దర్శన భాగ్యం

ABN , First Publish Date - 2020-06-11T09:33:45+05:30 IST

ఎట్టకేలకు భక్తులకు దేవుళ్ల దర్శనభాగ్యం లభించింది. సుదీర్ఘ విరామం తరువాత బుధవారం నుంచి ..

దర్శన భాగ్యం

దేవాలయాల్లోకి భక్తులు 

సుదీర్ఘ విరామం తర్వాత దర్శనానికి అనుమతి

నిబంధనలు అమలు చేసిన సిబ్బంది


విజయనగరం రూరల్‌/ నెల్లిమర్ల, జూన్‌ 10: ఎట్టకేలకు భక్తులకు దేవుళ్ల దర్శనభాగ్యం లభించింది. సుదీర్ఘ విరామం తరువాత బుధవారం నుంచి ఆలయాల్లోకి భక్తులకు ప్రవేశం కల్పించారు. నిబంధనలను అనుసరించి సిబ్బంది ఏర్పాట్లు చేశారు. భక్తుల మధ్య ఆరడుగుల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆలయంలోకి వచ్చే ప్రతి భక్తుడూ శానిటైజర్‌ వాడేలా చూశారు. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా మార్చి 23 నుంచి కేంద్రం లాక్‌డౌన్‌ను ప్రకటించింది. అప్పటి నుంచి ఆలయాల్లోకి భక్తులను అనుమతించలేదు. అర్చకులు సంప్రదాయం ప్రకారం పూజలు చేసిన.. నిర్దేశించిన సమయంలోగా ఆలయాలను మూసివేసేవారు. ఈ నెల 8 నుంచి దేవాలయాలను తెరుచుకోవచ్చునని ప్రభుత్వం చెప్పింది.


దీనిపై దేవదాయశాఖ ఆదేశాల మేరకు ఆలయాలను తెరిచి 8, 9 తేదీల్లో కరోనా నిబంధనల మేరకు ఏర్పాట్లు చేశారు. భక్తులకు బుధవారం నుంచి దర్శనానికి అనుమతిచ్చారు. విజయనగరంలోని పైడిమాంబ ఆలయం, రామతీర్థం, పుణ్యగిరి, ధర్మవరం, గరుగుబిల్లిలోని వేంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు చిన్న ఆలయాలు కూడా నిత్య పూజలు, భక్తులతో బుధవారం కళకళలాడాయి. పైడిమాంబ ఆలయంలో ఉదయం సుప్రభాత సేవ అనంతరం దర్శనానికి భక్తులను అనుమతించారు. మాస్క్‌ ఉంటేనే ఆలయంలోకి ప్రవేశం కల్పించారు. భౌతికదూరంతో పాటు, ప్రధాన గేటు వద్ద శానిటైజర్‌ ఏర్పాటు చేశారు. ప్రతి భక్తునికీ థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేశారు.  వారి వివరాలనూ నమోదు చేశారు.


ఈ ప్రక్రియ వల్ల దర్శనానికి కాస్త ఆలస్యమైంది. పైడిమాంబ ఆలయంతో పాటు శివాలయం వీధిలోని పైడిమాంబ దత్త ఆలయమైన వేంకటేశ్వర స్వామి ఆలయం, అదే రోడ్డులోని ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం, కొత్తఅగ్రహరంలోని కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయం, కన్యకాపరమేశ్వరి ఆలయం, పూల్‌బాగ్‌ రోడ్డులో ఉన్న అయ్యప్పస్వామి ఆలయం, రింగురోడ్డులోని కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం, జ్ఞానసరస్వతి ఆలయం, పశుపతినాథేశ్వర స్వామి ఆలయాలు చాలా రోజుల తర్వాత భక్తులతో కళగా కనిపించాయి. భక్తులు తమ ఇష్టదేవతలను పూజించి, మొక్కుబడులు చెల్లించుకున్నారు. 60 ఏళ్లు దాటిన వృద్ధులను, పదేళ్లలోపు చిన్నారులను దర్శనాలకు అనుమతించలేదు. రామతీర్థం దేవస్థానంలోనూ స్వామి దర్శనానికి ఆలయ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. థర్మల్‌ స్ర్కీనింగ్‌ పరీక్షలతోపాటు  శానిటైజర్‌ వేసి... దర్శనాలకు అనుమతించారు. భక్తులను కోనేటిలో స్నానం చేయనివ్వలేదు. కొళాయిల వద్దే స్నానం చేయాలని బోర్డులు ఏర్పాటు చేశారు. 


Updated Date - 2020-06-11T09:33:45+05:30 IST