ఇప్పటికైనా ‘ఆమె’ దూకుడుకు జగన్‌ ప్రభుత్వం బ్రేక్‌ వేస్తుందా!?

ABN , First Publish Date - 2020-10-31T16:55:18+05:30 IST

ఇప్పటికైనా జగన్‌ ప్రభుత్వం ఆమె దూకుడుకు బ్రేక్‌ వేస్తుందా? లేక మరింత రెచ్చిపోయేలా ఆమెను ప్రోత్సహించి..ఆ అపవాదును మూటగట్టుకుంటుందో చూడాలి.

ఇప్పటికైనా ‘ఆమె’ దూకుడుకు జగన్‌ ప్రభుత్వం బ్రేక్‌ వేస్తుందా!?

మాన్సాస్ ట్రస్ట్‌ ఛైర్‌పర్సన్‌గా సంచయిత ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మొన్నటి దాక ఆ పదవికి పూసపాటి వంశీయులు వన్నె తెస్తే..సంచయిత మాత్రం ఆ పదవి పరువుపోయేలా ప్రవర్తిస్తున్నారు. విజయనగరం జిల్లాలో ఆనందగజపతి కుటుంబ సభ్యులకు ఎలాంటి రాచ మర్యాదలు దక్కకూడదని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో ఆమె వ్యవహరిచిన తీరుపై జిల్లా వాసుల నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి. 


నేనే రాణి- నేనే మంత్రి!

విజయనగరం జిల్లాలో మాన్సాస్ ఛైర్ పర్సన్ సంచయిత తీసుకునే నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. ఈ ఏడాది మాన్సాస్ ఛైర్మన్‌గా ఉన్న అశోక్ గజపతిరాజుని అనూహ్యంగా తప్పించిన వైసిపి ప్రభుత్వం..ఆ బాధ్యతలు ఆయన సోదరుడి కూతురు సంచయితకు అప్పగించింది. అప్పటి నుంచే ఆమె ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ హల్‌చల్‌ చేస్తున్నారు. జగన్‌ ప్రభుత్వం అండతో అడ్డూ అదుపు లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. "నేనే రాణి- నేనే మంత్రి" అన్నట్లుగా ప్రవర్తించడంతో జిల్లాలో ఆమెపై విమర్శల జడివాన కురుస్తోంది. తాజాగా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో సంచయిత వ్యవహరించిన తీరు కొత్త వివాదానికి తెరలేపినట్లయింది. 


ఎవరూ రాలేదేం!?

విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో మాన్సాస్ ఛైర్ పర్సన్ సంచయిత అనుసరించిన వైఖరి తీవ్ర విమర్శలకు తావిస్తోంది. సిరిమానోత్సవ సందడిని మహారాజ కోట బురుజుపై నుండి పూసపాటి వంశీయులు తిలకించే ఆనవాయితిగా కొనసాగుతూ వస్తోంది. జిల్లాలో కరోనా ప్రభావం ఉండటంతో మహారాజ కోటపై నుండి సిరిమానోత్సవాన్ని చూడటానికి అశోక్ గజపతి కుటుంబీలు, స్నేహితులు ఎవరూ రాలేదు. అయితే ఎప్పటిలాగే ఆనందగపతి సతీమణి సుధాగజపతి, ఆయన కూతురు ఊర్మిలా గజపతి ఉత్సవాన్ని తిలకించటానికి కోటపైకి వచ్చారు.


కోట తలుపులు మూయించారా!?

అయితే ఆనందగజపతి భార్య, కూతురు మహారాజ కోట బురుజుపైకి వచ్చారన్న విషయం తెలుసుకున్న సంచయిత శివాలెత్తిపోయారు. వారిరువురినీ కోట బురుజు నుంచి దింపాలని  పోలీస్ అధికారులపై ఒత్తిడి పెంచారు. కానీ ఈ విషయంలో తాము కలుగచేసుకోలేమని పోలీస్ అధికారులు ఆమెకు చెప్పారు. దాంతో డీఎస్పీస్థాయి అధికారులపై సంచయిత రుసరుసలాడటం స్థానికంగా చర్చకు దారితీసింది. తన ప్రయత్నాలు వికటించడంతో చేసేది లేక ఎట్టకేలకు కోటకు మరోవైపు కూర్చొని సంచయిత ఉత్సవాన్ని తిలకించారు. వాస్తవానికి సిరిమానోత్సవాన్ని తిలకించేందుకు మహారాజ కోటపైకి రాచ కుటుంబంతో పాటు వారి స్నేహితులు, ఉన్నత స్ధాయి అధికారులు వచ్చేవారు. కోటపైకి ఎవరూ రావటానికి వీలు లేదని దేవాదాయ శాఖకు చెందిన అధికారిని ఆదేశించి కోట తలుపులు మూయించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆనందగపతి కుటుంబంపై సంచయిత వ్యవహరించిన వైఖరిని పలువురు తప్పుపడుతున్నారు. అంతేకాదు విజయనగరం జిల్లా ప్రజలు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సంచయిత తీరుకు నిరసనగా అనంద గజపతి రాజు భార్య... కూతురు ఊర్మిళ మౌనం పాటించారు. ఆనంద గజపతిరాజుకు నిజమైన వారసురాలు తానేనని ఆమె నొక్కి చెబుతున్నారు.


కొనసాగించండి.. లేదా స్వాధీనం చేస్కోండి!

ఇటీవల మాన్సాస్‌ ట్రస్ట్‌కు చెందిన మహారాజ కళాశాలను ప్రైవేటుపరం చేయాలని సంచయిత ప్రభుత్వాన్ని కోరడం పెద్ద దుమారం రేపింది. ఈ నిర్ణయం ఇప్పటికీ విజయనగరం జిల్లాను కుదిపేస్తోంది. మహారాజ కోటను, కలెక్టరేట్‌ని, ప్రజా ప్రతినిధుల ఇళ్లను ఆందోళనకారులు ముట్టిడిస్తూ నిరసన తెలుపుతున్నారు. చరిత్ర ప్రసిద్ధి చెందిన మహారాజ కళాశాలను యథాతథ స్థితిలోనే కొనసాగించాలని వారు పట్టుబడుతున్నారు. లేదంటే ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


జగన్ సర్కార్ బ్రేక్ వేస్తుందా..!?

అంతకుముందు మాన్సాస్‌ ఉద్యోగులు భిక్షాటన చేస్తూ నిరసన తెలపడం చర్చనీయాంశంగా మారింది. మాన్సాస్ కొత్త యాజమాన్యం జీతాలు చెల్లించకపోవడంతో వారి బతుకులు రోడ్డున పడ్డాయి. ఒకప్పుడు ఆర్థిక పరిపుష్టితో వెలుగువెలిగిన మాన్సాస్ సంస్థ సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితికి దిగజారింది. మాన్సాస్ ట్రస్ట్ ఉద్యోగులు జీతాలు లేక రోడ్డున పడటంతో మనస్థాపం చెందిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు బహిరంగ లేఖ విడుదల చేశారు. 879 మంది జీతాలు రాక కుటుంబాలతో ఇబ్బంది పడుతున్నారని..ట్రస్ట్‌ పేరున బ్యాంకుల్లో 124 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయని..ఆ సొమ్ముతో ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని మాన్సాస్ నిర్వహాకులను కోరారు. మొత్తంగా సంచయిత తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా జగన్‌ ప్రభుత్వం ఆమె దూకుడుకు బ్రేక్‌ వేస్తుందా? లేక మరింత రెచ్చిపోయేలా ఆమెను ప్రోత్సహించి..ఆ అపవాదును మూటగట్టుకుంటుందో చూడాలి.

Updated Date - 2020-10-31T16:55:18+05:30 IST