వేట...గుండెల్లో తూటా

ABN , First Publish Date - 2020-06-18T11:32:29+05:30 IST

ఏజెన్సీలో నాటు తుపాకుల వినియోగం ఇంకా కొనసాగుతోంది. ఫలితంగా ఎక్కడో ఒకచోట తరచూ తుపాకీ గుళ్లకు

వేట...గుండెల్లో తూటా

ఏజెన్సీలో ఆగని జంతువుల వేట

యథేచ్ఛగా నాటు తుపాకుల వినియోగం

ప్రజల ప్రాణాల మీదకు వస్తున్న వైనం

తాజాగా తుపాకీ గురితప్పి...ఓ వ్యక్తికి గయాలు

త్రుటిలో తప్పిన ప్రాణాపాయం


పార్వతీపురం/ బెలగాం/ గుమ్మలక్ష్మీపురం, జూన్‌ 17: ఏజెన్సీలో నాటు తుపాకుల వినియోగం ఇంకా కొనసాగుతోంది. ఫలితంగా ఎక్కడో ఒకచోట తరచూ తుపాకీ గుళ్లకు బలి కావడమో... గాయపడడమో జరుగుతోంది. ఇదే క్రమంలో బుధవారం జంతువుల వేటకు ఉపయోగించే నాటు తుపాకీ గురి తప్పింది. ఓ వ్యక్తికి తగిలింది. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పింది.  గుమ్మలక్ష్మీపురం మండలం దేరువాడ గ్రామ సమీపంలోని అడవిలో కొందరు గిరిజనులు బుధవారం ఉదయం అడవి జంతువులను వేటాడుతున్నారు.


సమయంలో అదే దారిన వెళ్తున్న జియ్యమ్మవలస మండలం కన్నపుదొరవలస గ్రామానికి చెందిన బొంతు గౌరునాయుడుకి తుపాకీ తూటా తగిలింది. వెంటనే సమీపంలోని వారు అక్కడికి చేరుకున్నారు. వైద్యం కోసం అతన్ని కురుపాం సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. గౌరునాయుడి పరిస్థితి విషమంగా ఉండడంతో వారు విశాఖకు తీసుకెళ్లాలని చెప్పారు. కుటుంబ సభ్యులు అతన్ని స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుడు డాక్టర్‌ రామ్మోహన్‌రావు శస్త్రచికిత్స చేసి శరీరంలోకి దూసుకెళ్లిన బుల్లెట్‌ను బయటకు తీశారు. ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు చెప్పారు. సమాచారం తెలుసుకున్న ఎల్విన్‌పేట సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ నారాయణరావు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. వేటగాళ్లు ఎంతమంది అన్నది తెలియడం లేదు. వారంతా పరారీలో ఉన్నారు. ఘటనపై దేరువాడ పరిసర గ్రామస్థులు నోరుమెదపడం లేదు.


 ఆగని వేట...

ఏజెన్సీ ప్రాంతాల్లో నేటికీ నాటు తుపాకుల వాడకం గుట్టుగా కొనసాగుతోంది. అడవి జంతువులను యథేచ్ఛగా వేటాడుతున్నారు. గతంలో గుమలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస మండలాలతో పాటు, బొబ్బిలి, విజయనగరంలో నాటు తుపాకులతో కాల్పులు జరిగిన ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా గుమలక్ష్మీపురం మండలం దేరువాడ ప్రాంతంలో అడవి జంతువుల వేటకు వెళ్లిన వ్యక్తుల గురి తప్పడంతో అటుగా వెళ్తున్న వ్యక్తికి తగిలింది. ఘటనపై పోలీసులు, అటవీశాఖాధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించకపోతే అడ వుల్లో సంచరించే వణ్యప్రాణాల సంఖ్య క్రమేపీ తగ్గిపోయే ప్రమాదం ఉంది. 


గతంలో సంఘటనలు ఇలా..

కురుపాం మండలం ఏగులవాడ గ్రామానికి చెందిన బిడ్డిక నందారావు అనే గిరిజనుడు పదేళ్ల కిందట నాటుతుపాకీకి బలై ప్రాణాలు కోల్పోయాడు. బహిర్బూమికి వెళ్లగా అడవి పందుల వేటకు వెళ్లిన కొంత మంది వ్యక్తులు కాల్పులు జరిపారు. గురితప్పి, నందారావు గుండెకు తూటా తగలడంతో ఆయన మృతి చెందాడు. 


2018లో బొబ్బిలి పట్టణంలోని కోటిచెరువు గట్టుపై ఒక రియల్‌ఎస్టేట్‌ వ్యాపారిపై నాటుతుపాకీతో కాల్పులు జరిగిన సంఘటన జరిగింది. ఇది వివాహేతర సంబంధాల వ్యవహారం వల్ల చోటుచేసుకుంది.


2018లోనే బొబ్బిలి గ్రోత్‌ సెంటర్‌లో పనిచేస్తున్న ఓ సెక్యూరిటీ గార్డును శ్రీకాకుళానికి చెందిన కొంత మంది వ్యక్తులు పాత కక్షలతో నాటుతుపాకీతో కాల్పులకు పాల్పడ్డారు. ఆ సంఘటనలో సెక్యూరిటీగార్డు మృతి చెందాడు


విజయనగరంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల మధ్య లావాదేవీలకు సంబంధించిన వ్యవహారంలో తేడాలు రావడంతో 2018లో ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో ఎల్‌ఐసీ భవనం వద్ద నాటు తుపాకీతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిపై కాల్పులు జరిగాయి.


పాచిపెంట మండలంలో దశాబ్దకాలం కిందట కొండమోసూరు ప్రాంతంలో వివాహేతర సంబంధాల వ్యవహారంలో ఓ నాటుతుపాకీతో ఒకరిని కాల్చిన సంఘటన చోటుచేసుకుంది.


జియ్యమ్మవలస మండలం పెదబుడ్డిడి పరిసర ప్రాంతంలో వేటకు వెళ్లిన వ్యక్తులకే తుపాకీ గురి తప్పి కాళ్లకు గాయమైంది. ఆ వేటగాళ్లు శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చినట్టు సమాచారం. అప్పట్లో ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 


గుమలక్ష్మీపురం మండలం పి.ఆమిటిలో 1994లో దొంగతనం చేసిన ఓ వ్యక్తి పారిపోతుండగా ఒక గిరిజనుడు నాటుతుపాకీతో అతనిపై కాల్పులకు దిగాడు. కాలికి బలమైన గాయం తగిలి దొంగ పట్టుబడ్డాడు. 


పార్వతీపురం పట్టణంలో ఒక వ్యాపారిని రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఆయన ఇంటివద్దే గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపి హత్య చేసి పరారయ్యారు. ఇలా ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని ఘటనల్లో విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇలాంటి ఘటనలపై ఇప్పటికైనా పోలీసులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి నాటుతుపాకులను స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 

Updated Date - 2020-06-18T11:32:29+05:30 IST