స్థలాలు రాకుంటే.. భూమిని ఆక్రమిస్తాం
ABN , First Publish Date - 2020-03-08T10:57:05+05:30 IST
ఇంటి స్థలాల విషయమై శనివారం కందివలస, చోడమ్మ అగ్రహారం గ్రామాల దళితులు దండెత్తారు.

కందివలస, చోడమ్మ అగ్రహారం గ్రామాల దళితులు
ఇళ్ల స్థలాల కోసం తహసీల్దార్ కార్యాలయం ముట్టడి
పూసపాటిరేగ, మార్చి 7: ఇంటి స్థలాల విషయమై శనివారం కందివలస, చోడమ్మ అగ్రహారం గ్రామాల దళితులు దండెత్తారు. సుమారు 200 మంది మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. తహసీల్దార్ నీలకంఠరావుకు వినతిపత్రాలు అందజేసి, తమకు ఆఖరి జాబితాలో ఇళ్ల స్థలాలు రాకపోవడానికి గల కారణాలపై ప్రశ్నించారు. అనంతరం కందివలస గ్రామానికి చెందిన దళితులు మాట్లాడుతూ, చాలామంది పేదలకు ఇళ్ల స్థలాలు రాలేదు. అయితే తమ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను ఇళ్ల స్థలాల నిమిత్తం తీసుకొనేటప్పుడు.. ఇళ్ల స్థలాలులేని దళితులకు స్థలాలు అందజేస్తామని అధికారులు చెప్పారు. కానీ, నేడు చాలామందికి రాలేదని వాపోయారు.
అనర్హుల పేర్లు ఉన్నాయని, దళితులకు రాకుంటే భూములను ఆక్రమిస్తామని హెచ్చరించారు. చోడమ్మ అగ్రహారం గ్రామానికి చెందిన దళితులు 41 మంది ఇళ్ల స్థలాలు దరఖాస్తులు చేసుకొంటే కేవలం 14 మందికే మంజూరయ్యాయని తెలిపారు. ఇంతలో చోడమ్మ అగ్రహారం వలంటీరు వచ్చి, పేదల ఇళ్ల స్థలాలకు సంబంధించి ఆన్‌లైన్ చేశానని, అయితే పేర్లు తహసీల్దార్‌ను ప్రశ్నించారు. దీంతో పాటు కంది వలసకు చెందిన గ్రామ వలంటీరు కూడా తహసీల్దార్‌తో వాగ్వాదానికి దిగింది. అలాగే చోడమ్మ అగ్రహారం వైసీపీ నాయకుడు నల్ల అప్పలరాజు మాట్లాడగా, దర్యాప్తు నిర్వహిస్తామని తహసీల్దార్ బదులిచ్చారు.