మూలుగుతున్నాయి.. రెండేళ్లుగా పీడీ ఖాతాల్లో నిధులు

ABN , First Publish Date - 2020-12-12T05:17:33+05:30 IST

ప్రభుత్వాస్పత్రుల బలోపేతానికి అన్ని చర్యలు చేపడుతున్నట్టు ప్రభుత్వం చెప్పుకొస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో నిర్వహణ లేక రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. అత్యవసర మందుల కొనుగోలు, ఆస్పత్రుల కనీస నిర్వహణకుగాను ఏటా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులను ఖర్చు చేయలేని స్థితిలో యంత్రాంగం ఉంది.

మూలుగుతున్నాయి.. రెండేళ్లుగా పీడీ ఖాతాల్లో నిధులు
కొమరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం


కేంద్రం మంజూరు చేసినా ఖర్చుచేయలేని వైనం

ఆస్పత్రి అభివృద్ధి కమిటీలు లేకపోవడమే కారణం

(పార్వతీపురం)

ప్రభుత్వాస్పత్రుల బలోపేతానికి అన్ని చర్యలు చేపడుతున్నట్టు ప్రభుత్వం చెప్పుకొస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో నిర్వహణ లేక రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. అత్యవసర మందుల కొనుగోలు, ఆస్పత్రుల కనీస నిర్వహణకుగాను ఏటా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులను ఖర్చు చేయలేని స్థితిలో యంత్రాంగం ఉంది. దీనికి కారణం ఆస్పత్రుల అభివృద్ధి కమిటీలు లేకపోవడమే. ట్రెజరీల ద్వారా చెల్లింపులు చేయాలన్న సరికొత్త నిబంధన విధించడం, ఆస్పత్రి అభివృద్ధి కమిటీల ప్రతిపాదనలతో జరగాలన్న మెలికతో నిధులు ఖర్చు చేయలేని పరిస్థితి. దీంతో అత్యవసర సేవలు, ఇతర ఖర్చులను వైద్యులు, సిబ్బందే భరించాల్సి వస్తోంది. 


రెండేళ్లుగా..

జిల్లాలో 68 పీహెచసీలకుగాను అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కమిటీలుండేవి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రద్దయ్యాయి. కానీ నూతన కార్యవర్గాలను ఇంతవరకూ నియమించలేదు. దీంతో జాతీయ గ్రామీణ ఆరోగ్య శాఖ విడుదల చేసే రూ.1.75 లక్షలు ఖర్చు చేయలేకపోతున్నారు. గత రెండేళ్లుగా కేంద్రం విడుదల చేసిన నిధులు పీడీ ఖాతాల్లో మూలుగుతున్నాయి. కొన్ని పీహెచసీల్లో అత్యవసర మందులు అందుబాటులో ఉండవు. అటువంటి వారు జిల్లా కేంద్రం నుంచి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇటువంటి ఖర్చులు అభివృద్ధి కమిటీ ఆమోదంతో విడుదల చేసేవారు. కానీ ఇప్పుడు వైద్యులు, సిబ్బంది సొంత ఖర్చులతో మందులు తీసుకెళ్లాల్సి వస్తోంది. 


క్లిష్ట సమయంలో..

అసలే కరోనా సమయం. ఈ పరిస్థితుల్లో ప్రజారోగ్యానికి పెద్దపీట వేయాల్సిన అవసరముంది. పీహెచసీల్లో కనీస నిర్వహణ, అన్నిరకాల మందులు అందుబాటులోకి ఉన్నాయో? లేవో చూసుకోవాలి. కానీ జిల్లాలో చాలావరకూ ఆస్పత్రుల నిర్వహణ అక్కడున్న సిబ్బందికి భారంగా మారుతోంది. పారిశుధ్యం, చిన్నచిన్న అవసరాలకు కూడా నిధుల కొరత వెంటాడుతోంది. ఇటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే నిధులు సక్రమంగా ఖర్చు చేయాల్సి అవసరముంది. వీలైనంత త్వరగా ఆస్పత్రి అభివృద్ధి కమిటీలను నియమించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. కేంద్ర నిధులపై ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచవో రవికుమార్‌రెడ్డి వద్ద ప్రస్తావించగా పీహెచసీలకు అభివృద్ధి కమిటీలు లేకపోవడం వల్లే నిధులు ఖర్చు చేయలేకపోతున్నామని చెప్పారు. కమిటీల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టిసారించిందని తెలిపారు.




Updated Date - 2020-12-12T05:17:33+05:30 IST