-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Equipment drought for sanitation workers
-
పని సరే.. రక్షణ ఏదీ?
ABN , First Publish Date - 2020-06-22T11:35:03+05:30 IST
నగర పారిశుధ్య కార్మికులకు భద్రత కొరవడింది. ఆపత్కాలంలో విశేష సేవలందిస్తున్న వారికి కనీసం రక్షణ సామగ్రి అందించడం లేదు.

పారిశుధ్య కార్మికులకు సామగ్రి కరువు
ఉన్నతాధికారులు స్పందించాలని వినతి
విజయనగరం టౌన్, జూన్21: నగర పారిశుధ్య కార్మికులకు భద్రత కొరవడింది. ఆపత్కాలంలో విశేష సేవలందిస్తున్న వారికి కనీసం రక్షణ సామగ్రి అందించడం లేదు. దీంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా నగరంలో రెగ్యులర్ ప్రాతిపదికన 554, తాత్కాలిక పద్ధతిలో 276మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారంతా 50 డివిజన్లలో వీధులు, ప్రధాన రహదారులను నిత్యం శుభ్రం చేస్తుంటారు. అయితే గ్లౌజులు, ముఖానికి మాస్కులు, బూట్లు , కొబ్బరినూనె వంటివి వినియోగించి పనిలో దిగాల్సి ఉన్నా.. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు అవేమీ అందడం లేదు.
శాశ్వత సిబ్బందికి ఏకరూప దుస్తులు, ఒప్పంద సిబ్బందికి రేడియం జాకెట్లు, వర్షంలో తడవకుండా రెయిన్ కోట్లు సైతం అందించడం లేదు. దీంతో కొంతమంది కార్మికులు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. తరచూ శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఈ విషయంపై స్పందించాలని ఇటీవల కమిషనర్ వర్మను కలసి వినతిపత్రం అందించామని కార్మిక సంఘం నాయకులు కృష్టంరాజు తెలిపారు.
కాగా పారిశుధ్య కార్మికులకు రక్షణ సామగ్రిని మంజూరు చేయడంలో కొంత ఆలస్యం జరిగిన మాట వాస్తవమేనని కమిషనర్ ఎస్‌ఎస్ వర్మ తెలిపారు. విధుల్లో బిజీగా ఉండడం వల్ల జాప్యం జరిగిందే తప్ప మరొక కార ణం కాదన్నారు. త్వరలోనే కార్మికులందరికీ రక్షణ సామగ్రి అందిస్తామని తెలిపారు.