సాగుభూమి మారి‘పోతోంది’
ABN , First Publish Date - 2020-12-02T04:35:34+05:30 IST
జిల్లాలో అనధికార భూ మార్పిడి విచ్చలవిడిగా జరుగుతోంది. రైతులను మభ్యపెట్టి... తక్కువ ధరకు భూములను స్వాధీనం చేసుకుని లే అవుట్‌లు వేస్తున్నారు. ఇందుకోసం అధికారికంగా చేయాల్సిన ప్రక్రియను విస్మరిస్తున్నారు. తద్వారా ఏటా రూ.కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది.

జోరుగా అనధికార భూ మార్పిడి
అధికారికంగా ఆరేళ్లలో 5,885 ఎకరాల మార్పు
ప్రభుత్వానికి రూ.42 కోట్ల ఆదాయం
అనధికారికంగా 20వేల ఎకరాలకు పైగా చేతులు మారిన వైనం
జిల్లాలో అనధికార భూ మార్పిడి విచ్చలవిడిగా జరుగుతోంది. రైతులను మభ్యపెట్టి... తక్కువ ధరకు భూములను స్వాధీనం చేసుకుని లే అవుట్‌లు వేస్తున్నారు. ఇందుకోసం అధికారికంగా చేయాల్సిన ప్రక్రియను విస్మరిస్తున్నారు. తద్వారా ఏటా రూ.కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ఆరేళ్లలో అధికారికంగా జిల్లాలో 5,885 ఎకరాలు వ్యవసాయేతర భూమిగా మారాయి. అనధికారికంగా 20వేల ఎకరాలకు పైగా ఉంటుందని అంచనా. అనుమతులు లేకుండా మార్పు చేస్తున్న భూమిపై అధికారులు దృష్టి పెట్టడం లేదు. కొందరు అధికారులకు తెలిసినా వెనుకనున్న నేతలను చూసి కిమ్మనడం లేదు.
కలెక్టరేట్, డిసెంబరు 1:
జిల్లాలో సాగు భూమి.. వ్యవసాయేతర భూమిగా మారిపోతోంది. భూ లావాదేవీలు ఏటా పెరుగుతున్నాయి. ఆరేళ్లలో అధికారికంగా 5,885 ఎకరాలు మారిపోయాయి. తద్వారా ప్రభుత్వానికి రూ.42 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రభుత్వానికి ఫీజు చెల్లించకుండా అడ్డదారిలో చేతులు మారిన భూమి అనేక రెట్లు ఉంటుందని అంచనా. నేతల అండతో ఇందుకు తెగబడుతున్నారు. కొందరు అధికారులకు తెలిసినా వారి వెనుకునున్న నేతలను చూసి పట్టించుకోవడం మానేస్తున్నారు. దాదాపు అన్ని మండలాల్లో భూ మార్పిడి ఇదే తీరుగా జరుగుతోంది. మున్సిపాలిటీలు, విజయనగరం కార్పొరేషన్ పరిసరాల్లో అంచనాకు దొరకని విధంగా భూమి చేతులు మారిపోతోంది. కీలక నేతల అండతో సంబంధిత వ్యక్తులు ప్రభుత్వ, పేదల భూములపై కన్నేస్తున్నారు. విజయనగరంలో చెరువులను కూడా కబ్జా చేసేస్తున్నారు. జిల్లా అంతటా రియల్ వ్యాపారం ఎక్కువగా జరుగుతోంది. ఎక్కడికక్కడ లేవుట్లు వేస్తున్నారు. కొందరు నిబంధనలకు అనుగుణంగా మార్పు చేయగా.. మరి కొంతమంది ఇష్టానుసారంగా మార్పు చేస్తున్నారు. లేఆవుట్లు వేసి కన్వర్షన్ చేయకపోయినా...పంచాయతీ, మున్సిపల్ నుంచి అనుమతి లేకపోయినా అటువంటి వాటికి లేవుట్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్‌ఆర్‌సీ) అమలు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అనధికారికంగా లేవుట్లు వేసిన కొందరిపైనే అధికారులు దృష్టి పెట్టారు. వాటిని గుర్తించి నోటీసులు ఇచ్చారు. జిల్లాలో పాత లేఅవుట్‌లు చాలా వరకూ కన్వర్షన్ జరగలేదు. అప్పట్లో తెలియక కొంతమంది ప్లాట్లు కొనుగోలు చేసుకున్నారు. సింగిల్ ప్లాట్‌లకు ఇప్పుడు ఎల్‌ఆర్‌సీ చెల్లించాల్సి ఉంది. సాధారణంగా వ్యవసాయ భూమిని ఎవరైనా వాణిజ్యానికి వినియోగించుకోవాలంటే ముందుగా ల్యాండ్ కన్వర్షన్ చేసుకోవాలి. వెంచర్లు వేయాలన్నా.. పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నా.. ఇతర అవసరాలకు ఉపయోగించాలన్నా..ముందుగా భూ మార్పిడి చేయాలి. భూమి కొనుగోలు చేసినప్పుడే రిజిస్ర్టేషన్ ఫీజులో 10 శాతం ప్రభుత్వానికి చలానా రూపంలో చెల్లించాలి. ఈ ఫీజును కొద్దినెలలు నుంచి తగ్గించారు. అలాగే మార్పిడి చేయనున్న భూమికి సంబంధించిన పత్రాలతో మీసేవలో దరఖాస్తు చేసుకోవాలి. ఆ భూమి ప్రైవేటుదా? ప్రభుత్వానికి చెందినదా? అనేది పరిశీలించి పక్కగా ఉంటేనే ఆర్‌డీవోలు ఎన్‌వోసీ జారీ చేస్తారు. ఇలా 2014 నుంచి ఇప్పటి వరకూ జిల్లాలో 5,885 ఎకరాలనే మార్పిడి చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పార్వతీపురం డివిజన్ కంటే విజయనగరం డివిజన్‌లో ఎక్కువగా ల్యాండ్ కన్వర్షన్ జరుగుతోంది. అనుమతులు లేకుండా మార్పు చేస్తున్న భూమిపై సంబంధిత అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
అధికారిక భూ మార్పిడి వివరాలు ఇలా..
సంవత్సరం ఎకరాలు వచ్చిన ఆదాయం
2014-15లో 800 రూ. 5.30 కోట్లు
2015-16 1,485 రూ.11.29 కోట్లు
2016-17 1,614 రూ. 13 కోట్లు
2017-18 1,040 రూ. 7 కోట్లు
2018-19 547 రూ.2.6 కోట్లు
2019-20 399 రూ.2.7 కోట్లు
కన్వర్షన్ ఫీజు చెల్లించాలి
వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా మార్పు చేసుకున్నప్పుడు తప్పకుండా ప్రభుత్వానికి ఫీజు చెల్లించాలి. ఇప్పుడు సచివాలయాల్లో ప్రత్యేకంగా ఒక సర్వీసును ప్రవేశ పెట్టాం. ఎవరైనా ప్రభుత్వానికి ఫీజు చెల్లించకుండా భూ మార్పిడి చేస్తే అటువంటి వారిపై తహసీల్దారులు చర్యలు తీసుకుంటారు.
- ఎం.గణపతిరావు, డీఆర్‌వో.