ఎలా చేరుతారో!

ABN , First Publish Date - 2020-03-24T08:01:29+05:30 IST

కరోనా వైరస్‌ బారిన పడకూడదన్న ఉద్దేశంతో అధికారుల సూచనతో వసతిగృహాల్లో ఉంటున్న పదో తరగతి విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో వారు ఈ నెల 31కి ముందు తిరిగి

ఎలా చేరుతారో!

హాస్టల్‌ నుంచి ఇంటి బాట పట్టిన టెన్త్‌ విద్యార్థులు

దగ్గర పడుతున్న పరీక్షలు

లాక్‌డౌన్‌తో ఎటూ తేల్చుకోలేని వార్డెన్లు

ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూపులు


(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

కరోనా వైరస్‌ బారిన పడకూడదన్న ఉద్దేశంతో అధికారుల సూచనతో వసతిగృహాల్లో ఉంటున్న పదో తరగతి విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో వారు ఈ నెల 31కి ముందు తిరిగి చేరుకోవాలి. రవాణా స్తంభించిన పరిస్థితిలో ఎలా వస్తారనే విషయమై వార్డెన్లు తలలు పట్టుకుంటున్నారు. టెన్త్‌ పరీక్షలు ఒకసారి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈసారి తప్పనిసరిగా 31 నుంచి నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టంచేసింది. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్రం ఆదివారం జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కర్ఫ్యూను దృష్టిలో పెట్టుకుని జిల్లా వ్యాప్తంగా ఉన్న వసతి గృహాలు, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరుగతుల సంక్షేమవసతిగృహాలు, ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులను ఇళ్లకు పంపించేశారు. జనతా కర్ఫ్యూ ఒక్కరోజుకే పరిమితం కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించింది. మొత్తం రవాణా వ్యవస్థను ఈనెల 31వరకు స్తంభింప జేసింది.


దీంతో ఆర్టీసీ సర్వీసులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఈ నెల 31వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ఉద్యోగులు విధులకు హాజరుకాలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 70 శాతం మంది ఉద్యోగులు స్థానికంగా ఉండటం లేదు. ఉద్యోగుల మాట అటుంచితే విద్యార్థులు తిరిగి వసతి గృహాలకు చేరుకునే పరిస్థితి కనిపించడం లేదు. టెన్త్‌ విద్యార్థులకు ఈనెల 31 నుంచి ఏప్రిల్‌ 17వరకు పరీక్షలు జరుగుతాయి.  విద్యార్థులు వసతిగృహాలకు చేరుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇంకా పరీక్షలు ప్రారంభానికి ఐదు రోజులు మాత్రమే గడువుంది. ఈలోగా విద్యార్థులను వసతిగృహాలకు చేర్చి చదివించాల్సిన అవశ్యకత ఉంది. వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేయాల్సి ఉంది. ఈ ఏడాది 30868 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు.


వీరిలో మూడు వందల మంది విద్యార్థులు సాంఘిక సంక్షేమశాఖ పరిధిలో ఉన్నారు. అలాగే ఐదు వందల మంది వరకు వెనకబడిన తరగతుల వసతి గృహాల్లో ఉంటున్నారు. గిరజన సంక్షేమ శాఖ పరిధిలోని గురుకులాల, ఆశ్రమపాఠశాలల్లో విద్యార్థులు భారీగానే ఉన్నారు. వీరిని తిరిగి వసతి గృహాలకు, ఆశ్రమ పాఠశాలలకు చేర్చాల్సి ఉంది. ఇదెలా అన్నది అందరిలోనూ నెలకొన్న సందేహం. ఒక్కో విద్యార్ధి ఒక్కో గ్రామానికి చెందిన వారై ఉండే అవకాశం ఉంది. వీరంతా ఎవరికి వారు కేంద్రాలకు చేరుకోవాలి. ఈ దిశగా వారికి సమాచారం అందించాల్సి ఉంటుంది. 


ఈ విషయమై ప్రభుత్వ నిర్ణయం కోసం అన్ని యాజమాన్యాలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నాయి. వాయిదా వేస్తాయేమోనన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.  కరోనా వైరస్‌ కారణంగా విద్యార్థుల చదువులు కొంత వరకు దెబ్బతిన్నాయనే చెప్పాలి. వసతి గృహాల్లో ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు కరోనా కారణంగా ఇళ్లకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ సరిగా చదవకుంటే ఉత్తీర్ణతపై ప్రభావం పడుతుంది. మరో ఐదు రోజులు మాత్రమే గడువున్న కారణంగా ప్రభుత్వం త్వరగా 10వ తరగతి విద్యార్థుల పరీక్షలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Updated Date - 2020-03-24T08:01:29+05:30 IST