కారులో గంజాయి

ABN , First Publish Date - 2020-12-11T04:49:32+05:30 IST

విశాఖ నుంచి బీహార్‌కు గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని రవాణా చేయాలనుకున్న యువకుల పథకాన్ని పోలీసులు ఛేదించారు. ముందస్తు సమాచారంతో పాటు నెంబర్‌ ప్లేటు లేని కారును గుర్తించి సోదా చేయగా అందులో గంజాయి పట్టుబడింది.

కారులో గంజాయి
గంజాయిని పరిశీలిస్తున్న ఎస్‌ఐ మహేష్‌

గుట్టు రట్టు చేసిన పోలీసులు

రూ.15లక్షల విలువైన సరుకు స్వాధీనం

భోగాపురం, డిసెంబరు10: విశాఖ నుంచి బీహార్‌కు గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని రవాణా చేయాలనుకున్న యువకుల పథకాన్ని పోలీసులు ఛేదించారు. ముందస్తు సమాచారంతో పాటు నెంబర్‌  ప్లేటు లేని కారును గుర్తించి సోదా చేయగా అందులో గంజాయి పట్టుబడింది. సుమారు 15 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. భోగాపురం ఎస్‌ఐ యు.మహేష్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.  

గంజాయి స్మగ్లింగ్‌ జరుగుతున్నట్లు పోలీసులకు గురువారం ఉదయం సమాచారం అందింది. ఎస్‌ఐ యు.మహేష్‌ వెంటనే అప్రమత్తమై సిబ్బందితో కలిసి నాతవలస టోల్‌గేట్‌కు చేరుకున్నారు. అక్కడ విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న వాహనాల తనిఖీ చేపట్టారు. పోలీసులు తనిఖీలు చేస్తున్నట్లు కొద్దిదూరంలో గుర్తించిన గంజాయి స్మగ్లర్లు అదే రహదారిలో వెనుతిరిగారు. పోలిపల్లి పెట్రోల్‌ బంకు సమీపంలో కొద్దిసేపు ఆగారు. ఇది గమనించిన పోలీసులు ఆగిఉన్న కార్లను పరిశీలించారు. ఓ కారుకు నంబరు ప్లేటు లేకపోవడంతో అనుమానం కలిగి తనిఖీ చేయగా రెండుకార్లలో సుమారు రెండు కేజీల బరువున్న 200 గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని నలుగురు యువకులను అదుపులోకి తీసుకొన్నారు. ఈ గంజాయి బయట మార్కెట్లో సుమారు రూ.15లక్షల విలువ ఉంటుందని అంచనా వేశారు. స్మగ్లింగ్‌కు పాల్పడిన యువకులు పీజీ చదువుతున్నట్లు భావిస్తున్నారు. వారంతా బీహార్‌ రాషా్ట్రనికి చెందినవారిగా గుర్తించారు. గంజాయి రవాణా వెనుక సూత్రదారులు తెలియాల్సి ఉంది. 


Updated Date - 2020-12-11T04:49:32+05:30 IST