నేటి నుంచి ఎనిమిదో విడత రేషన్‌ పంపిణీ

ABN , First Publish Date - 2020-07-20T12:12:23+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నవంబరు వరకూ రేషన్‌ ఉచితంగా అందించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ నుంచి

నేటి నుంచి ఎనిమిదో విడత రేషన్‌ పంపిణీ

సమస్యలు పరిష్కరిస్తేనే అంటున్న డీలర్లు

డిపోలకు చేరిన సరుకులు


(కలెక్టరేట్‌): కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నవంబరు వరకూ రేషన్‌ ఉచితంగా అందించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకూ ఏడు విడతల్లో రేషన్‌ పంపిణీ చేశారు. కానీ సోమవారం నుంచి ఈ నెల 25 వరకూ అందించాల్సిన 8వ విడత రేషన్‌ సరఫరాపై స్పష్టత లేకుండా పోయింది. రేషన్‌ డీలర్లు అందోళనబాటలో ఉండడమే ఇందుకు కారణం. తమకు కమీషన్‌ పెంచాలని, బకాయిలు చెల్లించాలని, బీమా సౌకర్యం కల్పించాలని గత కొద్దిరోజులుగా డీలర్లు డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో 7విడతలుగా సరుకులు పంపిణీ చేస్తే.. రెండు విడతలుగా మాత్రమే కమీషన్‌ ఇచ్చారని... మిగిలిన కమిషన్‌ డబ్బులు ఇవ్వాలని కోరారు.


ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ముగ్గురు డీలర్లు కరోనా వైరస్‌తో చనిపోయారని..తమకు బీమా సదుపాయం కల్పిస్తే కానీ.. సరుకులు పంపిణీ చేసేది లేదని తెగేసి చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో కేసులు పెరుగుతుండడం... సరుకులు పంపిణీ చేసే సమయంలో కార్డుదారులు అందరూ ఒకేసారి డిపోకు వచ్చి ఈపోస్‌ మిషన్‌పై వేలి ముద్రలు వేయడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని చెబుతున్నారు. అందుకే వీఆర్‌వో లేదా సచివాలయ సిబ్బంది ద్వారా ఆఽథెంటికేషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ సమస్యలు పరిష్కరిస్తేగానీ సోమవారం నుంచి పంపిణీ చేయనున్న ఉచిత సరుకులు ఇవ్వలేమని డీలర్లు చెబుతున్నారు.


మరోవైపు జిల్లాలోని 1400 రేషన్‌ డీపోలుకు 8వ విడత రేషన్‌ సరఫరాకు సంబంధించి సరుకులు చేరాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 7 లక్షలు పది వేలుమంది కార్డు దారులు ఉన్నారు. ప్రసుత్తం డీలర్లు సరుకులు పంపిణీకి ముందుకు వచ్చే పరిస్ధితి కనిపించలేదు. ఈ పరిస్ధితిలో అధికారులు పంపిణీ ఎలా చేస్తారో? అనేది తెలియాల్సి ఉంది. ఇదే విషయం జిల్లా పౌర సరఫరాల అధికారి పాపారావు వద్ద ప్రస్తావించగా రేషన్‌ డీలర్ల సమస్యలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయన్నారు. సోమవారం నుంచి రేషన్‌ పంపిణీ ప్రారంభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-07-20T12:12:23+05:30 IST