శోధనలో మేటి!
ABN , First Publish Date - 2020-09-14T09:24:52+05:30 IST
గాజులరేగ వ్యవసాయ పరిశోధనా కేంద్రం జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు పొందింది.
చిరు ధాన్యాల పరిశోధనలో గాజులరేగ వ్యవసాయ పరిశోధన కేంద్రానికి ఖ్యాతి
ఇక్కడి చోడి వంగడాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు
త్వరలో కీలక విభాగాలకు శాస్త్రవేత్తల నియామకం
(విజయనగరం రూరల్): గాజులరేగ వ్యవసాయ పరిశోధనా కేంద్రం జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు పొందింది. ఇక్కడి చిరు ధాన్యాల వంగడాలు అత్యుత్తమమైనవంటూ కేంద్ర ప్రశంసించింది. మేలు రకమైన పోషక విలువలున్న వీఆర్ (1101) ఇంద్రావతి రాగులు (చోడి) విత్తనాలను ఈ పరిశోధన కేంద్రమే రూపొందించింది. వీటినే ఇప్పుడు దేశం మెచ్చింది. దేశంలోని 33 వ్యవసాయ పరిశోధనా కేంద్రాల ఆధ్వర్యంలో 2017-20 మధ్య జరిగిన పరిశోధనల్లో మేలు రకం చోడి విత్తనాలను అందుబాటులోకి తేవడం ద్వారా ఈ గుర్తింపు సాధించింది. ఈ ఏడాది మే 28న దేశ రాజధాని ఢిల్లీలో చిరుధాన్యాల జాతీయ సదస్సు జరిగింది. జూమ్ యాప్ ద్వారా ఐకార్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ తిలోచన మహాపాత్రో వీఆర్ (1101) చోడి వంగడాన్ని విడుదల చేశారు. ఇనుము, జింకు వంటి పోషక విలువలు ఈ వంగడంలో అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ పరిశోధన కేంద్రం అందుబాటులోకి తెచ్చిన వీఆర్ (988) సువర్ణముఖి సైతం రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందింది.
పరిశోధనలు ముమ్మరం
మేలు రకాలైన చిరుధాన్యాల వంగడాల పరిశోధన, సాగులో గాజులరేగ వ్యవసాయ పరిశోధనా కేంద్రం మేటిగా నిలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో చిరు ధాన్యాలకు విపరీతమైన గిరాకీ ఉంది. మధుమేహం, రక్తపోటు వంటి రుగ్మతలకు చిరుధాన్యాలతో కూడిన ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రాగులు, కొర్రలు, అండు కొర్రలు, అరికలు, ఊదలు వంటి వాటిని తీసుకోవడం ద్వారా శారీరక రుగ్మతలకు చెక్ చెప్పొచ్చు. దీంతో ప్రభుత్వాలు కూడా వీటిని ప్రాధాన్యతగా గుర్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరిశోధనా కేంద్రాలు నూతన వంగడాల రూపకల్పనలో నిమగ్నమయ్యాయి.
అందులో భాగంగానే రాగోలు వ్యవసాయ పరిశోధన కేంద్రం నూతన వంగడాన్ని అందుబాటులోకి తెచ్చింది. రాగుల్లో నూతన వంగడాలు అంటే విజయనగరం పరిశోధనా కేంద్రం వైపు అందరూ చూసేలా పరిశోధనలు ముమ్మరం చేశారు. జాతీయస్థాయి గుర్తింపుతో ఈ కేంద్రం విస్తరణకు మరింత అవకాశం కలిగింది. ఇటీవల సస్య విభాగ శాస్త్రవేత్తతో పాటు పరిశోధన శాస్త్రవేత్త పోస్టులు సైతం మంజూరయ్యాయి. వచ్చే నెల ఈ రెండు విభాగాల్లో శాస్త్రవేత్తలు నియామకం కానున్నారు. రూ.50 లక్షలతో శీతల విత్తన గిడ్డంగిని కూడా నిర్మించనున్నారు. ఇటీవల నిధులు మంజూరుకాగా త్వరలో పనులు ప్రారంభించనున్నారు.
పరిశోధనలు విస్తృతం..టీఎస్‌ఎస్‌కే పాత్రో, శాస్త్రవేత్త, గాజులరేగ వ్యవసాయ పరిశోధనా కేంద్రం
పరిశోధనలు మరింత విస్తృతం చేస్తాం. జాతీయ స్థాయిలో వీఆర్ (1101) ఇంద్రావతి రకం వంగడానికి గుర్తింపు లభించడం హర్షించదగ్గ పరిణామం. రాగి, కొర్ర, సామ, ఆరిక, వరిగ, అండుకొర్ర, ఉద వంటి ఏడు రకాల చిరు ధాన్యాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇందులో రాగులకు సంబంధించి పరిశోధనలో ముందంజలో ఉన్నాం. ఇప్పుడు రాగుల్లో నూతన వంగడాలంటే దేశం మనవైపు చూసేలా ఉండడం ఎంతో ఆనందాన్నిస్తోంది.