ఎన్నికలే టార్గెట్‌

ABN , First Publish Date - 2020-12-02T04:32:03+05:30 IST

స్థానిక ఎన్నికలకు టీడీపీ సన్నద్ధమవుతోంది. ప్రతిష్టాత్మక పోరుగా భావించి బరిలో దిగాలని భావిస్తోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి ఎన్నికల్లో విజయం సాధించాలన్న తలంపుతో ఉంది. ఇందులో భాగంగా ముందస్తు ప్రణాళిక రూపొందించుకునేందుకు నేతలు భేటీ అవుతున్నారు.

ఎన్నికలే టార్గెట్‌
టీడీపీ లోగో

రేపు టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయి సమావేశం

హాజరుకానున్న కీలక నేతలు

 సంస్థాగత కమిటీలు పూర్తి చేసేందుకు నిర్ణయం

 (విజయనగరం-ఆంధ్రజ్యోతి)

స్థానిక ఎన్నికలకు టీడీపీ సన్నద్ధమవుతోంది. ప్రతిష్టాత్మక పోరుగా భావించి బరిలో దిగాలని భావిస్తోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి ఎన్నికల్లో విజయం సాధించాలన్న తలంపుతో ఉంది. ఇందులో భాగంగా ముందస్తు ప్రణాళిక రూపొందించుకునేందుకు నేతలు భేటీ అవుతున్నారు. విజయనగరం పార్లమెంట్‌ స్థాయి టీడీపీ జిల్లా కమిటీ గురువారం ఉదయం పార్టీ జిల్లా కార్యాలయం అశోక్‌ బంగ్లాలో సమావేశం అవుతోంది. సమావేశానికి విజయనగరం పార్లమెంట్‌ పరిధిలోని ఏడు నియోజకవర్గాల బాధ్యులు, ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అధ్యక్షత వహిస్తారు. మహిళా అధ్యక్ష, కార్యదర్శులు కూడా హాజరు కానున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల, రాజాం నియోజకవర్గాల టీడీపీ బాధ్యులు, మన జిల్లాలోని విజయనగరం, గజపతినగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, బొబ్బిలి నియోజకవర్గాల బాధ్యులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.  రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి సుజయ్‌ కృష్ణరంగారావు, పొలిట్‌ బ్యూరో సభ్యులు అశోక్‌ జగపతిరాజు, కిమిడి కళావెంకట్రావు, కేంద్ర కమిటీ సభ్యులు ప్రతిభాభారతి వంటి ముఖ్య నేతలు హాజరు కానున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమావేశం కీలకమైనదిగా టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. రాబోయే స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులకు వెన్నుదన్నుగా ఉండేందుకు వీలుగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. పార్టీ పటిష్టానికి తీసుకోవాల్సిన చర్యలపై అందరూ సలహాలు ఇవ్వనున్నారు. ఇప్పటికే గ్రామ, మండల, నియోజకవర్గ, పార్లమెంటరీ కమిటీలను ఏర్పాటు చేశారు. ఇంకా మిగిలి ఉన్న కమిటీలు, జిల్లా అనుబంధ కమిటీలను ఏర్పాటు చేసేందుకు వీలుగా భేటీలో నిర్ణయం తీసుకుంటారని సమాచారం. 

పోరుబాటలో..

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించి... వాటిపై పోరాటాలు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది. గత ఏడాది ధాన్యం విక్రయించిన రైతుల్లో కొంత మందికి నేటికీ చెల్లింపులు చేయని అంశంపై పోరాటం చేయాలని భావిస్తున్నారు. మొక్కజొన్న దిగుబడులను రైతుల నుంచి 30శాతం మాత్రమే కొనుగోలు చేసి మిగిలిన 70శాతం నిల్వలు కొనుగోలు చేయకపోవడంపై ఇటీవల శాసన మండలిలో టీడీపీ ప్రస్తావించింది. జిల్లాలో ఇటువంటి రైతులను గుర్తించి వారికి న్యాయం జరిగేలా.. మొక్కజొన్న కొనుగోళ్లు పూర్తి స్థాయిలో జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలనుకుంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కొన్నిచోట్ల వరి చేలు తడిచిపోయాయి. పత్తి పంట కూడా తడిసి... రంగు మారింది. రంగు మారిన ధాన్యం, పత్తి నిల్వలు కొనుగోలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని కూడా భావిస్తున్నారు. 


Updated Date - 2020-12-02T04:32:03+05:30 IST