ఇంటర్‌..ఇంతేనా?

ABN , First Publish Date - 2020-10-08T09:40:48+05:30 IST

విద్యార్థి భవిష్యత్‌కు చుక్కాని వంటి ఇంటర్‌ విద్యపై ఈ ఏడాది అయోమయ పరిస్థితి నెలకొంది...

ఇంటర్‌..ఇంతేనా?

  • మొదటి ఏడాది ప్రవేశాలపై స్పష్టత కరువు
  • ఆన్‌లైన్‌ తరగతులకూ ప్రయత్నించని వైనం


విద్యార్థి భవిష్యత్‌కు చుక్కాని వంటి ఇంటర్‌ విద్యపై ఈ ఏడాది అయోమయ పరిస్థితి నెలకొంది. ప్రధానంగా మొదటి ఏడాది తరగతులు ఎప్పుడు మొదలవుతాయి?... ప్రవేశాలు ఎలా చేపడతారు? తరగతులు ఉంటాయా? లేక ఆన్‌లైన్‌లో బోధిస్తారా? ఇలా అనేక ప్రశ్నలు విద్యార్థులు, తల్లిదండ్రులను వేధిస్తున్నాయి. ఇప్పటికే సగం విద్యా సంవత్సరం పూర్తయిపోయింది. ఈ నేపథ్యంలో తమ భవిష్యత్తు ఏమిటో తెలియక విద్యార్థులు తల్లడిల్లుతున్నారు. త్వరలో కళాశాలలు ప్రారంభమవుతాయనే వార్తలు వస్తున్నాయి...కానీ రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇది ఎంతవరకూ పూర్తి స్థాయిలో అమలవుతుందనేది ప్రశ్నార్థకమే.


(విజయనగరం - ఆంధ్రజ్యోతి)

విద్యార్థి జీవితాన్ని మలుపు తిప్పేది ఇంటర్మీడియట్‌. ఈ సమయంలో విద్యార్థి తీసుకునే నిర్ణయమే అతని భవితను నిర్ణయిస్తుందంటారు. అటువంటి కీలక దశలో ఉన్న విద్యార్థులు ఈ ఏడాది చదువులెలా అని ప్రశ్నిస్తున్నారు. కొవిడ్‌ కారణంగా విద్యా వ్యవస్థలోనే ప్రతిష్టంభన నెలకొంది. ఉన్నత పాఠశాల పరిధిలోని 9, 10తరగతుల విద్యార్థులకు పాఠశాలలు తెరిచారు. ఏదోలా తరగతులు నడుస్తున్నాయి. ఇంటర్‌ విషయంలో ఇంతవరకు ఎటూ తేల్చని పరిస్థితి నెలకొంది. ఈ నెల 15 తరువాత కళాశాలలు ప్రారంభమవుతాయనే వార్తలు వస్తున్నా... అది ఏవిధంగా ఉంటుందనే విషయమై స్పష్టత లేదు.  మరోవైపు 10వ తరగతి ఫలితాలకు సంబంధించి ర్యాండమ్‌గా ఉత్తీర్ణత ప్రకటించిన కారణంగా కళాశాలల్లో ఏ ప్రాతిపదికన సీట్లు ఇస్తారనేది తెలియడం లేదు.  దీనిపై జిల్లా ఉన్నతాధికారులకూ స్పష్టత లేదు. గత విద్యా సంవత్సరంలో ప్రథమ సంవత్సరంలో 28వేల మంది విద్యార్థులు చేరారు. వీరంతా ప్రస్తుతం ద్వితీయ సంవత్సరానికి వచ్చారు. వీరికీ తరగతులు జరుగుతాయా లేదో తెలియని పరిస్థితి ఉంది. ఆన్‌లైన్‌ తరగతులపైనా స్పష్టత లేదు. జిల్లాలో ఏటా జూనియర్‌ కళాశాలలు పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో 24 జూనియర్‌ కళాశాలలున్నాయి. 82 ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలున్నాయి. ఇవి కాకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలో 19 కేజీబీవీ కళాశాలలున్నాయి. ఈ ఏడాది నుంచి మొత్తంగా 33 కేజీబీవీల్లో ఇంటర్‌ తరగతులు నిర్వహించేలా అప్‌గ్రేడ్‌ చేశారు. మోడల్‌ స్కూల్స్‌ 16 ఉన్నాయి. ఇందులో కూడా ఇంటర్మీడియట్‌ ఉంది. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 10 కళాశాలలున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఆరు కళాశాలలు, ఎయిడెడ్‌ కళాశాలలు నాలుగు, ఏపీ రెసిడెన్షియల్‌ కళాశాల (తాటిపూడి), బీసీ వెల్ఫేర్‌ కళాశాల (జ్యోతీరావుపూలే) ఒకటి ఉంది. వీటిలో వేలాది మంది విద్యార్థులు ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశించాల్సి ఉంది. ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవు. అలాగే ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభం కాలేదు. ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల అంశాన్ని ఆర్‌ఐవో డి.మంజులవీణ వద్ద ప్రస్తావించగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు  రావాల్సి ఉందని చెప్పారు. కరోనా వైరస్‌ కారణంగా ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆన్‌లైన్‌ ప్రవేశాల విషయంలో ఇంకా   మార్గదర్శకాలు రావలసి ఉందన్నారు.

Updated Date - 2020-10-08T09:40:48+05:30 IST