భూ వివాదం తెచ్చిన చిక్కు!

ABN , First Publish Date - 2020-11-14T03:51:01+05:30 IST

భూ వివాదం నేపథ్యంలో ఇద్దరిపై హత్యాయత్నం జరిగిన సంఘటన సంచలనం సృష్టించింది.

భూ వివాదం తెచ్చిన చిక్కు!
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శిల్లా అరుణ




ఇద్దరిపై కత్తితో దాడి...తీవ్ర గాయాలు

భోగాపురం సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయం వద్ద ఘటన

భూ వివాదమే కారణం

భోగాపురం, నవంబరు 13: భూ వివాదం నేపథ్యంలో ఇద్దరిపై హత్యాయత్నం జరిగిన సంఘటన సంచలనం సృష్టించింది. కత్తితో పొడవడంతో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. భోగాపురం సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయం వద్ద శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పూసపాటిరేగ మండలం కోనాడకు చెందిన బొల్లింకల రామగురువులు అనే వ్యక్తికి   స్థానికంగా 1.98 ఎకరాల భూమి ఉంది. దీనికి సంబంధించి సమీప బంధువులైన బసవ అచ్చిబాబు కుటుంబంతో 16 ఏళ్లుగా వివాదం నడుస్తోంది. నిత్యం తగాదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆ భూమిని విజయవాడకు చెందిన శ్రీనివాసరెడ్డికి విక్రయించేందుకు రామగురువులు సిద్ధపడ్డాడు. భూమి రిజిసే్ట్రషన చేయించేందుకు శుక్రవారం రామగురువులు, ఆయన కుమార్తె శిల్లా అరుణ, కొనుగోలుదారుడు శ్రీనివాసరెడ్డి, ఆయన తరఫున విజయనగరం కణపాకకు చెందిన ప్రవీణ్‌కుమార్‌.. సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయానికి చేరుకున్నారు. ఇంతలో బసవ అచ్చిబాబు, ఆయన కుమారుడు ఉపేంద్రతో పాటు మరో ఇద్దరు వచ్చి రామగురువులుతో వాదనకు దిగారు. తమకు విక్రయించినట్టు అగ్రిమెంట్‌ చేసుకున్న భూమిని వేరొకరికి ఎలా అమ్ముతారని ప్రశ్నించారు. మాటామాటా పెరిగి ఒకరినొకరు నెట్టుకున్నారు. ఉపేంద్ర తన వెంట తెచ్చుకున్న కత్తితో అరుణ కుమారి పొట్టలో మూడుసార్లు పొడిచాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె కొద్దిదూరం భయంతో పరుగులుతీసి రోడ్డుపై కూలిపోయింది. ప్రవీణ్‌కుమార్‌ ఈ దృశ్యాలను సెల్‌ఫోనలో   చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తుండగా ఉపేంద్ర కోపోద్రిక్తుడయ్యాడు. ప్రవీణ్‌కుమార్‌ను వెంబడించి కత్తితో పొడవడంతో ఆయన కుప్పకూలిపోయాడు. తరువాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ హఠాత పరిణామంతో సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. భయంతో స్థానిక వ్యాపారులు షాపులను మూసివేశారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ మహేష్‌ హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను విజయనగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారు చికిత్స పొందుతున్నారు. విజయనగరం డీఎస్పీ వీరాంజనేయరెడ్డి, సీఐ సీహెచ్‌ శ్రీధర్‌ ఆసుపత్రికి వెళ్లి... క్షతగాత్రులను పరిశీలించారు.  వివరాలను అడిగి తెలుసుకున్నారు. శిల్లా అరుణకుమారి ఫిర్యాదు మేరకు బసవ ఉపేంద్ర, బసవ అచ్చిబాబు, బసవ వెంకటేషు, కంబపు అప్పలరెడ్డిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ మహేష్‌ తెలిపారు. కోనాడలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీస్‌ పహారా ఏర్పాటు చేసినట్టు సీఐ శ్రీధర్‌ తెలిపారు. 



Updated Date - 2020-11-14T03:51:01+05:30 IST