మాస్క్‌ల్లోనూ మోసాలు

ABN , First Publish Date - 2020-06-21T11:03:00+05:30 IST

కరోనా నియంత్రణకు కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరికీ మూడు మాస్క్‌లు చొప్పున పంపిణీ చేశామని ప్రభుత్వం చెబుతుండగా... క్షేత్రస్థాయిలో

మాస్క్‌ల్లోనూ మోసాలు

పంపిణీలో అక్రమాలు

ప్రజలకు యాభై శాతమే అందిన వైనం

మనిషికి మూడు ఉత్తిదే 

కుటుంబానికి మూడు, నాలుగుతో సరి 

61.40 లక్షల మాస్కులు పంపిణీ పూర్తి: డీఆర్‌డీఏ పీడీ


మెంటాడ, జూన్‌ 20: కరోనా నియంత్రణకు కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరికీ మూడు మాస్క్‌లు చొప్పున పంపిణీ చేశామని ప్రభుత్వం చెబుతుండగా... క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కటీ ఇవ్వలేదన్న వాదన కొన్ని గ్రామాల్లో వినిపిస్తోంది. కీలక నేతల ఏలుబడిలో ఉన్న ప్రాంతాల్లోనే మాస్క్‌లను సంతృప్తికర స్థాయిలో పంపిణీ చేశారు. చాలా మండలాల్లో యాభై శాతమే అందాయి. జిల్లాలో మాస్కుల పంపిణీలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.


రాష్ట్రంలో మనిషికి మూడేసి చొప్పున మొత్తం 16 కోట్ల మాస్కులు పంపిణీ చేశామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు.. జిల్లాలో వాస్తవ పరిస్థితులకు ఎక్కడా పొంతన లేదు. జిల్లాలో ఒక్కొక్కరికీ మూడు చొప్పున 62 లక్షల మాస్కులు పంపిణీ లక్ష్యం కాగా.. ఇప్పటికే 61.40 లక్షలు పంపిణీ పూర్తి చేశామని జిల్లా అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిజానికి ఒక్కో కుటుంబానికి మూడు లేదా నాలుగు చొప్పున మాత్రమే మాస్కులు అందించారు. ఒక్కో మాస్కుపై రూ.3.50 చొప్పున అధికారులు లెక్కగట్టారు. ఇందులో కటింగ్‌, ట్రాన్స్‌పోర్టు కోసం 50 పైసలు, కుట్టుకూలీ మూడు రూపాయలుగా తేల్చారు.


ఈ మేరకు జిల్లా కేంద్రం నుంచి వస్త్రాన్ని మండలాలకు చేర్చారు.  అక్కడి వెలుగు ఏపీఎం వాటిని కుట్టించే బాధ్యతను తీసుకుని కుట్టు పూర్తయ్యాక వాటిని ఎంపీడీవోలకు అప్పగించారు. అనంతరం సెక్రటరీల పర్యవేక్షణలో గ్రామ వలంటీర్ల ద్వారా పూర్తి పారదర్శకంగా ఇంటింటికీ పంపిణీ చేయించామన్నది జిల్లా అధికారుల మాట. అయితే మనిషికి మూడు మాస్కులు ఎక్కడా అందలేదు. మండలానికి అదీ నోరున్న నేతలున్న గ్రామాల్లో మాత్రమే మనిషికి మూడు వంతున పంపిణీ చేసి... మిగిలిన గ్రామాల్లో ఒకరికి ఒకటి చొప్పున... గట్టిగా ప్రశ్నించే వారికి రెండేసి వంతున సరఫరా చేశారు. చాలా చోట్ల కుటుంబం మొత్తానికి మూడు, నాలుగు మాస్కులు విదిల్చి మమ అనిపించేశారు. ఈ విధంగా జిల్లావ్యాప్తంగా 50 శాతం మాస్కుల పంపిణీయే జరిగినట్లు ఉద్యోగవర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. ఇదిలా ఉండగా మండలాల్లో ఏపీఎంలు మాస్కులు కుట్టే బాధ్యతను స్వయం సహాయక సంఘాలకే అప్పగించాల్సి ఉంది. వారిలో కుట్టుపని  రానివారు ఉంటే స్థానికంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవచ్చనని మార్గదర్శకాలు స్పష్టం చే స్తున్నాయి. మెజారిటీ ఏపీఎంలు ఈ నిబంధన పాటించలేదు. నేతల కనుసన్నల్లో నడిచారు. దర్జీలకు కాంట్రాక్టుకు ఇచ్చినా ఘనులూ ఉన్నారు. 


మనిషికి మూడేసి మాస్కులకు క్లాత్‌ రాగా.. అరకొరగా ఇచ్చి మమ అనిపించిన అధికారులు మిగతా వస్ర్తాన్ని ఏం చేశారన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తం మాస్కులు కుట్టించినట్లు ఉన్నతాధికారులకు బురిడీ కొట్టి కుట్టు కూలీ కింద లక్షల రూపాయలు డ్రా చేసి స్వాహా చేసి ఉంటారన్న ఆరోపణలూ ఉన్నాయి. సరైన పర్యవేక్షణ కొరవడినందునే అవకతవకలు చోటుచేసుకున్నాయా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. 


61.40 లక్షల మాస్కుల పంపిణీ పూర్తి

 జిల్లా వ్యాప్తంగా 62 లక్షల మాస్కులు పంపిణీ చేయాలన్నది లక్ష్యం. సాలూరులో 40 వేలు, పాచిపెంటలో 20 వేలు మాస్కులు మినహా ఇప్పటివరకు 61.40 లక్షల మాస్కులు పంపిణీ పూర్తయ్యింది. అవికూడా త్వరలోనే పంపిణీ చేస్తాం. సీతానగరం, రామభద్రపురం మండలాలకు గురువారం పంపించాం. త్వరలోనే ఆయా చోట్ల పంపిణీ పూర్తవుతుంది. పంపిణీ ప్రక్రియ పారదర్శకంగా జరిగింది. 

- సుబ్బారావు, డీఆర్‌డీఏ, పీడీ

Updated Date - 2020-06-21T11:03:00+05:30 IST