షాక్‌..వినియోగదారులపై విద్యుత్‌ శాఖ భారం

ABN , First Publish Date - 2020-05-11T10:53:19+05:30 IST

ఎటువంటి అపరాధ రుసుం లేకుండా మార్చి, ఏప్రిల్‌ నెలల విద్యుత్‌ బిల్లులు ఆన్‌లైన్‌లో చెల్లించాలని స్పష్టంచేసిన విద్యుత్‌ శాఖ మాట

షాక్‌..వినియోగదారులపై విద్యుత్‌ శాఖ భారం

ఏప్రిల్‌ నెలకు కొత్త టారిఫ్‌ అమలు

అపరాధ రుసుం పేరుతో రూ.100 వడ్డన


(రింగురోడ్డు) 

ఎటువంటి అపరాధ రుసుం లేకుండా మార్చి, ఏప్రిల్‌ నెలల విద్యుత్‌ బిల్లులు ఆన్‌లైన్‌లో చెల్లించాలని స్పష్టంచేసిన విద్యుత్‌ శాఖ మాట తప్పింది. బిల్లులో అంకెల గారడీ చేసి వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేయదలిచింది.  దీనిపై అనేక చోట్ల ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది. ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఫిబ్రవరి నెల మీటరు రీడింగు మార్చి నెలలో తీయాలి.. అదే విధంగా మార్చి నెల రీడింగ్‌ ఏప్రిల్‌ నెలలో తీయాలి.. కరోనా నేపథ్యంలో బిల్లింగ్‌ జరగలేదు.. ఫిబ్రవరి, మార్చి నెలల వరకూ పాత రేట్ల ప్రకారం బిల్లులు చెల్లించాలి..  ఏప్రిల్‌ నెలకు సంబంధించి కొత్త టారిఫ్‌ అమల్లోకి వస్తుంది. దాని ప్రకారం మే నెల బిల్లులు చెల్లించాలి.. కానీ మూడు నెలల పాటు అపరాధ రుసుం వసూలు చేయకూడదన్న నిబంధన ఉంది.. దీనిని విద్యుత్‌శాఖాధికారులు పాటించలేదు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో వినియోగించిన యూనిట్లను 61 రోజులకు లెక్కించి, వాటిలో సగం యూనిట్లను అంటే మార్చి నెల వినియోగానికి పాత టారిఫ్‌ ప్రకారం, మరోసగం యూనిట్లను ఏప్రిల్‌లో కొత్త టారిఫ్‌ ప్రకారం లెక్కించి మొత్తం ఒకే బిల్లుగా రూపొందించారు. ఇది వినియోగదారుల పాలిట శాపమైంది. 


అపరాధ రుసుం, రీకనెక్షన్‌ ఫీజుతో బాదుడు 

ప్రజలంతా కరోనా ప్రభావంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే.... విద్యుత్‌ శాఖ అధికారులు మరో రూపంలోనూ వడ్డనకు దిగుతున్నారు. అపరాధ రుసుం, రీ కనెక్షన్‌ ఫీజు పేరిటా వినియోగదారుడిపై బాదుడు ప్రారంభించారు. తొలుత సకాలంలో బిల్లులు చెల్లించకపోయినా అపరాధ రుసుం వసూలు చేయబోమన్నారు. బిల్లు ఇచ్చే సందర్భంలో మాత్రం.. సకాలంలో బిల్లు చెల్లించని నేపథ్యంలో కనెక్షన్‌ తొలగించామని, రీ కనెక్షన్‌కు రూ.100 పేరుతో వసూలుకు రంగం సిద్ధం చేశారు. ఏప్రిల్‌ నెలలో చెల్లించిన బిల్లుకు సరిపడా యూనిట్లను తొలగించి, మిగిలిన యూనిట్లను రెండు నెలలకు లెక్కిస్తే, సరిపోతుందన్న అభిప్రాయాన్ని వినియోగదారులు వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు చెల్లించినప్పటికీ, ఆ యూనిట్లను రెండు నెలలకు కలపడంతో శ్లాబ్‌ పెరుగుతోందన్నది వినియోగదారుల వాదన. 


నిబంధనల మేరకే..

ఏపీఈపీడీసీఎల్‌, విద్యుత్‌ నియంత్రణ మండలి ఆదేశాల మేరకు మాత్రమే విద్యుత్‌ వినియోగదారులకు బిల్లులు పంపాం. అంకెల గారడీ అనేది లేదు. మార్చి, ఏప్రిల్‌ నెలల బిల్లుల్లో మార్చి నెలకు సంబంధించి పాత టారీఫ్‌, ఏప్రిల్‌ నెలకు సంబంధించి కొత్త టారీఫ్‌ ప్రకారం బిల్లులు రూపొందించాం. అపరాధ రుసుం, రీకనెక్షన్‌కు సంబంధించి రూ.100 వినియోగదారులు తప్పనిసరిగా చెల్లించాలి.. వీలైనంత వరకూ వినియోగదారులు ఆన్‌లైన్‌ పద్ధతుల్లో విద్యుత్‌ బిల్లులు చెల్లించాలి.

- వై.విష్ణు, ఎస్‌ఈ, విద్యుత్‌ శాఖ 

Updated Date - 2020-05-11T10:53:19+05:30 IST