ఎన్నాళ్లకెన్నేళ్లకు!

ABN , First Publish Date - 2020-05-17T10:39:17+05:30 IST

డీఎస్‌సీ-2008 నియామక పరీక్షలో ఎంపికై చివరి క్షణంలో ప్రభుత్వం అమలు చేసిన 70: 30 విధాన ప్రక్రియలో

ఎన్నాళ్లకెన్నేళ్లకు!

డీఎస్‌సీ 2008 అభ్యర్థులకుశుభవార్త

కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా నియామకం 

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం   

జిల్లాలో 215 మందికి అవకాశం       

           

నెల్లిమర్ల, మే 16: డీఎస్‌సీ-2008 నియామక పరీక్షలో ఎంపికై చివరి క్షణంలో ప్రభుత్వం అమలు చేసిన 70: 30 విధాన ప్రక్రియలో ఉద్యోగాలు పొందకుండా నష్టపోయిన అభ్యర్థులకు శుభవార్త. వీరికి కాంట్రాక్టు ఉపాఽధ్యాయులు (ఎస్‌జీటీ)గా నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ ఉన్నతాఽధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో అర్హులైన 215 మంది అభ్యర్థుల పేర్లు, ఆ డీఎస్‌సీలో సాధించిన మార్కులు, ర్యాంకు వివరాలతో అధికారులు జాబితా విడుదల చేశారు. 2008 డీఎస్‌సీ నోటిఫికేషన్‌ ద్వారా నిర్వహించిన పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కులు, రోష్టర్‌లతో వంద శాతం పోస్టులకు అప్పట్లో తొలుత ఎంపికైన వారి జాబితాను విడుదల చేశారు.


వారి ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేశారు. నియామకాలు చేపడుతున్న సమయంలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) పోస్టులకు ఉపాధ్యాయ శిక్షణలో బీఈడీ పూర్తి చేసిన వారు అనర్హులని, సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయ శిక్షణ (టీటీసీ /డైట్‌ ) పూర్తి చేసిన వారే అర్హులంటూ డైట్‌ శిక్షణ పూర్తిచేసిన వారు ఉద్యమించడంతో పాటు కోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం అప్పటికప్పుడు 70 ః 30 నిష్పత్తిలో ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని ప్రకటించింది. మొత్తం వంద శాతం మెరిట్‌ జాబితాలో ఉన్న వారిలో తొలి 70 శాతం పోస్టుల వరకు బీఈడీ, డైట్‌లను పూర్తి చేసిన అభ్యర్థులను ఉమ్మడిగా నియమించారు. మిగిలిన 30 శాతం పోస్టులను మాత్రం కేవలం డైట్‌/టీటీసీ అభ్యర్థులతోనే భర్తీ చేశారు. ఈ 30 శాతం పోస్టుల్లో ఎంపికైన బీఈడీఅభ్యర్థులు చివరి క్షణంలో ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయారు.


అనంతరం వారంతా కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు ఇప్పటికీ కోర్టులో నడుస్తోంది. ఎట్టకేలకు ప్రభుత్వం వీరి డిమాండ్‌ను పరిశీలనలోకి తీసుకుని రాష్ట్రంలో ఈ తరహాలో నష్టపోయిన వారు 4,657 మంది అభ్యర్థులు ఉన్నట్లు గుర్తించింది. వీరందరికీ రెగ్యులర్‌ ఉపాధ్యాయ నియామకాలు కాకుండా కేవలం కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా నియమించాలని నిర్ణయించింది. సెకండరీ గ్రేడ్‌ బేసిక్‌ పే 21,230 రూపాయలను నెల వేతనంగా చెల్లించాలని నిర్ణయించింది. ఇదే వేతనంపై ఉద్యోగ విరమణ వరకు పనిచేసేందుకు అంగీకార పత్రాలను తీసుకోవాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు ఆ ఉత్తర్వుల ద్వారా స్పష్టం చేసింది.


ప్రస్తుత కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా ఏ అభ్యర్థీజిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయానికి రానవసరం లేకుండానే వారి అంగీకార పత్రాలను ఈ నెల 18వ తేదీలోగా టీఆర్‌సీసీఎస్‌ఈ ఏపీస్కూల్‌ఎడ్యు.ఇన్‌  వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. మొత్తం మీద డీఎస్‌సీ 2008 బాధిత అభ్యర్థులకు సుమారు 12 ఏళ్ల తర్వాత కొంత ఊరట లభించింది. ప్రస్తుతం అర్హులైన అభ్యర్థుల్లో ఎంత శాతం కాంట్రాక్టు ఉద్యోగంలో చేరేందుకు ముందుకు వస్తారో మరో మూడు రోజుల్లో తెలియనున్నది. బాధిత అభ్యర్థుల్లో కొందరు 2008 తర్వాత జరిగిన 2012, 2014, 2018 డీఎస్‌సీలలో ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. మరికొందరు ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరారు. ప్రస్తుతం ఎంతమంది కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా చేరుతారో చూడాలి.

Updated Date - 2020-05-17T10:39:17+05:30 IST