జీసీసీ కొత్త పంథా

ABN , First Publish Date - 2020-12-08T05:08:20+05:30 IST

వ్యాపార విస్తరణకు గిరిజన సహకార సంస్థ (జీసీసీ) కొత్త పంథాను అనుసరించనుంది. ప్రజల్లో అటవీ ఉత్పత్తుల వినియోగం పెరిగేలా నూతన ప్రణాళిక రూపొందించింది. కొత్త ఉత్పత్తులను తీసుకొచ్చి.. స్టాళ్లను పెంచుతూ ప్రైవేటు వ్యాపారులను భాగస్వాములను చేస్తూ ముందడుగు వేయాలని నిర్ణయించింది.

జీసీసీ కొత్త పంథా
జీసీసీ ఉత్పత్తులను పరిశీలిస్తున్న ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌

అటవీ ఉత్పత్తుల విక్రయాలు పెంచుకునేందుకు ప్రణాళిక 

 ఐటీడీఏ సిబ్బందితోనే తొలి అడుగు

తేనె, సబ్బులు తదితర సామగ్రి తయారీని పెంచుకునేందుకు కసరత్తు

(పార్వతీపురం)

 వ్యాపార విస్తరణకు గిరిజన సహకార సంస్థ (జీసీసీ) కొత్త పంథాను అనుసరించనుంది. ప్రజల్లో అటవీ ఉత్పత్తుల వినియోగం పెరిగేలా నూతన ప్రణాళిక రూపొందించింది. కొత్త ఉత్పత్తులను తీసుకొచ్చి.. స్టాళ్లను పెంచుతూ ప్రైవేటు వ్యాపారులను భాగస్వాములను చేస్తూ ముందడుగు వేయాలని నిర్ణయించింది. ఇందుకు పీవో కూర్మనాథ్‌ కూడా సహకరిస్తున్నారు. ఐటీడీఏ సిబ్బంది అంతా జీసీసీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని సూచించారు.  పార్వతీపురంలో జీసీసీ ఏర్పాటు చేసిన స్టాల్‌ ద్వారా నిత్యం అటవీ ఉత్పత్తుల విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే మాదిరి ఇతర చోట్ల కూడా జీసీసీ స్టాళ్లు ఉన్నాయి. ఇకపై మరిన్ని వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. జీసీసీ ఉద్యోగులను వ్యాపారాభివృద్ధిలో భాగస్వామ్యం చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇదిలా ఉండగా జీసీసీ వ్యాపారాభివృద్ధికి తీసుకొనే చర్యల్లో మొదట అడుగు ఐటీడీఏ కార్యాలయం నుంచే ప్రారంభమైంది. పీవో ఆర్‌.కూర్మనాథ్‌ దీనిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఐటీడీఏలో పనిచేసే ప్రతి ఉద్యోగి జీసీసీ విక్రయిస్తున్న సబ్బులు, తేనె, షాంపులు, అగర్‌బత్తులు తదితర వాటిని కొనుగోలు చేయాలని మౌఖికంగా సూచించారు. ఇప్పటికే ఐటీడీఏలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు తమకు అవసరమైన వస్తువులను జీసీసీ ద్వారానే కొనుగోలు చేస్తున్నారు. 

విక్రయిస్తున్న వస్తువులివే..

అటవీ ఉత్పత్తుల ద్వారా జీసీసీ అనేక వస్తువులను తయారు చేస్తోంది. కుంకుడుకాయల ద్వారా షాంపులు తయారు చేసి విక్రయిస్తున్నారు. పసుపు కొమ్ములతో శత శాతం నాణ్యమైన పసుపును విక్రయిస్తున్నారు. అడవిలో లభ్యమయ్యే తేనెతో పాటు సబ్బులు కూడా ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. ప్రస్తుతం పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు తదితర పట్టణాలకే పరిమితమైన జీసీసీ స్టాళ్లు.. విజయనగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం ప్రణాళికలను రూపొందిస్తోంది. 

సహకారం అందిస్తున్నాం

జీసీసీ ద్వారా విక్రయిస్తున్న తేనె, పసుపు, షాంపులు, సబ్బులకు మార్కెట్‌లో మంచి ఆదరణ ఉందని తమ దృష్టికి వచ్చింది. తమ వంతు సహకారాన్ని ఐటీడీఏ ద్వారా అందిస్తున్నాం. నేను కూడా జీసీసీ ద్వారా విక్రయిస్తున్న సబ్బులు, షాంపులు, తేనె తదితర వాటిని కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నాను.

                                                 - ఆర్‌.కూర్మనాథ్‌, ఐటీడీఏ పీవో

ప్రజల నుంచి ఆదరణ

జీసీసీ ఉత్పత్తులకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. పీవో కూర్మనాథ్‌ వ్యాపారాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధంగా గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు దోహదపడడం ఆనందంగా ఉంది. 

రామ్మూర్తి, జీసీసీ డివిజనల్‌ మేనేజర్‌


Updated Date - 2020-12-08T05:08:20+05:30 IST