అనుమతి సరే...

ABN , First Publish Date - 2020-04-21T06:29:21+05:30 IST

కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపులో దాబాలకు అనుమతులు ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీటి వల్ల వివిధ ప్రాంతాల వారికి ఆహారం దొరికే వెసులుబాటు ఉంటుందన్నది...

అనుమతి సరే...

  • దాబాలకు కేంద్రం ‘సడలింపు’
  • ఎక్కువ సంఖ్యలో ఇతర ప్రాంతాల వారి రాక
  • రక్షణ చర్యలు తీసుకోకుంటే ముప్పు
  •  

కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపులో దాబాలకు అనుమతులు ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీటి వల్ల వివిధ ప్రాంతాల వారికి ఆహారం దొరికే వెసులుబాటు ఉంటుందన్నది వాస్తవమే. కానీ దాబాలకుఎక్కువగా ఇతర ప్రాంతాలకు చెందిన వారే వస్తుంటారు. వారిలో అధికంగా లారీ డ్రైవర్లు ఉంటారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి కూడా కొన్ని ఉత్పత్తులను లారీల్లో రవాణా చేస్తూ జిల్లాకు వచ్చే అవకాశం ఉంది. కరోనా ప్రబలిన డ్రైవర్లు, క్లీనర్‌లు మన జిల్లాలోని దాబాలకు ఆహారం కోసం వస్తే మన పరిస్థితి ఏంటని వివిధ ప్రాంతాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు తీసుకున్న జాగ్రత్తలు, కట్టుబాట్లు బూడిదలో పోసిన పన్నీరవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


(పార్వతీపురం)

దాబాలకు ఇచ్చిన వెసులుబాటుపై జిల్లా ప్రజలు భిన్నంగా స్పందిస్తున్నారు. వాటి వద్ద జాగ్రత్తలు తీసుకోకుంటే ముప్పు తప్పదని ఆందోళన చెందుతున్నారు. ప్రజా రవాణా మినహా నిత్యావసరాలు, పెట్రోల్‌, డీజిల్‌, మందులు తదితర వాటిని రవాణా చేసే వాహనాలకు లాక్‌డౌన్‌ నిబంధనల్లో సడలింపులు ఉండడంతో హైవేలతో పాటు పలు రహదారులపై వాహన రాకపోకలు కొనసాగనున్నాయి. లారీలు పెద్ద సంఖ్యలో తిరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే డ్రైవర్లు, క్లీనర్లు, సిబ్బంది కోసం దాబాలు తెరుస్తున్నారు. వీటికి దగ్గరలో ఉన్న ఆయా ప్రాంతాల ప్రజలు కూడా ఆహారం కోసం అక్కడికి వెళ్లే అవకాశం ఉంది. దూర ప్రాంతాల నుంచి వాహనాల రాకపోకలు సాగిస్తున్న వారిలో ఎవరిలోనైనా కరోనా వ్యాధి లక్షణాలు (లారీ సిబ్బందికి) ఉంటే పరిస్థితి ఏమిటని జిల్లా ప్రజలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.


దాబాల్లో పనిచేసే వారికి ఎవరికైనా లారీ సిబ్బంది ద్వారా కరోనా వైరస్‌ సోకినా ప్రమాదమే. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌కు ప్రజలు ఎంతో సహకరిస్తున్నారు. అటువంటి సందర్భాల్లో రహదారులకు ఆనుకుని ఉన్న దాబాలు పునః ప్రారంభం కావడంతో  పరిస్థితి  ఎటువైపు దారి తీస్తుందోనని జిల్లా ప్రజలు టెన్షన్‌ పడుతున్నారు. 


జిల్లాలో దాబాలు

జిల్లాలో విజయనగరం నుంచి ఒడిశాకు వెళ్లే రహదారికి ఇరువైపులా పెద్ద ఎత్తున దాబాలు ఉన్నాయి. ఇవి ఎల్లప్పుడూ రద్దీగా ఉంటాయి. పార్వతీపురం డివిజన్‌లో రామభద్రపురం మండల కేంద్రంగా రామభద్రపురం- సాలూరు బైపాస్‌ (ఎన్‌హెచ్‌ 26) రహదారిలో పేరొందిన దాబా ఒకటి ఉంది. భోగాపురం మండలం భోగాపురం గ్రామం వద్ద, లింగాలవలస జంక్షన్‌ సమీపంలో పెద్ద దాబాలు ఉన్నాయి.  గజపతినగరం మండలం బైరిపురం జంక్షన్‌.. కొత్తవలస ఫ్లైఓవర్‌ వంతెన ప్రాంతంలో ఉన్న దాబాలు జనంతో నిండి ఉంటాయి. దాబాలు అధికంగా రామభద్రపురం నుంచి విజయనగరం, విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం, కొత్తవలస నుంచి అరకు  వెళ్లే మార్గాల్లో ఉన్నాయి.  ఆ ప్రాంతాలకు వెళ్లే వాహనాల సిబ్బంది స్థానికంగా లారీలను నిలిపి దాబాల వద్ద భోజనాలు చేయడంతో పాటు విశ్రాంతి తీసుకుంటారు. అన్నింటికీ అనుకూలంగా ఉండడంతో లారీలు ఎక్కువగా నిలిపి భోజనాలు చేస్తుంటారు.


కరోనా కలవర పరిస్థితిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిస్థితి సజావుగా కొనసాగితే మంచిదే. ఆ మహమ్మారి ఆయా ప్రాంతాల్లో పొరపాటున ఏ ఒక్కరికి ప్రబలినా.. వ్యాప్తి చెందినా మిగిలిన జిల్లాల జాబితాల్లో విజయనగరం చేరుతుందేమోనని ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగం తగు చర్యలు తీసుకుని కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా దాబాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సంబంధిత యజమానులకు తగిన విధంగా చైతన్యపర్చాల్సిన అవసరం ఉంది. భౌతిక దూరం పాటించడం.. ఆహారాన్ని ప్యాకింగ్‌లో మాత్రమే ఇవ్వడం.. శానిటైజర్లు ఉపయోగించడం తదితర జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.


Updated Date - 2020-04-21T06:29:21+05:30 IST