నగర పంచాయతీలో తొలిసారిగా!

ABN , First Publish Date - 2020-03-13T11:23:16+05:30 IST

నెల్లిమర్ల నగర పంచాయతీలో తొలిసారిగా ఎన్నికల నగారా మోగింది. సుమారు 14 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు 20 వార్డులకు గాను ఈనెల 23న ఎన్నిక జరగనుంది. చైర్‌పర్సన్‌ పీఠం ఎస్సీ మహిళకు

నగర పంచాయతీలో తొలిసారిగా!

14 ఏళ్ల తర్వాత నెల్లిమర్లలో ఎన్నికలు 

చైర్‌పర్సన్‌ పీఠం ఎస్సీ మహిళకు కేటాయింపు


నెల్లిమర్ల : నెల్లిమర్ల నగర పంచాయతీలో తొలిసారిగా ఎన్నికల నగారా మోగింది. సుమారు 14 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు 20 వార్డులకు గాను ఈనెల 23న ఎన్నిక జరగనుంది.  చైర్‌పర్సన్‌ పీఠం ఎస్సీ మహిళకు కేటాయించడంతో రెండు పార్టీల నాయకులు వ్యూహప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యారు.  ఇప్పటికే చైర్మన్‌ పదవి రేసులో టీడీపీ తరఫున కింతాడ కళావతి, వైసీపీ తరఫున పాండ్రంకి మహాలక్ష్మి, గండ్రేటి జ్యోతి పేర్లు వినిపిస్తున్నాయి. ఆయా పార్టీల పెద్దలు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గత ఎన్నికలతో పోలిస్తే నెల్లిమర్ల, జరజాపుపేట  టీడీపీకి అనుకూల గ్రామాలు. గతంలో సర్పంచ్‌, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థులు హవా కొనసాగించేవారు. రెండు సార్లు మినహా టీడీపీ జెండా రెపరెపలాడింది. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో మాత్రం ఓట్ల శాతం తగ్గింది. ఏదేమైనా స్థానిక ఎన్నికల్లో పార్టీకి పూర్వవైభవం వస్తుందని టీడీపీ నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇటీవల ఎమ్మెల్యే ఎన్నికల నాటి కన్నా పుంజుకుంటామని వైసీపీ నాయకులు చెబుతున్నారు.

2013లో ఏర్పాటు

నగర పంచాయతీని 2013లో మార్చి 21 అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంతవరకు నెల్లిమర్ల మండల పరిధిలో మేజర్‌పంచాయతీలుగా ఉన్న నెల్లిమర్ల, జరజాపుపేటలను విలీనం చేసి నగర పంచాయతీగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ రెండు గ్రామాల ప్రజలు, పలు పార్టీల కార్యకర్తలు కోర్టును ఆశ్రయించినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఇదిలా ఉండగా నెల్లిమర్ల మేజర్‌ పంచాయతీ హోదాలో 2006లో సర్పంచ్‌ స్థానానికి చివరి సారిగా జరిగిన ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత చిక్కాల సాంబశివరావు సతీమణి చిక్కాల అరుణకుమారి గెలుపొందారు. వారి పీరియడ్‌ 2011తో పూర్తయింది. ఆ తర్వాత జరగాల్సిన సర్పంచ్‌ ఎన్నికల సమయానికి నెల్లిమర్లను నగర పంచాయతీగా మార్చారు. అయితే ఇన్నాళ్ల తర్వాత ఇక్కడ ఎన్నికల నగారా మోగింది. సుమారు 27 వేల జనాభా ఉన్న నెల్లిమర్ల నగరపంచాయతీలో 18,798 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 79 శాతం మంది 14,757 మంది బీసీలే ఉన్నారు.

Updated Date - 2020-03-13T11:23:16+05:30 IST