-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Dont worry about Corona
-
కరోనాపై ఆందోళన వద్దు
ABN , First Publish Date - 2020-03-24T08:14:21+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశామని ఎవరూ ఆందోళన

జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదు
హోమ్ ఐసోలేషన్‌లో 108 మంది
నియోజకవర్గంలో 100, జిల్లా కేంద్రంలో 200 పడకలు
నెలాఖరు వరకూ లాక్‌డౌన్
కలెక్టర్ హరిజవహర్‌లాల్
విజయనగరం (ఆంధ్రజ్యోతి), మార్చి 23: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశామని ఎవరూ ఆందోళన చెందవద్దని కలెక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ అన్నారు. ఈ నెలాఖరు వరకూ లాక్‌డౌన్ ఉంటుందని, ప్రజలు బయట తిరగవద్దని కోరారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అధికారులతో మాట్లాడారు. ఇప్పటి వరకూ జిల్లాలో పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదన్నారు. ముందుజాగ్రత్తగా ఒక్కో నియోజకవర్గంలో 100, జిల్లా కేంద్రంలో 200 ఐసోలేషన్ పడకలు ఏర్పాటు చేశామని తెలిపారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఇళ్ల బయటకు రావద్దని కోరారు.
విదేశాల నుంచి వచ్చిన వారిపై నిఘా
విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారిపై నిఘా ఉంచామని కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారిలో 108 మంది స్వీయ నిర్బంధంలో ఉన్నారన్నారు. వీరి పరిస్థితిపై పోలీసు, వైద్య ఆరోగ్యశాఖాధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారన్నారు. వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలని తెలిపారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారు బయటకు రావద్దని సూచించారు. ఎవరైనా బయటకు వస్తే చట్టప్రకారం శిక్షార్హులని తెలిపారు.
31 వరకూ లాక్‌డౌన్...
కరోనా మహమ్మారిని వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈనెల 31 వరకూ లాక్‌డౌన్ ఉంటుం దన్నారు. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీక్యాబ్‌లు తిరగవని తెలిపారు. అత్యవసర వాహనాలు మాత్రమే తిరుగుతాయన్నారు. వాహనచోదకులు వాహనాలు నడిపితే చర్యలు తప్ప వని హెచ్చరించారు.
నిత్యావసర వస్తువులకు మాత్రమే..
గ్యాస్, పెట్రోల్ బంకులు, కూరగాయలు, నిత్యావసర షాపులు, మందుల షాపులు తెరుస్తారని కలెక్టర్ తెలిపారు. షాపింగ్‌మాల్‌లు, దుస్తులు, బంగారు షాపులు, రెస్టారెంట్లు, థియేటర్లు, మద్యం షాపులు, వర్తక వాణిజ్య సంస్థలు తెరువకుండా చూస్తున్నామన్నారు. సమావేశంలో జేసీ-2 ఆర్.కూర్మనాథ్, ఓఎస్‌డీ రామ్మోహనరావు, డీఆర్‌వో, డీఎంహెచ్‌వో రమణ కుమారి తదితరులు పాల్గొన్నారు.