పాఠశాలకు రావద్దు

ABN , First Publish Date - 2020-03-18T10:43:20+05:30 IST

విజయనగరం పట్టణానికి చెందిన అనేక మంది ఇతర దేశాల్లో ఉంటున్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో

పాఠశాలకు రావద్దు

విద్యార్థికి పాఠశాల హుకుం

ఆ ఇంట్లో కరోనా లక్షణాలతో వ్యక్తి ఉన్నట్టు అనుమానం

పోలీసులకు ఫిర్యాదు


విజయనగరం, మార్చి 17: విజయనగరం పట్టణానికి చెందిన అనేక మంది ఇతర దేశాల్లో ఉంటున్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో అలాంటి వారిలో కొందరు స్వదేశానికి చేరుకుంటున్నారు. విజయనగరం జల్లాలో ఇలా వచ్చిన వారి సంఖ్య 125 మంది ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో 65 మందికి పైగా జిల్లా కేంద్రానికి చెందిన వారే.  వీరికి వైద్య శాఖ పరీక్షలు చేస్తోంది. పట్టణ పరిధిలోని  కేఎల్‌ పురంలో ఒక వ్యక్తి జలుబు, జ్వరంతో బాధ పడుతున్నట్లు చెబుతున్నారు.


ఆయన సింగపూర్‌ నుంచి వచ్చినట్లు సమాచారం. ఇదే కుటుంబానికి చెందిన ఒక విద్యార్థి మంగళవారం పాఠశాలకు వెళ్లాడు.  అయితే బుధవారం నుంచి స్కూల్‌కు రావద్దని పాఠశాల యాజమాన్యం విద్యార్థిని ఆదేశించడంతో కలకలం రేగింది.


దీనిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్‌ రమణకుమారి వద్ద ప్రస్తావించగా ఇతర దేశాల నుంచి మన జిల్లాకు వస్తున్న వారిలో సగానికి పైగా జిల్లా కేంద్రానికి చెందిన వారే ఉన్నారని తెలిపారు. ఇటువంటి వారిని వైద్య శాఖ పర్యవేక్షణలో ఉంచి వైద్య పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. కేఎల్‌ పురంలో కరోనా వైరస్‌ లక్షణాలున్న వ్యక్తి ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని స్పష్టం చేశారు. విద్యార్ధిని పాఠశాలకు రావద్దని ఆదేశించిన పాఠశాల యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని జిల్లా వైద్య శాఖ అధికారి తెలిపారు.

Updated Date - 2020-03-18T10:43:20+05:30 IST