సాయం కోరడమే శాపమైంది..

ABN , First Publish Date - 2020-09-16T10:56:05+05:30 IST

ఊరు వరకు బండిపై తీసుకువెళ్లమని లిఫ్ట్‌ అడిగిన ఆ బాలుడు బండి ఆగేలోగా దిగేందుకు ప్రయత్నించి మృత్యుపాలయ్యాడు. పోలీసులు

సాయం కోరడమే శాపమైంది..

 వాహనం నుంచి జారిపడి బాలుడి మృతి

 చెరుకుపల్లి వద్ద ప్రమాదం


దత్తిరాజేరు, సెప్టెంబరు 15 : ఊరు వరకు బండిపై తీసుకువెళ్లమని లిఫ్ట్‌ అడిగిన ఆ బాలుడు బండి ఆగేలోగా దిగేందుకు ప్రయత్నించి మృత్యుపాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలా ఉన్నాయి. చెరుకుపల్లికి చెందిన ఆల్తి ప్రవీణ్‌(10) పానీపూరి తినాలనే కోరికతో స్నేహితుడు తరుణ్‌తో కలిసి సమీపంలోని జగన్నాఽథపురం మంగళవారం సాయంత్రం వెళ్లాడు. తిరిగి రాత్రి 8 గంటల సమయంలో ఇద్దరూ స్వగ్రామానికి కాలినడకన వస్తుండగా.. అటుగా వెళ్తున్న వాహనాన్ని లిఫ్ట్‌ అడిగి ఎక్కారు.


అదే ఆ బాలుడికి శాపంగా మారింది. గ్రామం దాటిపోతున్నా డ్రైవర్‌ వాహనాన్ని ఆపకపోవడంతో ఆందోళన చెందిన ప్రవీణ్‌ దిగిపోయేందుకు ప్రయత్నించి జారి కింద పడ్డాడు. ఇది గమనించిన తరుణ్‌ కేకలు వేయడంతో డ్రైవర్‌ వాహనాన్ని ఆపి చూశాడు. అప్పటికే ప్రవీణ్‌ అచేతనంగా పడి ఉండడాన్ని గమనించిన వాహనం డ్రైవర్‌ అక్కడి నుంచి జారుకు న్నాడు. ఈ విషయాన్ని ప్రవీణ్‌ తల్లిదండ్రులకు తరుణ్‌ తెలియజేయగా...


అంతా అక్కడకు చేరుకుని 108 వాహనానికి ఫోన్‌ చేశారు. అక్కడి చేరుకున్న 108 వాహన సిబ్బంది ప్రవీణ్‌ను పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. దీంతో ప్రవీణ్‌ తల్లిదండ్రులు ఆల్తి రమేష్‌, రోహిణి కన్నీరుమున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న బూర్జివలస పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గజపతినగరం ఆసుపత్రికి తరలించారు.


ప్రమాదానికి కారణమైన వాహనం కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆల్తి రమేష్‌, రోహిణిలకు ఇద్దరు కుమారుల్లో చిన్నవాడు ప్రవీణ్‌. రాత్రి 7 గంటల వరకు తమ వద్దనే ఉన్న కుమారుడు గంటలోనే మృత్యువాత పడడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. 

Updated Date - 2020-09-16T10:56:05+05:30 IST