పార్వతీపురాన్ని జిల్లాగా ప్రకటించాలని దీక్ష

ABN , First Publish Date - 2020-07-19T12:13:30+05:30 IST

పార్వతీపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని పెదపెంకికి చెందిన బాపూజీ గ్రంథాలయ వ్యవస్థాపకులు ఈర్ల సంజీవినాయుడు

పార్వతీపురాన్ని జిల్లాగా ప్రకటించాలని దీక్ష

బలిజిపేట, జూలై 18:  పార్వతీపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని పెదపెంకికి చెందిన బాపూజీ గ్రంథాలయ వ్యవస్థాపకులు ఈర్ల సంజీవినాయుడు దీక్ష చేపట్టారు. శనివారం పెదపెంకిలో బాపూజీ గ్రంథాలయం ఆవరణలో   ఒకరోజు దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తే.. ఈ ప్రాంత ప్రజలకు అనేక ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపారు.


అరకును జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే  ఐదు గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుందని, దీనివల్ల పార్వతీపురం డివిజన్‌ ప్రజలందరికీ కష్టాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. తక్షణమే పార్వతీపురాన్ని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ  సభ్యుడు చప్ప సత్యం నాయుడు, గులిపల్లి శ్రీనివాసరావు, గుడివాడ జగన్‌, దత్తి మురళి, ఎనుబోతు భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. 


జిల్లా కోసం ఉద్యమం

బొబ్బిలితో కూడిన పార్వతీపురం జిల్లా ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఒక వేదికను ఏర్పాటు చేసి ఉద్యమిస్తామని సీపీఐ నాయకులు, సీనియర్‌ న్యాయవాది కండాపు ప్రసాదరావు, కోట అప్పన్న తెలిపారు. శనివారం వారు  మాట్లాడుతూ అరకు పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేస్తామన్న ప్రతిపాదనను తాము స్వాగతిస్తున్నామన్నారు.


పార్వతీపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తే ఏజెన్సీ ప్రాంతంతో పాటు వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఇందుకోసం డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి కృషి చేయాలని కోరారు. జిల్లా ఏర్పాటయ్యే వరకూ అఖిలపక్షాలతో ఒక వేదికను ఏర్పాటు చేసి ప్రజల తరఫున ఉద్యమిస్తామని వారు స్పష్టం చేశారు.

Updated Date - 2020-07-19T12:13:30+05:30 IST