జిరాయితీగా డీ పట్టా భూమి
ABN , First Publish Date - 2020-12-19T03:43:22+05:30 IST
ఓ వైపు భూముల సమగ్ర రీ సర్వేకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండగా... మరోవైపు డీ పట్టా భూములను కొందరు తమ పలుకుబడితో జిరాయితీగా మార్చుతున్నారు. కోట్లాది రూపాయల ఆస్తులను కొల్లగొడుతున్నారు. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నేతలపైనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొమరాడ మండలం గంగరేగువలసలో 1.52 ఎకరాల డీ పట్టా భూమిని అక్కడి వైసీపీ నాయకుడు తన భార్య పేరిట జిరాయితీగా మార్చుకున్నారని గ్రామస్థులు శుక్రవారం తహసీల్దారు ఎస్‌ఎల్‌వీ ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని విన్నవించారు.
అధికార పార్టీ నేతపై ఆరోపణలు
తహసీల్దారుకు గ్రామస్థుల ఫిర్యాదు
కొమరాడ, డిసెంబరు 18: ఓ వైపు భూముల సమగ్ర రీ సర్వేకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండగా... మరోవైపు డీ పట్టా భూములను కొందరు తమ పలుకుబడితో జిరాయితీగా మార్చుతున్నారు. కోట్లాది రూపాయల ఆస్తులను కొల్లగొడుతున్నారు. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నేతలపైనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొమరాడ మండలం గంగరేగువలసలో 1.52 ఎకరాల డీ పట్టా భూమిని అక్కడి వైసీపీ నాయకుడు తన భార్య పేరిట జిరాయితీగా మార్చుకున్నారని గ్రామస్థులు శుక్రవారం తహసీల్దారు ఎస్‌ఎల్‌వీ ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని విన్నవించారు. ఇందుకు సంబంధించి గ్రామస్థులు గంట వెంకటినాయుడు, కోడి తిరుపతిరావు చెబుతున్న వివరాలిలా ఉన్నాయి. గంగరేగువలసలోని సర్వే నంబరు 224-3లో 1.52 ఎకరాల డీ పట్టా భూమి ఉంది. ఇది బొమ్మాళి భీమయ్యకు చెందినది. గతంలో ప్రభుత్వం అతని పేరిట డీ పట్టా మంజూరు చేసింది. కానీ ఇటీవల ఆ భూమి ద్వారపురెడ్డి లక్ష్మి పేరుతో 1బీ అడంగల్‌లో జిరాయితీ భూమిగా చూపిస్తోంది. పూర్వీకుల నుంచి దాఖలు పడినట్టు నమోదైంది. దీనిపై గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధికారులను ఆశ్రయించడం చర్చనీయాంశమైంది. ద్వారపురెడ్డి లక్ష్మి వైసీపీ కీలక నేత భార్య కావడం వల్లనే రాజకీయ ఒత్తిళ్లతో డీ పట్టాను జిరాయితీ భూమిగా మార్చారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అధికారులు, సిబ్బంది పాత్రపై విచారణ చేసి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై తహసీల్దార్ ఎస్‌ఎల్‌వీ ప్రసాద్ వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా... డీ పట్టాను జిరాయితీగా మార్చే అధికారం ఎవరికీ లేదన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.