అన్నదాత...పొలంబాట

ABN , First Publish Date - 2020-07-14T10:26:01+05:30 IST

జోరు వానలతో ఉభాలు ప్రారంభమయ్యాయి. అన్నదాతలు హ లాలు చేపట్టి పొలం దారి పట్టారు.

అన్నదాత...పొలంబాట

జిల్లాలో ఆశాజనకంగా వర్షాలు

 రైతుల్లో సాగుపై ఆశలు


(పార్వతీపురం): జోరు వానలతో ఉభాలు ప్రారంభమయ్యాయి. అన్నదాతలు హ లాలు చేపట్టి పొలం దారి పట్టారు. ఖరీఫ్‌ సీజన్‌పై ఎన్నో ఆశలతో అడుగులు వేస్తున్నారు. ఇటు చెరువులు, నదులు, జలాశయాలు కూడా జలకళతో ఉట్టిపడుతున్నాయి. పంట భూముల్లోనూ కావాల్సిన తడి చేరింది. దీంతో అన్నదాతలు సాగు పనులకు శ్రీకారం చుడుతున్నారు. నారు  ఉన్న వారు నాట్లుకు సిద్ధమవుతుండగా.. మరికొందరు వెదజల్లే పద్ధతిలో వరిసాగుకు సమాయత్తమయ్యారు. గత ఏడాది వర్షాలు సకాలంలో కురవక ఖరీఫ్‌ సీజన్‌లో భిన్న ఫలితాలు వచ్చాయి. ఉభాలు ఆలస్యమయ్యాయి. ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. జూన్‌ నుంచే వర్షాలు కురుస్తున్నాయి. ఎప్పటికప్పుడు కుండపోతగా వానలు పడుతున్నాయి. ఒడిశాలో భారీ వర్షాలతో నాగావళి నిండుగా ప్రవహిస్తోంది. గత నెలలోనే తోటపల్లి గేట్లు ఎత్తాల్సి వచ్చింది.


ఇన్‌ఫ్లో పెరగడంతో అధికారులు రెండు గేట్లు ఎత్తి నీరు కిందకు వదిలారు. సాధారణంగా సాగునీటి ప్రాజెక్టుల పరిధిలోని రైతులు నీరు విడుదల చేసిన వెంటనే వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. తోటపల్లి ప్రాజెక్టు ద్వారా సాగునీరు విడుదల చేయడంతో ఆయకట్టు పరిధిలోని రైతులు నాట్లు వేయడంలో నిమగ్నమయ్యారు. ప్రాజెక్టులు లేని సీతానగరం, బలిజిపేట, కురుపాం తదితర మండలాల్లోనూ ఉభాలు ఊపందుకున్నాయి. వర్షాలు సంతృప్తిగా కురవడంతో ఆగస్టులో ప్రారంభం కావాల్సిన నాట్లు 20 రోజులు ముందుగానే ప్రారంభించారు.


15 వేల హెక్టార్లలో ...

ఇప్పటివరకు 15 వేల హెక్టార్లలో ఉభాలు పూర్తయ్యాయి. ఈ ఏడాది సుమారు 1.30 లక్షల హెక్టార్లలో వరిసాగు చేయించాలని వ్యవసాయ శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. వీఆర్‌ఎస్‌, తోటపల్లి, జంఝావతి, ఆండ్ర, పెదంకలాం తదితర ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు భూములకు సాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేవు. అలాగే వర్షాధార భూములకు కూడా ఈ ఏడాది అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. 


రైతులకు పూర్తి సహకారం...ఆశాదేవి, జెడి వ్యవసాయ శాఖ

ఈ ఏడాది వరి సాగుకు ఆశాజనకంగా ఉంటుందని భావిస్తున్నాం. జిల్లాలో 15వేల హెక్టార్లలో ఇప్పటివరకు ఉబాలు పూర్తయ్యాయి. రైతులకు గ్రామాల్లోనే విత్తనాలను పూర్తిస్థాయిలో అందించాం. ప్రభుత్వం ద్వారా రైతులకు అన్ని విధాలా సహకారం అందిస్తున్నాం. సుమారు 1.30 లక్షల హెక్టార్లలో వరి సాగు లక్ష్యంగా తీసుకున్నాం.                           

Updated Date - 2020-07-14T10:26:01+05:30 IST