వస్త్ర దుకాణాలకు.. అమ్మఒడి డబ్బులు..: వైసీపీ మంత్రి

ABN , First Publish Date - 2020-03-04T10:46:44+05:30 IST

రెవెన్యూ సమస్యలు అనేకం ఎదురవుతున్నాయి... వాటిని పరిష్కరించకుండా

వస్త్ర దుకాణాలకు.. అమ్మఒడి డబ్బులు..: వైసీపీ మంత్రి

‘రెవెన్యూ’ను ప్రక్షాళన చేస్తాం..

జూన్‌ చివరి నాటికి భూ రికార్డులు సరిచేయాలి

యాజమాన్య హక్కుల పరిరక్షణకు చట్టం 

ఉపమఖ్యమంత్రి, రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి సుభాష్‌ చంద్రబోస్‌


విజయనగరం(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ సమస్యలు అనేకం ఎదురవుతున్నాయి... వాటిని పరిష్కరించకుండా నిద్రపోతున్నారా అంటూ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పిల్లి సుభాస్‌ చంద్రబోస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 78 గ్రామాల్లోని భూములకు సంబంధించిన పత్రాలు సరిగాలేపోతే ప్రజలు ఎందుకు తిరగబడరని ప్రశ్నించారు. ఇప్పుడు ఆ భూములకు సంబంధించిన పత్రాలు లేవంటూ చేతులెత్తేయడం సరికాదని మండిపడ్డారు. మళ్లీ వస్తాను అప్పటికల్లా జిల్లాలోని భూ రికార్డులు సరిచేయాలని, లేకుంటే చర్యలు తప్పవని సంబంధిత అధికారులను హెచ్చరించారు.


దేశంలోనే తొలిసారిగా...

దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో భూ యజమానుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రూపొందించారని మంత్రి సుభాష్‌ చంద్రబోస్‌ తెలిపారు. సమీక్ష అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. భూమి తన చేతుల్లోనే ఉందనే ధైర్యం, నమ్మకాన్ని కల్పించేందుకు ఈ చట్టాన్ని రూపొందిస్తున్నట్టు చెప్పారు. దీని ప్రకారం రైతుల భూమిని ఎవరైనా తప్పుడుగా రిజిస్ట్రేషన్‌ చేస్తే ఆ నష్ట పరిహారాన్ని ప్రభుత్వం అందించేలా ఈ చట్టం ఉంటుందన్నారు. అలాగే రెవెన్యూ రికార్డుల ప్యూరిఫికేషన్‌ గడువును మే నుంచి జూన్‌ వరకు పొడిగించినట్టు చెప్పారు. 1985లో కరణం, ముణసబ్‌లు ఉన్నప్పుడు రెవెన్యూ వ్యవస్థ బాగుండేదని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా వారిని తొలగించడంతో ఇబ్బందులు మొదలయ్యాయన్నారు. 


వస్త్ర దుకాణాలకు.. అమ్మఒడి డబ్బులు.... 

అమ్మఒడి పథకం కింద ప్రభుత్వం అందించిన డబ్బులు వస్త్ర దుకాణాలకు వెళ్లిపోయాయని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. అధికారులతో సమీక్షల పాల్గొన్న ఆయన మాట్లాడారు. పేద ప్రజలకు చివరకు మిగిలేది గూడేనని, అందుకే ముఖ్యమంత్రి ఆ దిశగా కృషి చేస్తున్నారన్నారు. ఈ నెల 10వ తేదిలోగా జిల్లాలో ఇళ్ల స్థలాల లే అవుట్ల పక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌, ఎమ్మెల్యేలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-04T10:46:44+05:30 IST