రవాణాపై కానరాని ఒప్పందం.. ట్రాన్స్‌పోర్టు సంస్థతో సాగుతున్న సంప్రదింపులు

ABN , First Publish Date - 2020-12-16T04:16:31+05:30 IST

ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైనా చురుగ్గా కదిలే పరిస్థితి లేదు. రైతుల నుంచి మిల్లర్లకు ధాన్యం తరలించడానికి నేటికీ రవాణా సంస్థతో ఒప్పందం జరగలేదు. ఇన్నాళ్లూ ఎదురుచూసి... విసిగిపోయిన కొందరు రైతులు ప్రైవేటు వ్యక్తులకు విక్రయిస్తున్నారు.

రవాణాపై కానరాని ఒప్పందం.. ట్రాన్స్‌పోర్టు సంస్థతో సాగుతున్న సంప్రదింపులు
ధాన్యాన్ని లారీలోకి లోడ్‌ చేసిన దృశ్యం

ధాన్యం...దైన్యం

ధాన్యం కొనుగోలులో జాప్యం

ఎదురుచూస్తున్న రైతులు


ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైనా చురుగ్గా కదిలే పరిస్థితి లేదు. రైతుల నుంచి మిల్లర్లకు ధాన్యం తరలించడానికి నేటికీ రవాణా సంస్థతో ఒప్పందం జరగలేదు. ఇన్నాళ్లూ ఎదురుచూసి... విసిగిపోయిన కొందరు రైతులు ప్రైవేటు వ్యక్తులకు విక్రయిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ లక్ష్యం పక్కదారి పడుతోంది. అన్నదాత మద్దతు ధర కోల్పోతున్నాడు. ఈ నేపథ్యంలో రవాణాపై త్వరగా తేల్చాలని రైతన్నలు కోరుతున్నారు.

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

రైతులు ప్రభుత్వానికి విక్రయించే ధాన్యం తరలింపుపై ఈ ఏడాది సందిగ్ధం నెలకొంది. దీనికి ప్రధాన కారణం రవాణా సంస్థతో ఇంతవరకూ ఒప్పందం కుదరకపోవడమే. దీంతో రైతులు కళ్లాల్లోనే ప్రయివేటు వ్యక్తులకు విక్రయించుకునే పరిస్థితి తలెత్తుతోంది. ప్రభుత్వ జీవో ప్రకారం కాంట్రాక్టర్‌, మిల్లర్‌, రైతు ఇలా ఎవరైనా వాహనాలు ఏర్పాటు చేయవచ్చు. రవాణా బాధ్యత తీసుకున్న వ్యక్తికి పౌర సరఫరాల శాఖ డబ్బులు చెల్లిస్తుంది. ప్రభుత్వం గత ఏడాది ఓ ప్రైవేటు సంస్థతో రవాణా ఒప్పందం చేసుకుంది. వారికే పౌర సరఫరాల శాఖ నగదు అందించింది. అదే కాంట్రాక్టర్‌ ఈ సీజన్‌లో కూడా ధాన్యాన్ని రవాణా చేయాల్సి ఉంది. ఇందులో మరో కోణం ఉంది. కాంట్రాక్టు పొందిన జీవీకే ట్రాన్స్‌పోర్టు గతేడాది కూడా పెద్దగా రవాణా చేయలేదు. అధికారిక ఒప్పందం తప్పితే రవాణా చేసింది మాత్రం మిల్లర్లే.  కాంట్రాక్టర్‌కే ప్రభుత్వం నిధులు చెల్లిస్తుంది. ఆ మొత్తాన్ని మిల్లర్లు, కాంట్రాక్టర్‌ ఒప్పందానికి అనుగుణంగా పంపిణీ చేసుకునే విధంగా గతేడాది రవాణా చార్జీల బాగోతం నడిచింది. ఈ ఏడాది ఏ ఒప్పందమూ లేదు. రవాణా అంశం ఇంకా చర్చల్లోనే సాగుతోంది. గత ఏడాది టన్ను ధాన్యాన్ని మిల్లుకు చేరవేసేందుకు 8 కిలోమీటర్లకు రూ.227 చెల్లించేలా ప్రైవేటు వ్యక్తి టెండర్‌ పొందాడు. ఈ విధంగా రూ.4లక్షల 20వేల టన్నులకు పైబడి ధాన్యాన్ని కొనుగోలు చేశారు. అంటే రవాణా ఖర్చుల కోసం ప్రభుత్వం రూ.9.5 కోట్లు చెల్లించింది. ఈ ఏడాది 5లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. అంటే ఈసారి రవాణా ఖర్చే రూ.11.35 కోట్లు కేటాయించాల్సి ఉంది. డీజిల్‌, లారీ అద్దె పోగా.. కోట్లలో మిగులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. రవాణా పేరుతో భారీగా చేతులు మారుతున్న పరిస్థితి ఉంది. 

మద్దతు ధర కోల్పోతున్న రైతు

 సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి రైతు కష్టానికి ప్రతిఫలంగా మద్దతు ధర అందించాలి. సవాలక్ష అడ్డంకులు ఏర్పడుతున్న కారణంగా కొనుగోళ్లు సాగడం లేదు. ఈ ఏడాది ఎటువంటి అడ్డంకులు ఎదురైనా సకాలంలో ధాన్యం కొనుగోలు చేస్తామని జిల్లా అధికారులు నమ్మబలికారు. దీనికి రెండు నెలల ముందునుంచే జేసీ కసరత్తు ప్రారంభించారు. కానీ కీలకమైన రవాణా ఒప్పందం కొలిక్కి తేలేకపోయారు. దీంతో తక్కువ ధరకు రైతులు ఇతర జిల్లా మిల్లులకు ధాన్యం అప్పగిస్తున్నారు. ఇదిలా ఉండగా ధాన్యం రవాణా డీల్‌ కోసం జిల్లాకు చెందిన ఒక కీలక నేత దొడ్డిదారిన ప్రయత్నాలు  చేస్తున్నట్లు సమాచారం. కొంతమంది మిల్లర్లు దీనికి అంగీకరించడం లేదు. ఈ కారణంగానే  జాప్యం జరుగుతోంది. మొత్తానికి రైతుల నుంచి సకాలంలో ధాన్యాన్ని సేకరించే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. 

అదే కాంట్రాక్టర్‌ ద్వారా రవాణా

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం అవుతున్నాయి. ఇంతవరకు 326 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. గత ఏడాది కాంట్రాక్టు పొందిన ఏజెన్సీ ద్వారా రవాణా చేసుకోవచ్చు. అలా కాకుండా మిల్లర్లు, రైతులు సొంతంగా ఏర్పాట్లు చేసుకుంటే వారికే రవాణా చార్జీలు అందిస్తాం. రవాణా విషయంలో ఇబ్బందులు లేవు.  

- ఎంఎం వరకుమార్‌, జిల్లా మేనేజర్‌, పౌర సరఫరాల శాఖ. 


Updated Date - 2020-12-16T04:16:31+05:30 IST