ధరలపై నియంత్రణేదీ?
ABN , First Publish Date - 2020-11-16T04:15:41+05:30 IST
నిత్యావసర, కూరగాయల ధరలను ఆదుపుచేయలేని అసమర్థ ప్రభుత్వం రాష్ట్రంలో నడుస్తోందని, ధరలపై నియంత్రణ లేకపోవడం దారుణమని టీడీపీ విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ ఇనచార్జి అదితి గజపతిరాజు విమర్శించారు.

టీడీపీ విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ ఇనచార్జి అదితి
విజయనగరం రూరల్, నవంబరు 15: నిత్యావసర, కూరగాయల ధరలను ఆదుపుచేయలేని అసమర్థ ప్రభుత్వం రాష్ట్రంలో నడుస్తోందని, ధరలపై నియంత్రణ లేకపోవడం దారుణమని టీడీపీ విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ ఇనచార్జి అదితి గజపతిరాజు విమర్శించారు. టీడీపీ విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్ష, రఽపధాన కార్యదర్శలు సువ్వాడ వనజాక్షి, అనురాధ బేగం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఆర్‌అండ్‌బీ రైతుబజార్ వద్ద నిత్యావసరాల ధరలపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అదితి మాట్లాడుతూ, ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహనరెడ్డి చేపట్టిన పాదయాత్రలో అమలుకాని హామీలు ఇచ్చారని, వాటిని నేడు విస్మరించారని అన్నారు. కాయగూరల ధరలు బెంబేలెత్తుస్తున్నాయన్నారు. తక్షణమే ధరలను తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కరోనా నేపథ్యంలో ఆదాయాలు పడిపోయిన సమయంలో నిత్యావసరాలు, కాయగూరల ధరలు పెరిగితే పేదలు చాలా ఇబ్బంది పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ విజయనగరం పార్లమెంట్ మహిళా విభాగం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సువ్వాడ వనజాక్షి, అనురాధ బేగంలు మాట్లాడుతూ, నిత్యావసరాల ధరల పెరుగుదలపై విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రభుత్వం దిగి రాకుంటే మరింతగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ మేయర్ అభ్యర్థి కంది శమంతకమణి, విజయనగరం కార్పొరేషన పరిధిలో టీడీపీ అభ్యర్థులుగా బరిలో వున్న పలువురు మహిళా అభ్యర్థులు పాల్గొన్నారు.