ఇంటి కల...తీర్చేలా!

ABN , First Publish Date - 2020-12-07T03:40:51+05:30 IST

ప్రభుత్వం పేదలకు ఇళ్లు నిర్మించే దిశగా అడుగులు వేస్తోంది. జిల్లాకు మొదటి విడతగా 98,286 గృహాలు మంజూరయ్యాయి. కేంద్రం అందించే నిధులతో ఇళ్ల నిర్మాణాలు జరగబోతున్నాయి గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ పథకం నిధులు రూ.30 వేలు, కేంద్రం అందించే రూ.1.50 లక్షలు కలిపి రూ. 1.80 లక్షలతో ఇళ్లు కట్టనున్నారు.

ఇంటి కల...తీర్చేలా!
పేదల ఇళ్లు నిర్మించనున్న లే అవుట్‌

జిల్లాకు మొదటి విడతగా 98,286 గృహాలు మంజూరు

పట్టాల పంపిణీ తర్వాత శంకుస్థాపన

తక్కువ వ్యయంపై లబ్ధిదారుల్లో సందేహం

(పార్వతీపురం)

ప్రభుత్వం పేదలకు ఇళ్లు నిర్మించే దిశగా అడుగులు వేస్తోంది. జిల్లాకు మొదటి విడతగా 98,286 గృహాలు మంజూరయ్యాయి. కేంద్రం అందించే నిధులతో ఇళ్ల నిర్మాణాలు జరగబోతున్నాయి గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ పథకం నిధులు రూ.30 వేలు, కేంద్రం అందించే రూ.1.50 లక్షలు కలిపి రూ. 1.80 లక్షలతో ఇళ్లు కట్టనున్నారు. పట్టణాల్లో ఉపాధి హామీ పథకం నిధులు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే తనవంతు వాటాగా రూ. 30 వేలు చెల్లించనుంది. అంతకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలకు ఇచ్చే నగదు రాయితీ ఏమీ లేదు. రూ. 5 లక్షల వరకు నిధులను ఇళ్ల నిర్మాణాలకు ఇస్తామని ఎన్నికల్లో ప్రకటించినప్పటికీ ఆ స్థాయిలో నిర్మించే యోచన కనిపించడం లేదు. దీనిపై లబ్ధిదారుల్లో నిరాశ నెలకొంది. రూ. 1.80 లక్షలతో ఇళ్ల నిర్మాణాలు ఎలా చేపడతారని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అతి సాధారణ ఇంటి నిర్మాణానికి కూడా కనీసం రూ. 5 లక్షలు ఖర్చవుతుంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో రూ. 2 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2.5 లక్షలు అందించేవారు. ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా కోత వేయడంతో...ఇళ్ల నిర్మాణమెలాగో తెలియక లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పట్టాలు మంజూరు చేసిన వారికి కూడా ఇళ్లు నిర్మించి ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇళ్ల నిర్మాణానికి రూ. 1.80 లక్షల వంతున మంజూరు చేస్తుంది. గృహ నిర్మాణశాఖ ద్వారా నిర్మాణం జరుగనుంది. ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియను డిసెంబరు 25న చేపడతామని ముహూర్తం ఖరారు చేసింది. దీంతో పాటు ఇళ్ల నిర్మాణాల ప్రక్రియను కూడా వెంటనే చేపట్టేందుకు అవసరమైన చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా జిల్లాలో మొదట విడతగా 98,286 ఇళ్లను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2018-19 ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసిన ఇళ్లకు కూడా మోక్షం లభించింది. ఇళ్లు మంజూరై నిర్మాణాలు ప్రారంభం కాని లబ్ధిదారులకు కొత్తగా మంజూరు పత్రాలను ఈ ప్రభుత్వం అందించనుంది. ఇదిలా ఉండగా కొత్త ఇళ్లకు సంబంధించి మెటీరియల్‌ను ప్రభుత్వమే సరఫరా చేసి దానికి సంబంధించిన నగదును లబ్ధిదారులకు అందించే నిధుల నుంచి రికవరీ చేయనుంది. ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తారు. సచివాలయ, గృహ నిర్మాణ శాఖ ఇంజినీరింగ్‌ అధికారుల పర్యవేక్షణలో నిర్మాణాలు పూర్తి చేస్తారు. 

రూ. 1.80 లక్షలు సరిపోతాయి

 ఇంటి నిర్మాణానికి రూ. 1.80 లక్షలు సరిపోతాయి. మెటీరియల్‌ తక్కువ ధరకు సరఫరా అవుతుంది. సిమెంటు, ఐరన్‌, తదితర మెటీరియల్‌ను తక్కువ ధరకు లబ్ధిదారులకు అందిస్తాం. సాంకేతిక సిబ్బంది సలహాలను అందిస్తారు. వారి ఆధ్వర్యంలోనే నిర్మాణం సాగుతుంది. 

- రమణమూర్తి, గృహ నిర్మాణశాఖ పీడీ


Read more