ఏనుగు దాడిలో మరొకరి దుర్మరణం

ABN , First Publish Date - 2020-11-14T03:48:28+05:30 IST

ఏనుగు దాడిలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు.

ఏనుగు దాడిలో మరొకరి దుర్మరణం
మృతి చెందిన లక్ష్ముంనాయుడు




పొలంలో వరిచేను ఎత్తుతుండగా ఘటన

పరశురాంపురంలో విషాదం

కొమరాడ, నవంబరు 13: ఏనుగు దాడిలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. వర్షాలకు నేలకొరిగిన వరిచేనును ఎత్తుతున్న రైతును ఏనుగు పొట్టన పెట్టుకుంది. ఈ ఘటన కొమరాడ మండలం పరశురాంపురంలో శుక్రవారం ఉదయం  చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రఘుమండల లక్షుంనాయుడు (50) పొలానికి వెళ్లాడు. పొలంలో నేలవాలిన వరిచేనును ఎత్తుతుండగా ఒక్కసారిగా ఏనుగు దాడిచేసింది. కాలితో కుమ్మడంతో ఘటనాస్థలంలో దుర్మరణం పాలయ్యాడు. సమీప రైతులు గమనించేసరికి మృతిచెందాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడికి భార్య రమణమ్మ, వివాహితులైన ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతదేహం వద్ద కన్నీరుమున్నీరయ్యారు. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అటవీ శాఖ అధికారులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు ఏనుగు సంచరిస్తున్నట్టు గుర్తించలేకపోవడం వల్లనే లక్షుంనాయుడు ప్రాణాలు కోల్పోయినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనతో పొలాలకు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు. ప్రస్తుతం కోతల సీజన కావడంతో పొలాల్లో రైతులు, మహిళలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. బాధిత కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం అందించాలని ప్రజాసంఘాల నాయకులు కోరుతున్నారు.


దశాబ్దాలుగా వీడని గజరాజులు

2017 సెప్టెంబరులో శ్రీకాకుళం జిల్లా నుంచి జియ్యమ్మవలస మండలంలోకి ఏనుగులు ప్రవేశించాయి. అప్పటి నుంచి కొమరాడ, జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండలాల ప్రజలకు కంటి మీద కునుకు కరువైంది. ఏనుగులు నలుగురిని బలి తీసుకున్నాయి. కొమరాడ మండలం నాయుడువలసకు చెందిన నిమ్మల పకీరు, జియ్యమ్మవలస మండలం చినకుదమ గ్రామానికి చెందిన కె.కాశన్నదొర, బాసంగి గ్రామానికి చెందిన గంట చిన్నమ్మ,  ఎర్ర నారాయణరావులను పొట్టన పెట్టుకున్నాయి. ఇప్పుడు లక్షుంనాయుడు ఏనుగులు దాడిలో ప్రాణాలు కోల్పోయాడు.  గుంపు నుంచి విడిపోయిన ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టిస్తోంది. జనావాసాల్లోకి వచ్చి దాడి చేస్తోంది. దశాబ్దాలుగా ఏనుగుల సమస్య ఉన్నా తరలింపు ప్రక్రియపై ప్రభుత్వాలు దృష్టి ్టసారించడం లేదు. అటవీ శాఖ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. పంటలకు అపార నష్టం కలుగుతోంది. 


హోల్డింగ్‌ జోనతో నియంత్రణ

ఒంటరి ఏనుగును నియంత్రించేందుకు హోల్డింగ్‌ (కంటైనమెంట్‌) జోనను తెరపైకి తెచ్చారు. ఇందుకుగాను కొమరాడ మండలంలో రెండు హెక్టార్లకు పైగా భూమిని సేకరించేందుకు అటవీ శాఖ అధికారులు సన్నాహాలు చేశారు. పుష్కలంగా ఆహారం దొరుకుతుండడంతో పాటు సేద తీరేందుకు నదీ పరీవాహక ప్రాంతాలు ఉండడంతో కొమరాడ మండలాన్ని ఏనుగులు విడిచిపెట్టడం లేదు. ఇటీవల గుంపు నుంచి ఒక ఏనుగు వేరు పడింది. మిగిలిన గుంపు ఒక వైపు... ఒక్క ఏనుగు మరోవైపు సంచరిస్తున్నాయి. ఒంటరి ఏనుగు పంటలను నాశనం చేస్తోంది. గిరిజనులు, రైతుల ప్రాణాలు తీస్తోంది. ఈ నేపథ్యంలో హోల్డింగ్‌ జోన ప్రతిపాదన వచ్చింది. వీలైనంత త్వరగా హోల్డింగ్‌ జోనను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. 



Updated Date - 2020-11-14T03:48:28+05:30 IST