మాయమైపోవద్దమ్మా...మనసున్న వారు!

ABN , First Publish Date - 2020-07-19T12:16:57+05:30 IST

విజయనగరం పట్టణ శివారుల్లోని ఓ ప్రాంతం. ఓ వ్యక్తికి రెండు రోజుల కిందట పాజిటివ్‌ వచ్చింది. ఆ వ్యక్తిని వీధి వారంతా దాదాపు

మాయమైపోవద్దమ్మా...మనసున్న వారు!

కరోనా బాధితులపై వివక్ష

గ్రామాల్లో ఎన్నడూ లేని పరిస్థితి

బాధితులకు దూరంగా ఉంటున్న వైనం

కోలుకున్న వారికీ తప్పని కష్టాలు

కొన్నిచోట్ల మంచినీరూ ఇవ్వని జనం

ప్రజల్లో అవగాహన లోపమే కారణం


విజయనగరం డెస్క్‌: విజయనగరం పట్టణ శివారుల్లోని ఓ ప్రాంతం. ఓ వ్యక్తికి రెండు రోజుల కిందట పాజిటివ్‌ వచ్చింది. ఆ వ్యక్తిని వీధి వారంతా దాదాపు సామాజిక బహిష్కరణ చేశారు. నిత్యావసరాలను సైతం వారికి అందకుండా చేశారు. ఇదిలా ఉంటే ఆ వీధి వారిని సమీప ప్రాంతాల వారు ఎక్కడికీ రాకుండా అడ్డుకున్నారు. వారు షాపులకు, బయటకు రాకూడదని ఆంక్షలు విధించారు.


పాచిపెంట మండలంలోని ఓ గ్రామంలోని వ్యక్తికి ఇటీవల పాజిటివ్‌ వచ్చింది. దీంతో గ్రామస్తులు ఆ కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరించినంత పని చేశారు. ఆ కుటుంబాన్ని పశువుల పాకలో ఉంచారు.


పార్వతీపురం పట్టణ పరిధిలో పాజిటివ్‌ లక్షణాలతో ఓ వ్యక్తి గురువారం కన్నుమూశారు. ఆ మృతదేహానికి స్థానిక శ్మశాన వాటికలో దహన సంస్కారాలు చేసేందుకు అక్కడి వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది వివాదానికి దారి తీసింది.


సాలూరు మండలానికి చెందిన ఓ మహిళ విశాఖపట్నంలో వైద్యశాఖలో విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు పాజిటివ్‌ రావడంతో చికిత్స పొంది కోలుకున్నారు. ఇటీవల తన కన్నవారింటికి వచ్చిన ఆ మహిళను స్థానికులు అడ్డుకున్నారు. అక్కడ ఉండొద్దని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆమె ఆవేదనతో వెనుదిరిగాల్సి వచ్చింది. 

 

అదే గ్రామంలో ఒక పెద్దాయనకూ పాజిటివ్‌ వచ్చింది. హోం క్వారంటైన్‌లో ఉండాలని అఽధికారులు సూచించారు.  స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కొవిడ్‌  ఆస్పత్రికి తరలించారు. 

సాలూరులోని ఓ వీధిలో మూడు రోజుల క్రితం ఒక యువకుడిలో పాజిటివ్‌ లక్షణాలు కనిపించాయి. దీంతో ఆ ఇంటికి ఇరువైపులా ఇళ్లలో అద్దెకు ఉన్న వారు తాత్కాలికంగా మరో వీధిలోకి మారిపోయారు. 

సాలూరులో శుక్రవారం ఒక వ్యాపారిలో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో ఇరువైపుల ఉన్న ఇళ్ల వారు ఖాళీ చేసి...మరో ప్రాంతానికి వెళ్లిపోయారు.

...ఈ సంఘటనలన్నీ కరోనా మన జీవితాల్లో తెచ్చిన మార్పులకు..భయానికి అచ్చమైన ఉదాహరణలు. భోగాపురం నుంచి పాచిపెంట వరకూ నిత్యం ఎక్కడో ఓచోట ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.


పల్లెలంటే ప్రేమకు..ఆప్యాయతలకు పుట్టిళ్లుగా చెప్పుకుంటాం. అనురాగాలు...అనుబంధాలను వెతుక్కోవాలంటే ఇప్పటికీ పల్లెల వైపే చూస్తాం. కానీ కరోనా ప్రభావం మిగతా అంశాల్లాగే అనుబంధాలపైనా తీవ్ర ప్రభావమే చూపుతోంది. గ్రామీణుల అమాయకత్వం...అవగాహన లోపం... కరోనా బాధితులను మరింత ఆత్మన్యూనతా భావంలోకి నెట్టేస్తోంది. కరోనా రాకుండా జాగ్రత్తలు పాటించడం వరకూ బాగుంటోంది. ప్రభుత్వ పెద్దల నుంచి అధికారుల వరకూ అందరూ చెబుతున్నది ఇదే. కానీ ఎవరికైనా ‘పాజిటివ్‌’ లక్షణాలు అని తెలిస్తే చాలు..పల్లెల్లో దాదాపు వెలివేసినంత పని చేస్తున్నారు. వారితో కనీసం దూరం నుంచైనా మాట్లాడడానికి ఆసక్తి చూపడం లేదు. కొన్నిచోట్ల గ్రామపెద్దలే కల్పించుకొని కరోనా బాధితులను ఊరికి దూరంగా ఉండాలని ఆదేశిస్తున్నట్టు తెలుస్తోంది.


చికిత్స పొంది వస్తున్నా...

కరోనా బాధితులు కొన్ని గ్రామాల్లో చికిత్స పొంది క్షేమంగా ఇళ్లకు చేరుకుంటున్నారు. ఇటువంటి వారికీ వివక్ష తప్పడం లేదు. ఇంకా వారిలో కరోనా లక్షణాలు ఉన్నాయేమోననే అనుమానంతో దూరంగానే ఉంచుతున్నారు. కొన్నిచోట్ల ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవడమో...బాధితులను...చికిత్స పొంది వచ్చిన వారిని ఊరికి దూరంగా ఏ తోటల్లోనో... సామాజిక భవనాల్లోనో ఉంచుతున్న సంఘటనలూ చోటుచేసుకుంటున్నాయి. బాధితులకు నిత్యావసరాలు...మంచినీళ్లు కూడా ఇవ్వడానికి పల్లెల్లోని ప్రజలు ముందుకు రావడం లేదంటే కరోనా భయం ఏ స్థాయిలో నాటుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల కొన్ని గ్రామాల్లో వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. మరికొన్నిచోట్ల బాఽధితులు మౌనంగా రోదించాల్సి వస్తోంది. కరోనా సామాజిక వ్యాప్తి మొదలైపోయింది. బాధితులపై ఎటువంటి వివక్ష చూపకూడదని ఓవైపు యంత్రాంగం చెబుతోంది. కానీ ఇది ఆచరణకు నోచుకోవడం లేదు. అధికార యంత్రాగమంతా కరోనా నివారణ చర్యలు... వైద్య పరీక్షలు...ఇతరత్రా పనుల్లో బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలో బాధితులతో వ్యవహరించాల్సిన తీరుపై ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడంలో దాదాపుగా విఫలమవుతున్నారు. 

 

వివక్ష చూపడం నేరం

కరోనాకు చికిత్స పొంది..కోలుకుంటున్న వారి విషయంలోనూ... బాధితుల పైనా వివక్ష చూపడం  తగదు. బాధిత కుటుంబాలను వెలివేయడం.. వారిని గ్రామం నుంచి బహిష్కరించడం నేరం. ఇటువంటి సంఘటనలు మా దృష్టికి తీసుకువస్తే తక్షణమే చర్యలు తీసుకుంటాం. కరోనా వైరస్‌ వ్యాప్తిపై పోలీసు, ఆరోగ్యశాఖ సిబ్బందితో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. వారిలో చైతన్యం తీసుకువస్తున్నాం.

- రాజకుమారి, ఎస్పీ

Updated Date - 2020-07-19T12:16:57+05:30 IST