పరామర్శకు వెళుతూ...

ABN , First Publish Date - 2020-11-26T04:35:57+05:30 IST

‘ఏ పని తలపెట్టినా అమ్మ చెవిన వేయనిదే ఆ కుమారుడు అడుగు కూడా ముందుకు వేసేవాడు కాదు. తల్లి కూడా కుమారునికి చెప్పనిదే ఏ నిర్ణయమూ తీసుకొనేది కాదు. బంధువులకు కష్టం వచ్చినా.. తల్లీకొడుకులు కలిసే వెళ్లేవారు. ఈ క్రమంలోనే బుధవారం బంధువుల ఇంటికి పరామర్శ కోసం శ్రీకాకుళం జిల్లాకు బయలుదేరారు. తల్లీతనయుల అనుబంధం చూసి విధికే కన్నుకుట్టిందేమో.. ఒకేసారి ఇద్దరినీ కబళించింది.

పరామర్శకు వెళుతూ...
తల్లీకొడుకు పట్నాన కృష్ణమ్మ(ఫైల్‌), రామకృష్ణ(ఫైల్‌)

రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకుల మృతి

కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు

బాధితులది విశాఖ జిల్లా

భోగాపురం, నవంబరు 25: ‘ఏ పని తలపెట్టినా అమ్మ చెవిన వేయనిదే ఆ కుమారుడు అడుగు కూడా ముందుకు వేసేవాడు కాదు. తల్లి కూడా కుమారునికి చెప్పనిదే ఏ నిర్ణయమూ తీసుకొనేది కాదు. బంధువులకు కష్టం వచ్చినా.. తల్లీకొడుకులు కలిసే వెళ్లేవారు. ఈ క్రమంలోనే బుధవారం బంధువుల ఇంటికి పరామర్శ కోసం శ్రీకాకుళం జిల్లాకు బయలుదేరారు. తల్లీతనయుల అనుబంధం చూసి విధికే కన్నుకుట్టిందేమో.. ఒకేసారి ఇద్దరినీ కబళించింది. జాతీయ రహదారిపై వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం భోగాపురం వచ్చేసరికి అదుపుతప్పి వంతెనపై ఉన్న రక్షణగోడను ఢీకొంది. తలలకు బలమైన గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే ఇద్దరూ ప్రాణాలు విడిచారు. ఇదీ విశాఖ జిల్లా గాజువాకకు చెందిన తల్లీకొడుకులు పట్నాన కృష్ణమ్మ(50), పట్నాన రామకృష్ణ(28)ల విషాదాంతం. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశాఖ జిల్లా గాజువాక సమీపంలోని ఆర్‌హెచ్‌ కాలనీకి చెందిన తల్లీ కుమారుడు పట్నాన కృష్ణమ్మ, పట్నాన రామకృష్ణ కలసి బుధవారం ఉదయం ద్విచక్రవాహనంపై శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం బొడ్లపాడు గ్రామానికి బయలుదేరారు. బంధువుల ఇంటికి పరామర్శ కోసం వెళ్తున్నారు. ఎల్‌అండ్‌టీ కంపెనీలో పనిచేస్తున్న రామకృష్ణ రాత్రి విధులు ముగించుకుని బుధవారం వేకువజామున 3.30 గంటలకు ఇంటికొచ్చాడు. తన వాహనం మరమ్మతులకు గురికావడంతో స్నేహితుని ద్విచక్ర వాహనాన్ని అడిగి తీసుకొచ్చాడు. అనంతరం గాజువాక నుంచి తల్లీకొడుకు బయలుదేరారు. భోగాపురంలోని ఎత్తుబ్రిడ్జి పైకి వచ్చేసరికి ద్విచక్ర వాహనం అదుపుతప్పి వంతెన పక్కన నిర్మించిన రక్షణ గోడను బలంగా ఢీకొంది. ఇద్దరూ రోడ్డుపై పడిపోవడంతో తలలపై బలమైన గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ యు.మహేష్‌ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. వారి వద్ద ఉన్న ఆధారాల ప్రకారం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హుటాహుటిన కుటుంబ సభ్యులు చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు. అన్నయ్య రామకృష్ణకు పెళ్లి సంబంధాలు చూస్తున్నామని.. సంబంధం కుదిరితే వివాహం చేయాలనుకుంటున్నామని.. ఇంతలో ఘోరం జరిగిపోయిందని అక్కచెల్లెళ్లు లావణ్య, రమ్య తీవ్రంగా రోదించారు. చేతికి అందివచ్చిన కొడుకు... కడవరకు తోడు ఉంటుందనుకున్న భార్య మృతిచెందడంతో బాలరాజు గుండెలవిసేలా విలపించాడు. వారి ఆవేదనను చూసిన స్థానికులు కంటతడి పెట్టకుండా ఉండలేకపోయారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ యు.మహేష్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. పట్నాన బాలరాజు వెల్డర్‌. కుమారుడు రామకృష్ణ ఎల్‌అండ్‌టీ కంపెనీలో పని చేస్తున్నాడు. తల్లి గృహిణి. వీరికి లావణ్య, రమ్య అనే ఇద్దరు కవలపిల్లలు  ఉన్నారు. వారిని శ్రీకాకుళం జిల్లా ఆమదలవలసకు చెందిన ఇద్దరు కవలలకు ఇచ్చి వివాహం చేశారు. తల్లీకొడుకు బుధవారం ఉదయం ముందుగా ఆమదాలవలసలో ఉన్న కుమార్తెల ఇంటికి వెళ్లి అక్కడి నుంచి బొడ్లపాడు వెళ్దామని నిర్ణయించుకొని ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. అక్కడికి చేరకుముందే మృత్యువు కబళించింది. 


Read more