చూడు..చూడు.. గోతులు..అక్రమాల లోతులు

ABN , First Publish Date - 2020-03-18T10:46:57+05:30 IST

గజపతినగరం మండలం గంగచోళ్ల పెంట గ్రామానికి చెందిన ఆరో తరగతి విద్యార్ధి చంపావతి నదిలో పడి ఇటీవల ప్రాణాలు కోల్పోయాడు. గొయ్యిని గమనించని ఆ విద్యార్థి స్నానానికి దిగడంతో ప్రమాదానికి

చూడు..చూడు.. గోతులు..అక్రమాల లోతులు

నిబంధనలకు నిలువునా పాతర

నదిని గుల్ల చేస్తున్న అక్రమార్కులు

నాలుగు అడుగుల లోతున తవ్వకాలు

భూగర్భజలాలకు పెనుముప్పు 

ప్రాణనష్టం పెరిగే ప్రమాదం 

ప్రశ్నించేవారికి బెదిరింపులు


 మెంటాడ, మార్చి 17:

గజపతినగరం మండలం గంగచోళ్ల పెంట గ్రామానికి చెందిన ఆరో తరగతి విద్యార్ధి చంపావతి నదిలో పడి ఇటీవల ప్రాణాలు కోల్పోయాడు. గొయ్యిని గమనించని ఆ విద్యార్థి స్నానానికి దిగడంతో ప్రమాదానికి గురయ్యాడు. ఇసుక అక్రమార్కుల ఆగడాలకు ఆ విద్యార్థి ప్రాణాన్నే కోల్పోయాడు. ఇదే పరిస్థితి మెంటాడ మండలంలోని చంపావతి నదిలో చాలాచోట్ల ఉంది. ప్రధానంగా ఆగూరు వద్ద  ఇసుక తవ్వకాలు చూసి ప్రజలు భయపడుతున్నారు. వర్షాకాలంలో ఎవరికి ఏ ఆపద వస్తుందోనని కలవరపడుతున్నారు. మెంటాడ మండలంలో చంపావతి నది పరీవాహక గ్రామమైన ఆగూరు వద్ద ఇసుక రీచ్‌ ముసుగులో భారీ దోపిడీకి తెరలేచింది. కొందరు అక్రమార్కులు బరితెగించి నిబంధనలు, మార్గదర్శకాలను నిలువెత్తు గోతుల్లో పాతరేసి రెండు చేతులా పోగేసుకుంటున్నారు.


ఇదేమని అడిగే వారిపై ఒంటికాలిపై లేస్తూ సంగతి తేలుస్తామని బాహాటంగానే బెదిరిస్తున్నారు. ఇక్కడి వ్యవహారం తెలిసినా అధికారులు మిన్నకుండిపోవడంతో ఇసుకాసురులు పేట్రేగిపోతున్నారు. మూడు నెలల కిందటే ఆగూరు వద్ద అధికారులు ఇసుక రీచ్‌ను ప్రారంభించి తవ్వకాల్లో నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కానీ అది మున్నాళ్ల ముచ్చటగా మారింది. చలానా తీసుకుని రీచ్‌ లోకి ప్రవేశించే కొందరు.. నిబంధనల నుంచి తమకు తాము మినహాయింపు ప్రకటించుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. నదిలో సుమారు నాలుగడుగుల లోతున తవ్వకాలు సాగిస్తున్నారు. ప్రతీరోజూ అడ్డు అదుపులేకుండా భూగర్భజలాలకు ముప్పు వాటిల్లేలా దందా కొనసాగిస్తున్నారు. నీటి ప్రవాహానికి కనీసం మీటరు ఎత్తున ఇసుక ఉండాలి. కానీ దాదాపు నీటికి సమాంతరంగా తవ్వుకుపోతున్నారు. ఈ విషయంపై రెవెన్యూ, పోలీస్‌ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని ఆందోళన చెందుతున్నారు. 


దీంతో ఆ ప్రదేశమంతా పెద్ద పెద్ద గోతులతో భయం గొలుపుతోంది. ఆగూరు సహా మరో నాలుగైదు గ్రామాల వారు చంపావతి నది మీదుగా రాకపోకలు సాగించే ప్రాంతంలోనే ఈ తవ్వకాలు జరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నదిపై బ్రిడ్జి నిర్మించాలన్న వినతులకు దశాబ్దాల తరబడి తిలోదకాలు ఇస్తున్నారు. ఆయా గ్రామాలవారు వర్షాకాలంలో నదీ ప్రవాహం సమయంలో చిన్న చెక్క బల్లే ఆధారంగా రాకపోకలు సాగిస్తుంటారు. దీని వల్ల ప్రాణనష్టం జరుగుతున్నా బ్రిడ్జి కాని.. కాజ్‌వే నిర్మాణానికి కాని మోక్షం కలగడం లేదు. ఇపుడు ఈ ప్రాంతంలోనే ఇసుక తవ్వకాలు జరగడం, అవికూడా నిలువెత్తు గోతులు దర్శనమిస్తుండడం పులిమీదపుట్రలా మారిందని వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నిబంధనలకు నీళ్లు వదులుతున్న అక్రమార్కులు ప్రశ్నిస్తే తాము చేసిన పనిని సమర్థించుకుంటున్నారు. ఇసుక కొరత తీవ్రంగా ఉన్న ఈ రోజుల్లో నిబంధనలంటూ మడిగట్టుకుని కూర్చుంటే పనులు జరగవని, అందుకే నదీ  గర్భంలో ఎంత లోతున ఇసుక అందుబాటులో ఉంటే అంతవరకు తవ్వుకోవడమే, దీనికి పరిష్కారమని చె ప్పుకొస్తున్నారు. 


అధికారుల దృష్టికి తీసుకువెళ్లాను

ఆగూరు గ్రామానికి వెళ్లే మార్గంలో ఇసుక రీచ్‌లో భారీగా తవ్వకాలపై పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్‌ను వివరణ కోరాగా  రీచ్‌ కోసం అనుమతి ఇచ్చామని, మైనింగ్‌ శాఖ పరిధి చూపలేదని అన్నారు. గ్రామస్థులు రాత పూర్వకంగా ఫిర్యాదు ఇవ్వలేదని చెప్పారు. దారిలో తవ్వకాలు వద్దన్నా డ్రైవర్లు పట్టించుకోవడం లేదని, ప్రజలు ఇబ్బందులు గ్రహించి సమస్య అధికారుల దృష్టిలో పెట్టానని చెప్పారు. 

Updated Date - 2020-03-18T10:46:57+05:30 IST