్నా తమను ఉత్సాహంగా ముందుకు నడిపించే నాయకుడు లేకపోవడం పెద్ద లోటుగా అభ్యర్థులు భావిస్తున్నారు.  కొన్నిచోట్ల అభ్యర్థులు చేసేదిలేక ప్రచారానికి స్థానికంగా ఉన్న చిన్న నాయకులు, కార్యర్తలతోనే నెట్టుకు వస్తున్నారు.


వరుసగా ఎన్నికల నోటిఫికేషన్లు రావడంతో రాజకీయ నాయకులకు ఊపిరి సలపని పరిస్థితి ఏర్పడింది. ఇదివరకు మండల ప్రాదేశికాలకు, జిల్లా ప్రాదేశిక ఎన్నికల ప్రచారం అంటే స్థానికంగా ఉన్న నాయకులతో పాటు మండల స్థాయి నాయకులు.. కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యేల ద్వారా ప్రచారం చేసే పరిస్థితి ఉండేది. దీనికి తగ్గట్టుగానే ఖర్చులు కూడా ఉండేవి. ఎంపీటీసీ స్థానానికి కూడా అనధికారికంగా లక్షల్లో ఖర్చులు చేసే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం హంగామా లేకుండా ప్రచారం సాగిపోతోంది. సాదాసీదాగా నడుస్తోంది. కొద్దిమంది స్థానికులతో ఇంటింటికీ వెళ్తున్నారు. జనాన్ని పోగేయడానికి కూడా పాట్లు పడుతున్నారు. 


అందరూ బిజీ...

ఈనెల 11తో ప్రాదేశిక నామినేషన్ల పర్వం ముగిసింది. గురువారం పరిశీలనలు పూర్తి చేశారు.  21న జిల్లా, మండల ప్రాదేశిక ఎన్నికల పోలింగ్‌ ఉంటుంది. ఇదే సమయంలో మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌, నామినేషన్ల స్వీకరణ జరుగుతోంది. దీంతో పట్టణంలోని నాయకులు పల్లెల్లో జరిగే ఎంపీటీసీ, జడ్పీ అభ్యర్థుల ప్రచారానికి వెళ్లలేకపోతున్నారు. చాలా బిజీగా ఉంటున్నారు. ఉదయం నామినేషన్లకు వెళ్తూ మధ్యాహ్నం వీలు కుదిరితే ఒకటిరోజు చోట్ల ప్రచారంలో కనిపిస్తున్నారు.


అదే తక్కువ సమయమే ఉంటున్నారు. సాయంత్రం బుజ్జగింపుల్లో ఉంటున్నారు. ఇంకా బీఫారం అందుకోని వారి పేర్లపై కుస్తీలు పడుతున్నారు. ప్రధానంగా రెబళ్లను సముదాయించే పనిలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. రిజర్వేషన్‌ మార్పుల కారణంగా కొందరు కీలక నాయకులు మండలాల్లో చక్రం తిప్పే పరిస్థితి లేదు. అటువంటి వారందరూ వేరొకచోట పోటీ చేసేలా చూస్తున్నారు. దీని వల్ల మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, మాజీ మంత్రులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు ప్రచారంలో పెద్దగా కనిపించడం లేదు.


నియోజకవర్గ ఇన్‌చార్జిలు సైతం క్షేత్రస్థాయికి వెళ్లలేకపోతున్నారు. మరీ ఒత్తిడి చేస్తే ఆయా నాయకులు తమ బంధువులను పంపుతున్నారు. ఎపుడూ లేని విధంగా ఎన్నికలు నెల రోజుల వ్యవధిలో నిర్వహించడంతో ఏం చేయాలి.. ఎలా వెళ్లాలి.. అనేది తేల్చుకోలకపోతున్నారు. అయితే ప్రజలు మాత్రం ఇది సరైనదిగా భావిస్తున్నారు. లేదంటే ప్రచారాలతో అదరగొట్టి నెలల తరబడి  ఇబ్బందులకు గురిచేసే పరిస్థితి ఉండేదంటున్నారు. ఏదైనాగాని ఊపిరి సలపని పరిస్థితిలో స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. 

Updated Date - 2020-03-13T11:00:07+05:30 IST